AP Budget 2026: ఏపీలో( Andhra Pradesh) ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. నిన్ననే మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.32 లక్షల కోట్ల అంచనా తో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలకు సమప్రాధాన్యం ఇస్తూ కేటాయింపులు చేశారు. అందులో భాగంగా రహదారుల మరమ్మతులకు, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ఇది నిజంగా శుభ పరిణామం. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రహదారులు కొంతవరకు బాగుపడ్డాయి. ప్రాధాన్యత క్రమంలో మెరుగుపరుచుతూ వచ్చారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో రహదారుల స్వరూపం మారనుంది.
* కేటాయించిన నిధులు ఇవే..
ఈసారి బడ్జెట్లో( budget) రహదారుల నిర్మాణానికి గాను రూ.3237 కోట్లు కేటాయించడం విశేషం. ఇప్పటికే రూ.2500 కోట్లతో 6036 కిలోమీటర్ల మేర రోడ్లను రెన్యువల్ పనులు చేపట్టారు. ఇప్పుడు తాజా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతో రహదారులు మెరుగుపడనున్నాయి.
* జిల్లా రహదారుల మరమత్తులకు, పునరుద్ధరణ పనులకు రూ.255 కోట్లు కేటాయించారు.
* రోడ్ల అప్గ్రేడేషన్ కు 100 కోట్లు కేటాయించారు
* ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ రహదారుల మరమ్మతులకు 130 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా.. 200 కోట్లు కేటాయించడం విశేషం.
* కేంద్ర రహదారి మౌలిక వస్తువుల నిధి కింద గత బడ్జెట్లో 550 కోట్లు కేటాయించారు. ఈసారి మాత్రం నాలుగు వందల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి.
* ఎన్ డి బి రోడ్లకు 580 కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది చివరికి ఈ రోడ్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
* పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల పనులకు పెద్ద ఎత్తున నిధులను బడ్జెట్లో కేటాయించారు.
* పీఎం జన్మన్ పథకం కింద 110 కోట్ల రూపాయలు కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేని గ్రామాల్లో రహదారులు నిర్మించనున్నారు.
* ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద మరో 656 కోట్లు రూపాయలు కేటాయించారు.
* ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో చేపడుతున్న రోడ్ల పనులకు సంబంధించి 377 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు.
* పంచాయతీరాజ్ రోడ్ల ఉన్నతీకరణకు 250 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు.