China Tariff: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. రెండు ఆర్థిక సూపర్‌పవర్‌లు ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధిస్తూ గట్టిగా తలపడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులతో ఒత్తిడి పెంచుతుండగా, చైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిస్పందిస్తోంది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
China Tariff: జపానా మజాకా.. 6 గంటలో అద్భుతం చేశారు!
అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్(Trade war) ఉధృతమవుతోంది. చైనా(Chaina)ను దారిలో పెట్టుకునేందకు అమెరికా సుంకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై సుంకాల అమలు మూడు నెలలు వాయిదా వేసినా.. చైనా విషయంలో మాత్రం దూకుడు కొనసాగిస్తోంది. ఇక చైనా కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అన్నట్లుగానే అమెరికా (America)విధించే సుంకాలకు దీటుగా సుంకాలు విధిస్తోంది. గురువారం(ఏప్రిల్ 10న) శ్వేతసౌధం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేస్తూ, చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు మొత్తం 145 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా, చైనా శుక్రవారం(ఏప్రిల్ 11న) అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సుంకాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సుంకాల పెంపును ‘‘సంఖ్యల ఆట’’గా అభివర్ణించిన చైనా మంత్రిత్వ శాఖ, దీని వల్ల తక్షణ ఆర్థిక ప్రభావం తక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఈ వివాదం దీర్ఘకాలంలో రెండు దేశాలపై ప్రతికూల పరిణామాలను చూపుతుందని హెచ్చరించింది. అమెరికా తమ వస్తువులపై విధించిన సుంకాలను తొలగించాలని, ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఒక్క అడుగు వెనక్కి లేదు
వాషింగ్టన్(Washington) ఒత్తిడులకు తాము లొంగబోమని. చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి యాంగ్ కియాన్ మాట్లాడుతూ, ‘‘అమెరికా సుంకాల యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటే, చివరి వరకూ మేం కూడా పోరాడతాం,’’ అని గట్టిగా చెప్పారు. అయినప్పటికీ, చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ దౌత్యపరమైన సంకేతం ఇచ్చారు. అయితే, ఈ చర్చలు ‘‘పరస్పర గౌరవం’’ ఆధారంగా జరగాలని షరతు విధించారు. స్థానిక చైనీస్ మీడియా ప్రకారం, అమెరికా విధించిన సుంకాలపై బీజింగ్(Beging) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత క్లిష్టతరం చేయడమే కాకుండా, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
ఆర్థిక ఒడిదొడుకులు
ఈ సుంకాల యుద్ధం చైనీస్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది, ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమల్లో పనిచేసే వారిలో. అమెరికాకు ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. చిన్న, మధ్య తరగతి సంస్థలు, అమెరికా సుంకాల వల్ల డిమాండ్ తగ్గడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాలో కూడా, సుంకాల వల్ల చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటి వస్తువుల ధరలు పెరగడంతో వినియోగదారులు, వ్యాపారాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సుంకాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగించడం, సరఫరా గొలుసులను అస్తవ్యస్తం చేయడం, ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐక్యతకు పిలుపు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xinping) ఈ సుంకాల వివాదంపై తొలిసారి స్పందించారు. బీజింగ్‌లో స్పెయిన్(Spain) ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశంలో, అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ‘‘ఏకపక్ష బెదిరింపు’’గా అభివర్ణించారు. ఈ చర్యలను ఎదుర్కోవడానికి ఐరోపా యూనియన్(Europian Union) తమతో కలిసి నిలబడాలని పిలుపునిచ్చారు. ‘‘చైనా, ఐరోపా తమ అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడే మన చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోగలం,’’ అని జిన్‌పింగ్æ అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో పారదర్శకత, న్యాయాన్ని సమర్థించాలని ఆయన పేర్కొన్నారు. జిన్పింగ్ వ్యాఖ్యలు, అమెరికా వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమీకరించాలనే చైనా ఉద్దేశాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనాతో వాణిజ్య వివాదాలను ఎదుర్కొంటున్న ఐరోపా యూనియన్, ఈ పిలుపుకు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది.
సంక్లిష్ట పరిస్థితి
రెండు దేశాలు గట్టిగా నిలబడుతున్నప్పటికీ, జాగ్రత్తగా చర్చల దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనా కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తూనే, చర్చలకు సిద్ధమని చెప్పడం పూర్తి ఆర్థిక ఘర్షణను నివారించాలనే ఆలోచనను సూచిస్తుంది. అమెరికాలో కూడా, మార్కెట్‌లను స్థిరీకరించడం, వినియోగదారులను ధరల పెరుగుదల నుంచి కాపాడాలనే ఒత్తిడి చర్చల వైపు నెట్టవచ్చు. అయితే, పరిష్కారం కోసం మార్గం సవాళ్లతో నిండి ఉంది. అమెరికా, వాణిజ్య అసమతుల్యతను సరిచేయడానికి మరియు స్థానిక పరిశ్రమలను రక్షించడానికి సుంకాలు అవసరమని పట్టుబడుతోంది. చైనా మాత్రం వీటిని తమ ఆర్థిక స్వాతంత్య్రంపై దాడిగా భావిస్తోంది. రాజీ లేకపోతే, ఈ వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగి, ప్రపంచ మార్కెట్‌లకు నష్టం కలిగించే ప్రమాదం ఉంది.