AP Liquor Scam: వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 3500 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగింది. ఈ కేసులో అనేక రకాలైన విషయాలు వెలుగు చూసాయి. ఇప్పటికీ దిగ్బ్రాంతి కరమైన నిజాలు బయట పడుతూనే ఉన్నాయి. నాడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ పని చేశారు.
న్యాయమూర్తికి వాంగ్మూలం
రజత్ భార్గవ లిక్కర్ కుంభకోణంలో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట సెక్షన్ 164 కింద న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత.. లభించిన ఆధారాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తుల అసలు రంగులు బయటపెట్టాయి. మొత్తంగా ఈ వ్యవహారంలో నాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తతంగం మొత్తం జరిగిందని.. ఆ కుట్ర వల్ల దాదాపు వేల కోట్ల అక్రమాలు జరిగాయని విచారణలో తేలింది. రజత్ చెప్పిన విషయాల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి.
నాడు ఏం జరిగిందంటే..
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో మద్యం సరఫరా.. బ్రాండ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ఇదంతా కూడా సీఎం ఓ ఆధ్వర్యంలో జరిగినట్టు అభియోగాలు ఉన్నాయి. అయితే వీటిని నాడు రజత్ గుర్తించారు. అంతేకాదు పాపులర్ బ్రాండ్లను పక్కనపెట్టి.. డిమాండ్ అసలు లేని.. నకిలీ.. స్థానిక బ్రాండ్లకు అడ్డగోలుగా ఇండెంట్లు పెట్టడం రజత్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో నాడు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డికి.. ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ కు ఆయన మెమోలు జారీ చేశారు. అయితే నాడు రజత్ ఇచ్చిన మెమోలను వెనక్కి తీసుకోవాలని.. వాసుదేవరెడ్డి.. సత్య ప్రసాద్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రజత్ కు ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలను నాడు ముఖ్యమంత్రి ఓటరిలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి.. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి జారీ చేశారు. ఆ తర్వాత మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ లెవెల్ లో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రజత్ తట్టుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ కుంభకోణంలో ఈ విషయాలను రజత్ ఆధారాలతో సహా విచారణ అధికారుల ముందు పెట్టారు.
రెక్కలు విరిచారు
రజత్ దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో ఆయన అధికారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరిగాయి. నాడు సీఎంఓ ఈ విషయంలో ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంది. మద్యం కుంభకోణంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రజత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఆయన దూకుడుకు కళ్ళెం వేసేందుకు ఎక్సైజ్ స్పెషల్ సిఎస్ పరిధిలో ఉండే ఆర్డర్ ఫర్ సేల్ అధికారాలను ఆయన నుంచి ఓవర్ నైట్లో తీసుకున్నారు. తమకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులకు అప్పగించారు. మాన్యువల్ విధానంలో ప్రసిద్ధ బ్రాండ్ల ఇండెంట్లు మార్చేశారు. కమిషన్లు మాత్రమే ఇచ్చే కంపెనీలకు ఆర్డర్లు వెళ్లే విధంగా చక్రం తిప్పారు. అయితే ఈ వ్యవహారాలను సీఎం సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు రజత్ బయటపెట్టారు. అయితే చివరి నిమిషంలో వాటిని మినిట్స్ దాకా చేరకుండా ధనుంజయ రెడ్డి తొక్కిపెట్టారు. నాడు సీఎంవో లో ఉన్న చాలామంది వ్యక్తులు ఆయనను బెదిరించడంతో తట్టుకోలేకపోయారు. అందువల్లే ఒంటరి పోరాటం చేయలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు.
మాయాజాలం చేసేందుకు..
కేవలం ఇండెంట్లు మార్చడం.. కమిషన్లు తీసుకోవడం మాత్రమే కాదు.. 2019 నుంచి 2024 వరకు వైసిపి ప్రభుత్వం ఉన్న కాలంలో మొత్తం ఓ ఎఫ్ ఎస్ ఆర్డర్ల డాటాను.. ప్రభుత్వ రికార్డులను మొత్తం మాయం చేయడానికి ప్రయత్నించారు. నాడు ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ పేరుతోnపాత తేదీలతో సంతకాలు చేసి సమాచారాన్ని మాయ చేయాలని కొంతమంది వ్యక్తులు సీఎం ఓ నుంచి తీసుకొచ్చారు. దానికి రజత్ అంగీకరించలేదు. పైగా తాను ఈ అక్రమాలకు తల ఊపలేనని.. దానికి సంబంధించిన రికార్డులు మొత్తం సచివాలయంలో ఉన్న దస్త్రాలలో సేఫ్ గా ఉన్నాయని .. దానికి సంబంధించిన సాక్షాలను రజత్ ఈడి అధికారుల ముందు ఉంచారు.
మరింత వేగవంతం
రజత్ ఈ వ్యవహారంలో కీలకమైన స్టేట్మెంట్లు ఇవ్వడంతో.. ఈడి.. సిట్ అధికారులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఏకంగా సీఎం స్థాయి నుంచి 3500 కోట్ల కిక్ బాక్స్.. మనీలాండరింగ్ వ్యవహారాలు సాగినట్టు తెలుస్తోంది. అందువల్లే నాడు ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరించిన వారంతా అరెస్టు అవుతామని భయపడుతున్నారు. ప్రజధనాన్ని దోచుకోవడం మాత్రమే కాకుండా.. జనాల ప్రాణాలతో ఆడుకున్న.. మద్యం ముఠా అసలు రంగు పూర్తిగా తొలగిపోతుందని.. టిడిపి నేతలు చెబుతున్నారు.