American intelligence : అమెరికా(America) ప్రభుత్వం వలసదారుల విషయంలో తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో(Social Media) యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు గుర్తిస్తే, ఆ వ్యక్తులకు వీసాలు, గ్రీన్‌కార్డ్‌లు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. స్టూడెంట్ వీసాల నుంచి శాశ్వత నివాస అర్హతల వరకు, దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై నిశితంగా నిఘా ఉంచనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం అమెరికా జాతీయ భద్రత, వలస విధానాలపై కఠిన వైఖరిని సూచిస్తోంది.
Also Read : అమెరికా వీడితే తిరిగి రాగలమా?
యూదు వ్యతిరేకత, ఉగ్రవాద సానుభూతిపై నిషేధం
అమెరికా హమాస్(Hamas), పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బొల్లా, యెమెన్ హూతీల వంటి సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా వర్గీకరించింది. ఈ సంస్థలకు మద్దతు ఇస్తూ లేదా వాటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు తేలితే, అది యూదు(Yudu) వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులు వీసా దరఖాస్తు తిరస్కరణకు దారితీస్తాయని, ఇప్పటికే వీసా లేదా గ్రీన్‌కార్డ్ ఉన్నవారి నివాస హోదా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ చర్యలు అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాద సానుభూతిని నిరోధించేందుకు ఉద్దేశించినవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ట్రికియా మెక్‌లాప్లిన్ తెలిపారు. ‘ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో స్థానం లేదు. వారిని మా దేశంలోకి అనుమతించడం లేదా ఇక్కడ ఉంచడం మాకు అవసరం లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు.
నిఘా విధానం..
ఈ కొత్త నిబంధనలో భాగంగా, అమెరికా వీసా, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తోంది. స్టూడెంట్ వీసాలు (F–1, J–1), వర్క్ వీసాలు (H–1B), టూరిస్ట్ వీసాలు (B–1/B–2), ఇమిగ్రెంట్ వీసాలు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. USCIS, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్తంగా సోషల్ మీడియా కంటెంట్‌ను విశ్లేషించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో, దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో చేసిన సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు, షేర్లు, లైక్‌లను కూడా పరిశీలిస్తారు. ఈ విధానం 2019లో మొదలైనప్పటికీ, యూదు వ్యతిరేక కంటెంట్‌పై దృష్టి సారించడం ఇప్పుడు మరింత తీవ్రమైంది.
కఠిన వలస విధానాలు
2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, వలస విధానాలు మరింత కఠినమయ్యాయి. ముఖ్యంగా, పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయడం, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన వారిని దేశం నుంచి బహిష్కరించడం వంటి చర్యలు తీవ్రంగా అమలవుతున్నాయి. గత నెలలో 300 మందికి పైగా విదేశీయుల వీసాలు రద్దయినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ చర్యలు అమెరికా క్యాంపస్‌లలో పాలస్తీనా మద్దతు ఆందోళనలను అణచివేయడానికి ఉద్దేశించినవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ పరిపాలన వలసదారులపై అనేక ఇతర కఠిన నిబంధనలను కూడా అమలు చేస్తోంది. ఉదాహరణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, వేగంగా వాహనం నడపడం వంటి చిన్న తప్పులకు కూడా వీసా రద్దు చేసే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విధానాలు అమెరికా జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి అవసరమని ట్రంప్ పరిపాలన వాదిస్తున్నప్పటికీ, ఇవి వలసదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
అంతర్జాతీయంగా విమర్శలు
ఈ కొత్త నిబంధన అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని దేశాలు, మానవ హక్కుల సంస్థలు ఈ చర్యను వాక్ స్వాతంత్య్రానికి విఘాతంగా పరిగణిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వీసా తిరస్కరణ లేదా నివాస హోదా రద్దు చేయడం, వ్యక్తిగత అభిప్రాయాలను అణచివేసే చర్యగా విమర్శకులు భావిస్తున్నారు. అమెరికా ఈ చర్యలను జాతీయ భద్రతకు అవసరమైనవిగా సమర్థిస్తున్నప్పటికీ, ఈ నిబంధనలు అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వలసదారుల మధ్య ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు, ఈ నిబంధనలు అమెరికాలో యూదు సమాజంపై దాడులు, విద్వేష భాషణలను నిరోధించడానికి ఉద్దేశించినవని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. 2023–24లో యూదు వ్యతిరేక ఘటనలు పెరిగిన నేపథ్యంలో, ఈ చర్యలు అవసరమని అధికారులు వాదిస్తున్నారు. అయితే, ఈ నిబంధనలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయి, లేదా ఇవి వలసదారుల హక్కులను ఎంతమేరకు పరిమితం చేస్తాయనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
భారతీయలపై ప్రభావం
ఈ కొత్త నిబంధన భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులపై కూడా ప్రభావం చూపవచ్చు. అమెరికాలో భారతీయ వలసదారుల సంఖ్య గణనీయంగా ఉంది, మరియు ఏ–1ఆ వీసాలు, స్టూడెంట్ వీసాలపై ఆధారపడే వారు ఈ నిబంధనల వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు, ముఖ్యంగా అంతర్జాతీయ సంఘటనలపై కామెంట్ చేసేటప్పుడు, భారతీయ దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిబంధనలు భారత్‌తో సహా అనేక దేశాల నుంచి వచ్చే వలసదారులకు సవాళ్లను కలిగించే అవకాశం ఉంది.
Also Read : ఏంది మావ ఇదీ.. చివరికి ట్రంప్, మస్క్ పరిస్థితి ఇంతకు దిగజారింది..