https://oktelugu.com/

YS Sharmila : బ్రేకింగ్: సోదరుడిపై పోటీకి దిగిన వైఎస్ షర్మిల

అయితే ఇక్కడ షర్మిల వైసిపి ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే టిడిపి అభ్యర్థికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.అందుకే ఇక్కడ టిడిపి అభ్యర్థి భూపేష్ రెడ్డి బదులు తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అనుకున్నట్టే సోదరుడు జగన్ కు షర్మిల గట్టి సవాల్ విసురుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 1, 2024 1:25 pm
    YS Sharmila

    YS Sharmila

    Follow us on

    YS Sharmila : వేసవితో పాటు ఏపీలో రాజకీయాల సైతం వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అధికార వైసిపి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది. అటు ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థుల సైతం దాదాపు ఖరారయ్యారు. వైసీపీ వర్సెస్ ఎన్డి ఏ అన్నట్టు పరిస్థితి ఉంది.ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మహాకూటమిగా బరిలో దిగనుంది. దీంతో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదని తేలిపోయింది.

    రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి పేర్లను ప్రకటించారు. జాతీయస్థాయిలో వామపక్షాలు ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి. ఏపీలో సైతం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. చిన్నాచితకా పార్టీలు సైతం కాంగ్రెస్ తో జత కలిసే అవకాశం ఉంది. అందుకే ఆ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

    కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనుండడంతో అక్కడ రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ వైసిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఖరారు చేసింది. టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. జగన్ ను రాజకీయంగా ఢీకొడుతున్న షర్మిల అందుకు తగ్గట్టుగానే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కడప అంటేనే వైయస్ కుటుంబానికి అడ్డా. అటువంటి చోట వైయస్ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరిలో దిగుతుండడం ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కూడా చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఆటు వైయస్సార్ అభిమానుల్లో సైతం ఒక రకమైన గందరగోళం నెలకొంది. వారు ఎటువైపు మొగ్గు చూపుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

    గత కొద్దిరోజులుగా వైయస్ కుటుంబంలో రాజకీయ విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా సోదరుడు జగన్ ను షర్మిల విభేదిస్తున్నారు. కాంగ్రెస్లో చేరి పిసిసి పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో అవినాష్ పాత్రను, నిందితులను జగన్ వెనుకేసుకొస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఇప్పుడు షర్మిల నేరుగా రంగంలోకి దిగడం విశేషం. అయితే ఇక్కడ షర్మిల వైసిపి ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే టిడిపి అభ్యర్థికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.అందుకే ఇక్కడ టిడిపి అభ్యర్థి భూపేష్ రెడ్డి బదులు తనకు టికెట్ కావాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అనుకున్నట్టే సోదరుడు జగన్ కు షర్మిల గట్టి సవాల్ విసురుతున్నారు.