Kanika Tekriwal : ఆడుతూ పాడుతూ.. ఇష్టమైన చదువు చదువుకుంటూ.. తోటి స్నేహితులతో జీవితాన్ని ఆస్వాదించాల్సిన వయసులో.. ఆమె వినకూడని వార్త విన్నది. డాక్టర్ నోటి వెంట క్యాన్సర్ అనే మాట విని ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇది పరీక్ష కాలమంటూ ధైర్యవచనాలు చెప్పుకుంది. జుట్టు ఊడిపోయింది. మందులు వాడుతుంటే శరీరం ఇబ్బంది పడింది. ఎన్నో కలలు కన్న జీవితం ఇలా అయిపోతుందేమిటి అని బాధపడింది. మొండి ధైర్యంతో క్యాన్సర్ వ్యాధిని జయించింది. ఒక్కసారిగా మరింత ఆశావాహ దృక్పథంతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. సీన్ కట్ చేస్తే 33 సంవత్సరాలకు 420 కోట్ల ఆస్తులకు అధిపతి అయింది. 10 సొంత జెట్ విమానాలకు ఓనర్ అయింది. ఇంతకు ఎవరు ఆ యువతి? ఏమిటి ఆమె విజయ గాథ? ఈ కథనంలో తెలుసుకుందాం రండి..
కనికా టేక్రివాల్.. 1990లో మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో మార్వాడి కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య మొత్తం లారెన్స్, లవ్ డేల్ పాఠశాలలో పూర్తి చేసింది. కోవెంటరీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత 2012లో జెట్ సెట్ గో అనే విమానయాన సంస్థను స్థాపించింది. అతి తక్కువ సమయంలోనే విజయం సాధించి సంస్థను విజయవంతంగా నడిపిస్తోంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూనే.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
కనికా తనకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆ సమయంలో తనకు తాను సర్ది చెప్పుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదివింది. క్యాన్సర్ వ్యాధి బారినపడి దానిని జయించిన వారి విజయ గాధలను చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచిన ప్రముఖ సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తనలో తానే ఆశావాహ దృక్పథాన్ని నింపుకుంది. అలా జెట్ సెట్ గో అనే సంస్థను ప్రారంభించింది. 2012 సంవత్సరంలో ఈ సంస్థను ప్రారంభించిన తర్వాత దేశంలోనే గుర్తింపు పొందిన కంపెనీగా ఇది ఎదిగింది. ఏకంగా 6 వేల విమానాలను నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో కనిక తనదైన ముద్ర వేసింది. ఈ 600 విమానాలలో చార్టెడ్ ఫ్లైట్స్, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం కనికా వయసు 33 సంవత్సరాలు. వయసులో ఆమె సొంత 10 ప్రైవేట్ జెట్ విమానాలు కలిగి ఉంది. ఆమె కంపెనీ విలువ 420 కోట్లకు చేరింది. ప్రస్తుతం విమానయాన రంగానికి అత్యంత విలువైన మార్కెట్ ఉండడంతో తన కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకునే పనిలో పడింది. విమానయాన రంగంలోకి వచ్చే ఔత్సాహిక యువతి యువకులకు మెరుగైన వేతనంతో ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది. క్యాన్సర్ వచ్చిందని భయపడకుండా.. ఆ వ్యాధి తననేమో చేస్తుందని బెదిరిపోకుండా.. తనలో తాను ఆశావాహ దృక్పథం నింపుకున్న కనికా టేక్రివాల్ ఎంతోమందికి ఆదర్శం.