Kenya: అశోకుడు మొక్కలు నాటించెను అని ఇప్పటికీ ఎందుకు చదువుకుంటామంటే.. అతడు నాటిన మొక్కలు చెట్లయ్యాయి. ఆ చెట్లు కాస్త అడవులయ్యాయి. ఆ అడవుల్లో ఎన్నో రకాల జంతువులు నివాసం ఉంటున్నాయి. వాతావరణం చల్లగా మారి వర్షాలకు కారణమవుతున్నాయి. అశోకుడు సాగించిన పాలనకంటే.. సాధించిన విజయాల కంటే.. నిర్మించిన భవనాల కంటే.. ఆక్రమించిన రాజ్యాల కంటే.. మొక్కల గురించే ఎక్కువ ఎందుకు చెబుతున్నామంటే.. ఆ మొక్కల వల్ల మనిషి మనగడ ఆధారపడి ఉంది. మనిషి మాత్రమే కాదు ఈ సమస్త భూగోళం మీద జంతుజాలం బతుకు ఆధారపడి ఉంది. మొక్కల తర్వాత మనిషి గతిని ఆ స్థాయిలో మార్చేవి రోడ్లు. ఆ రోడ్ల వల్లే ఎన్నో ప్రాంతాలు బాగుపడ్డాయి. కొత్త ప్రాంతాలు నిర్మాణమయ్యాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాంతాలు సరికొత్త ఆకృతిని దాల్చాయి. అలాంటి ఓ రోడ్డు ఓ దేశ చరిత్ర గతిని పూర్తిగా మార్చింది. కరువుకు , నీటి కొరతకు ఆలవాలంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం పచ్చగా మారింది. అంతేకాదు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇంతకీ ఏమిటి ఆ ప్రాంతం? ఎక్కడ ఉంది ఆ దేశం? ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆఫ్రికా ఖండం అంటే తీవ్రమైన దుర్భిక్షం మనకు గుర్తుకొస్తుంది. అలాంటి ఆఫ్రికా ఖండంలో కెన్యా మరింత పేద దేశం. ఇక్కడ మౌలిక వసతులు అంతగా ఉండదు.. ఉపాధి అవకాశాలు పెద్దగా లభించవు. ఆదాయం తక్కువ కాబట్టి ప్రభుత్వపరంగా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. ఇతర దేశాలు రుణాల ఇస్తే తప్ప ఆ దేశం మనగడ సాగించలేదు. ఆ దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందిన దేశాలు రుణాలు ఇస్తున్నాయి. సాయం పేరిట ఎంతో కొంత నగదు అందజేస్తున్నాయి. వాటి ద్వారానే అక్కడ ప్రభుత్వం మునగడ సాగిస్తోంది. యునెస్కో లాంటి సంస్థలు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. కెన్యా దేశం ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించి ఉంది. ఉత్తర ప్రాంతంలో డెల్టా భూములు, విస్తారమైన అటవీ ప్రాంతాలు ఉంటాయి. కెన్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక్కడ రోడ్ల నిర్మాణాలు కూడా అంతంది మాత్రం గానే ఉంటాయి. మారుతున్న ప్రజల జీవన విధానాలు, అవసరాల దృష్ట్యా కెన్యా ప్రభుత్వం గ్రేట్ నార్త్ రోడ్డు నిర్మించింది. ఇది కెన్యా ఆర్థిక పరిస్థితిని సమూలంగా మార్చింది.
గతంలో కెన్యా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే రోజుల తరబడి ప్రయాణించాల్సి ఉండేది. పైగా దట్టమైన అటవీ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది.. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ధైర్యం చేసి నార్త్ ప్రాంతంలో రోడ్డు నిర్మించింది. దీనికి ది గ్రేట్ నార్త్ కెన్యా రోడ్ అని నామకరణం చేసింది. దీనిని పలు ప్రాంతాలను కలుపుతూ నిర్మించింది. ఈ రోడ్డు నిర్మాణం మ్వై కిబాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభమైతే.. ప్రస్తుత అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా హయాంలో పూర్తయింది. వందల కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఇసియోల్, మోయాల్, మార్సాబిట్, సుడాన్, ఇథియోపియా, నైరోబి వంటి ప్రాంతాలను కలుపుతుంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. ప్రజలు సత్వరమే వారి గమ్యస్థానాన్ని చేరుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ రోడ్డు నిర్మాణ కోసం ఎంత ఖర్చయిందో తెలియదు కానీ.. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. స్థానిక యువతకు ఉపాధి లభిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల చుట్టుపక్కల శుష్క భూముల్లో మొక్కలు పెంచారు. అది కాస్త దట్టమైన అడవిగా మారింది. ఆ అడవుల్లో జంతువులు నివసిస్తున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల కెన్యాకు పర్యాటకంగాను దండిగా ఆదాయం వస్తుంది.” ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం మాకు మరో స్వాతంత్రం లాంటిది. కెన్యా స్వాతంత్రం కోసం చాలా సంవత్సరాలు పోరాడింది. 1963లో స్వాతంత్రాన్ని పొందింది. ఈ రహదారి నిర్మాణం ప్రారంభించినప్పుడు.. అది పూర్తయిన తర్వాత రాకపోకలు సాగిస్తున్నప్పుడు మాకు పూర్తి స్వేచ్ఛ లభించినట్టు అనిపిస్తోంది” అని కెన్యా వాసులు అంటున్నారు.