AP free Bus Scheme for Disabled People: ఏపీలో( Andhra Pradesh) దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. ఈనెల 18 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు గుంటూరు బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దివ్యాంగ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నారు. ఈ పాసుల ప్రక్రియకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా దివ్యాంగులకు సైతం ఉచిత ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ఉచితం..
దివ్యాంగులకు సంబంధించి ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఎక్స్ప్రెస్( Express), సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు. అయితే ఇప్పటివరకు 50 శాతం రాయితీతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉండేది. కానీ దానిని ఉచితం చేశారు. అందుకే జీరో ఫేర్ టికెట్ ఇవ్వనున్నారు. ఒకవైపు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూనే.. 50% రాయితీతో నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్లలో ప్రయాణించే అవకాశం కొనసాగించనున్నారు.
Also Read: విశాఖకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. స్వరూపమే మారిపోనుంది!
నేటి నుంచి పాసుల జారీ…
దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో( RTC bus counters ) నేటి నుంచి పాస్ లు జారీ చేయనున్నారు. కొత్త పాస్ పొందాలంటే.. సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డులతో బస్ పాస్ కౌంటర్ కు వెళితే జారీ చేస్తారు. ఒకవేళ గతంలో 50% రాయితీ వర్తించే పాస్ ఉన్నవాళ్లు.. అదే పాస్ తోనే ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే కొత్తగా ఆర్టీసీ డిజిటల్ పాస్ పొందే సౌకర్యం కల్పించింది. మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ డిజిటల్ పాస్ పొందవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా సదరం ఐడి నెంబర్ నమోదు చేస్తారు. అయితే ఈ పాస్ కోసం నామమాత్రం ఫీజును ఆన్లైన్లో చెల్లిస్తే చాలు క్యూ ఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ పాస్ జారీ చేస్తారు. 40 శాతానికి అంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు దివ్యాంగ శక్తి పథకానికి అర్హులు. మొన్ననే సీఎం చంద్రబాబు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ప్రకటన చేశారు. ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.