Afghanistan Pakistan Conflict: ఆఫ్గానిస్తాన్–పాకిస్తాన్ ఘర్షణ చల్లారడం లేదు. కొన్ని రోజులు పైకి ప్రశాంతంగా కనిపిస్తుతన్నా నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. మొన్నటి వరకు పాకిస్తాన్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా తెహ్రీక్ ఎ తాలిబార్ పాకిస్తాన్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని వృద్ధులు, మహిళలపై వైమానిక దాడులు చేసింది. తాజాగా ఆఫ్గానిస్తాన్ పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చింది. ఈసారి డ్రోన్ల ద్వారా కీలకమైన చిత్రాల్ ప్రాంతంపై దాడి చేసింది.
చిత్రాల్ చాలా కీలక ప్రాతం..
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని చిత్రాల్ చిన్న పట్టణమైనప్పటికీ, దాని స్థానం వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. ఇది సరిహద్దు దగ్గరి చివరి పెద్ద నివాస ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ఎయిర్‌స్ట్రిప్, ఆర్మీ స్టేషన్ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశ మార్గాలు ఉన్నాయి. నేషనల్ హైవే 95 మన్‌షేరా, చిలాస్ మార్గాల ద్వారా అనుసంధానం ఉంది. ముజఫరాబాద్‌కు వెళ్లే హైవే కూడా దగ్గరలోనే ఉంది. అంతేకాకుండా, జీ 1209 హైవే ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపెక్) ప్రారంభ దశకు సంబంధించినది. కుంజరా దాటిన తర్వాత ఈ మార్గం ముఖ్యమవుతుంది. వకాన్ కారిడార్‌కు చేరుకోవడానికి కూడా ఇది ముఖ్యమైన బిందువు. కాబట్టి చిత్రాల్‌ను లక్ష్యంగా చేసుకోవడం అంటే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్, సిపెక్ అనే మూడు లక్ష్యాలను ఆఫ్గాన్ ఏకకాలంలో టార్గెట్ చేసింది.
నెల రోజుల్లో రెండు దాడులు..
బజావర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆఫ్గాన్ సైన్యం ఇటీవల భూతల దాడులు చేసి చెక్‌పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. టీటీపీ కూడా ఈ ప్రాంతాలపై దృష్టి పెట్టి పాకిస్తాన్ సైన్యం సులభంగా మోహరించకుండా చూస్తుంది. జూలైలో షా సలీం, గరం చష్మా ప్రాంతాల్లో ఒక దాడి, తర్వాత చిత్రాల్‌పై మరో దాడి జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇప్పటికే హింస పెరిగి, ఎన్నికలను ప్రజలు బహిష్కరిస్తున్న నేపథ్యంలో ఈ డ్రోన్ దాడులు పాకిస్తాన్‌ను ఆశ్చర్యపరిచాయి. ఆఫ్గానిస్తాన్ వద్ద సమర్థమైన వైమానిక శక్తి లేదని పాకిస్తాన్ భావించేది. అయితే ఇప్పుడు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి లక్ష్యాలను ఎంపిక చేసి దాడి చేస్తున్నారు. పాకిస్తాన్ గతంలో ఆఫ్గాన్ భూభాగంలో సామాన్యులను కూడా ప్రభావితం చేసే దాడులు చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆఫ్గాన్ వైపు నుంచి మరింత నిర్దిష్టమైన లక్ష్యాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
డ్రోన్ సామర్థ్యం ఎక్కడిది?
ఆఫ్గాన్ సైన్యం డ్రోన్ టెక్నాలజీని ఎలా సమకూర్చుకుంది, దాన్ని సమర్థంగా నిర్వహించే సామర్థ్యం ఎలా సాధించింది అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇది స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్నదా, లేక బయటి సహాయం ఉందా అనే అంశం భవిష్యత్తు విశ్లేషణకు తెర తీస్తుంది. సరిహద్దు భద్రతను ప్రభావితం చేసే ఈ సామర్థ్యం పాకిస్తాన్‌కు కొత్త సవాలుగా మారింది.
పట్టించుకోని పాక్ ఆర్మీ చీఫ్..
ఆసిమ్ మునీర్ విదేశీ పర్యటనలు, రాజ్యాంగ సవరణలు, న్యూక్లియర్ కమాండ్ అధికారాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సరిహద్దు భద్రత, సైన్యం బలోపేతం, ఆఫ్గాన్ దాడులను నిరోధించే చర్యలపై తగినంత దృష్టి పెట్టకపోవడం వల్ల సైన్యం అప్రమత్తంగా లేదని తెలుస్తోంది. ఇదే అదనుగా ఆఫ్గాన్ దాడులు చేసింది. ఈ పరిస్థితి పాకిస్తాన్ అంతర్గత భద్రతను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది.
చిత్రాల్‌పై డ్రోన్ దాడులు కేవలం సైనిక చర్య కాదు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక మార్గాలు, ఆర్థిక కారిడార్, సరిహద్దు నియంత్రణపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అశాంతి, టీటీపీ కార్యకలాపాలు, సరిహద్దు ఘర్షణలు కలిసి పాకిస్తాన్‌కు బహుముఖ సవాలును సృష్టిస్తున్నాయి. ఆఫ్గాన్ వైపు నుంచి డ్రోన్ సామర్థ్యం పెరగడం భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.