Happy Days 2 Movie Update: కొన్ని సినిమాలు మన జీవితం పై ప్రభావం చూపిస్తాయి. ఆ సినిమాల కారణంగా మన లైఫ్ స్టైల్ ని కూడా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా మనపై అత్యంత ప్రభావం చూపించిన సినిమాల్లో ఒకటి హ్యాపీ డేస్. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో కొత్తవాళ్లతో 2007 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. కొత్త వాళ్ళతో బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి వండర్స్ కూడా క్రియేట్ చేయగలరా అని ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల వరకు థియేటర్స్ ఖాళీగా ఉండేవి . కానీ ఎప్పుడైతే పాజిటివ్ టాక్ వ్యాప్తి చెందిందో సినిమా వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో నమోదు అయ్యాయి. ఈ సినిమాని చూసిన తర్వాత కుర్రాళ్లకు అప్పట్లో బీటెక్ లో చేరాలనే కోరిక పుట్టిందని అప్పట్లో అంటుండేవారు.
ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల మళ్ళీ తెరకెక్కిస్తే బాగుండును అని ఆయన అభిమానులు అనుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరే సమయం వచ్చేసినట్టు తెలుస్తోంది. ‘కుబేర ‘ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమా చేస్తాడు అనే దానిపై సస్పెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడింది. ప్రస్తుతం ఆయన ‘హ్యాపీ డేస్ 2 ‘ స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడట. నేటి తరం జెన్ జీ యువత ఇంజనీరింగ్ కాలేజీలలో ఎలా ఉంటున్నారు ?, వాళ్ళ అలవాట్లు , గొడవలు వంటివి బాగా దగ్గరుండి స్టడీ చేసి ఈ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. త్వరలోనే స్క్రిప్ట్ పూర్తి చేసి , ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లానింగ్ చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. కుబేర చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సునీల్, ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడని సమాచారం.
అయితే హ్యాపీ డేస్ మొత్తం అప్పట్లో కొత్త వాళ్ళతో తీశారు. కానీ ఈసారి మాత్రం యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఇద్దరు హీరోలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. భారీ తారాగణం తోనే ఈ చిత్రం టీకెక్కుతుందట, అంతే కాకుండా కొత్త వాళ్ళను కూడా కొంతమందిని ఈ చిత్రం ద్వారా తీసుకొస్తారట . అప్పట్లో హ్యాపీ డేస్ చిత్రం కేవలం కోటి రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి సినిమాలకు మామూలు క్రేజ్ లేదు. శేఖర్ కమ్ముల సరిగ్గా తీస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు.