Amaravati capital: అమరావతి రాజధానిని( Amravati capital ) ప్రపంచ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళిక. 2014లో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ సీఎం గా అందరి అభిప్రాయంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. అప్పట్లో ఈ రాష్ట్రానికి బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం అందుకు అంగీకరించారు. వీలైనంత ఎక్కువగా అమరావతి రాజధానికి భూమిని సమీకరించాలని సలహా ఇచ్చారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి తన చేతికి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు. భారీగా భూ సేకరణ చేయాలన్న నోటితోనే అంత అవసరమా అన్నట్టు మాట్లాడారు. మూడు రాజధానులు అంటూ హడావిడి చేశారు. అయితే అప్పటికే భూములు ఇచ్చిన అమరావతి రైతుల గురించి కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. పైగా పోలీస్ కేసులతో పాటు ఉక్కు పాదం మోపారు. అయితే అమరావతి రైతుల అదృష్టమో తెలియదు కానీ.. కూటమి అధికారంలోకి వచ్చింది. అమరావతి పున ప్రారంభం అయ్యింది. కానీ వారి మనసులో గత అనుభవాలు సుడులు తిరుగుతున్నాయి.
* గత అనుభవాల దృష్ట్యా..
రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి రాజధానులను మార్చుతారన్న సందేహం ఉంది అమరావతి రైతుల్లో. ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పై నమ్మకం ఉన్నా.. రాజకీయ మార్పులపై మాత్రం వారికి అపనమ్మకం ఉంది. అందుకే అమరావతి రాజధానిని శాశ్వతం చేయాలన్న విజ్ఞప్తిని వారు సీఎం చంద్రబాబు ముందు పెట్టారు. ఆయన సైతం పెద్ద మనసుతో ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగానే ఈ నెల 28న అమరావతిని శాశ్వతం చేసే దిశగా ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ మరో తీర్మానం చేయనుంది. ఈ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం 2014లో సవరణలు చేయనుంది. అమరావతిని అధికారిక రాజధానిగా పొందుపరచనుంది. అయితే ఈ విభజన చట్టంలో రాజధాని పేరు చేరితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఏ ముఖ్యమంత్రి అనుకున్న దానిని మార్చడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం.
* 28న ప్రత్యేక సమావేశం..
ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం( assembly special session ) జరగనుంది. అసెంబ్లీలోనే ఈ కీలక తీర్మానం పెట్టనున్నారు. అయితే ప్రత్యేక సమావేశాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరుపై మళ్ళీ చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం పెట్టబోయే ఈ తీర్మానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ మద్దతు ఇస్తే తమది తప్పు అని ఒప్పుకోవాలి. మూడు రాజధానుల అంశం తప్పు అని వారి నోటితోనే ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే అమరావతికి శాశ్వత వ్యతిరేకముద్రం ఉండిపోతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీ గైర్హాజరు అవుతుందన్నది అందరి అభిప్రాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో??