KTR: అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలను ప్రజలు బాగోలేదని ముఖం మీద అంటే ఆ నాయకులకు ఎలా ఉంటుంది.. పైగా చుట్టూ మీడియా చూస్తూ ఉంటుంది.. వైరి పార్టీలు కూడా ఈ సందర్భాన్ని ప్రముఖంగా చూస్తాయి. ఎందుకంటే నేటి కాలంలో ఇటువంటి సందర్భాలు అరుదుగా చోటుచేసుకుంటాయి. కాకపోతే ఇటువంటి విషయాలను బయటకు రాకుండా ఇప్పటికాలంలో సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితి గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఎదురైంది. పైగా ఒక రైతు ఈ మాటను అనడంతో కేటీఆర్ నోటి వెంట మాట రాకుండా పోయింది
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాక అధ్యక్షుడిగా కేటీఆర్ ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను ఇచ్చి.. అమలు చేయక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు సహజంగానే గులాబీ పార్టీ అనుకూల మీడియా.. గొప్పగా ప్రచారం చేస్తాయి. ఆయనను భావి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తాయి. ప్రచారం వేరు.. ప్రజల్లో ఉన్న స్థాయి వేరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గులాబీ పార్టీకి ఎక్కడా కూడా గెలుపు అనేది తెలంగాణ రాష్ట్రంలో దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితం వచ్చింది. ఉప ఎన్నికల్లోను సున్నా ఫలితం వచ్చింది. స్థానిక ఎన్నికల్లో కూడా చెప్పుకునే స్థాయిలో స్థానాలు రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీని కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ఉంచుతున్నారని.. క్షేత్రస్థాయిలో ఆ బలం లేదని కవిత లాంటివాళ్ళు విమర్శిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. కాకపోతే దానిని గులాబీ పార్టీ ఒప్పుకోదు.
గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజల మనో గతాన్ని తెలుసుకుంటున్నారు. ఆయన పర్యటనలో భాగంగా రైతులను పలకరించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉందని.. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక రైతు మాత్రం మొహమాటం లేకుండా డబుల్ బెడ్ రూమ్ పథకం అస్సలు బాగోలేదని.. ఆ పథకం వల్లే ఓడిపోయారని మొహమాటం లేకుండా చెప్పారు. ఆ రైతు చెబుతున్నప్పుడు కేటీఆర్ అలానే చూస్తూ ఉండిపోయారు. పైగా తనకు చాలా సంవత్సరాల వయసుందని.. ఎంతో అనుభవం ఉందని.. అటువంటి పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారని కేటీఆర్ ను ఆ రైతు ఉద్దేశించి ప్రశ్నించారు.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చినట్లు చెప్పుకుంది. కానీ వాస్తవంలో పరిస్థితి ఎలా లేదు. కొన్ని బిల్డింగులు మాత్రమే చూపించి.. దానిని దేశానికి రోల్ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంది. కానీ వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలుసు. అందువల్లే ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు నేరుగా కేటీఆర్ కే చెబుతున్నారు. దీనిని బట్టి గులాబీ పార్టీ పదేళ్ల పరిపాలన కాలం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాగా ఆ రైతు కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.