WhatsApp : ఇక గ్రూప్‌లో ముఖ్యమైన మెసేజ్‌లు ఎప్పటికీ పిన్ చేసుకోవచ్చు.. కొత్తగా చేరిన సభ్యులకు పాత చాటింగ్ పంపే అవకాశం కూడా.. మరో రెండు ఆసక్తికరమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల కోసం మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. గ్రూప్ చాటింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, సభ్యుల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు ఏకంగా నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా గ్రూప్‌లో ముఖ్యమైన సందేశాలను శాశ్వతంగా పిన్ చేసుకునే సదుపాయం, కొత్తగా గ్రూప్‌లో చేరిన సభ్యులకు గత చాటింగ్ వివరాలను పంపించే అవకాశం ఈ అప్‌డేట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఇటీవల గెస్ట్ కాల్స్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్.. ఇప్పుడు గ్రూప్ చాట్స్‌పై దృష్టి సారించింది.
1. ఇక మెసేజ్‌లను శాశ్వతంగా పిన్ చేసుకోవచ్చు!
వాట్సాప్ గ్రూపుల్లో ముఖ్యమైన సమాచారం మిస్ కాకుండా ఉండేందుకు మెసేజ్‌లను పిన్ చేసే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఇప్పటివరకు ఒక మెసేజ్‌ను గరిష్ఠంగా 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా తీసుకొస్తున్న అప్‌డేట్‌తో ఈ పరిమితికి స్వస్తి పలకనుంది. ఇకపై గ్రూప్‌లో అవసరమైన ముఖ్యమైన మెసేజ్‌లను ‘Forever’ ఆప్షన్ ద్వారా శాశ్వతంగా పిన్ చేసుకోవచ్చు. దీనివల్ల గ్రూప్ సభ్యులు ఎప్పుడైనా ముఖ్యమైన సమాచారం, ప్రకటనలు, చిరునామాలు, ఇతర వివరాలను సులభంగా గుర్తించవచ్చు.
2. కొత్త సభ్యులకు పాత చాటింగ్ పంపించే సదుపాయం
గ్రూప్‌లో కొత్తగా చేరిన వారికి గతంలో జరిగిన చర్చల గురించి తెలియక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై కొత్త సభ్యుడు గ్రూప్‌లో చేరిన తర్వాత కూడా అతడికి గత సందేశాలను పంపించే అవకాశం ఉంటుంది. గ్రూప్ అడ్మిన్లు లేదా మేనేజర్లు ఇటీవల చేరిన సభ్యుడి పేరుపై ట్యాప్ చేసి చాట్ హిస్టరీని షేర్ చేయవచ్చు. గతంలో సభ్యులను గ్రూప్‌లో చేర్చే సమయంలో మాత్రమే చాట్ హిస్టరీని పంపించే అవకాశం ఉండేది. ఇప్పుడు అప్పట్లో మర్చిపోయిన వారికి కూడా తర్వాత పంపించవచ్చు. ఈ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణతో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
3. మెన్షన్ చేసిన మెసేజ్‌లను సులభంగా గుర్తించవచ్చు
గ్రూపుల్లో రోజుకు వందల సంఖ్యలో సందేశాలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఎవరైనా తమను ట్యాగ్ చేసినా ఆ మెసేజ్‌ను గుర్తించడం కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ మెన్షన్ ఫిల్టర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తే గ్రూప్‌లో తమను మెన్షన్ చేసిన సందేశాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేసి చూడవచ్చు. దీంతో ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అయ్యే అవకాశం తగ్గుతుంది.
4. గ్రూప్ సభ్యుల కోసం ప్రత్యేక స్టేటస్‌లు
ఇక నాలుగో ఫీచర్ గ్రూప్ స్టేటస్. ఇప్పటివరకు వాట్సాప్ స్టేటస్‌ను ఎంపిక చేసిన కాంటాక్ట్స్‌తో లేదా ఇతర నిర్దిష్ట ప్రేక్షకులతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త ఫీచర్‌తో ప్రత్యేక గ్రూప్ సభ్యులకు మాత్రమే స్టేటస్‌ను షేర్ చేయవచ్చు. ఫొటోలు, వీడియోల రూపంలో పెట్టే ఈ స్టేటస్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి. అంతేకాదు, గ్రూప్‌లోని ఇతర సభ్యులు వాటికి రియాక్ట్ కావడంతో పాటు తమ స్టేటస్‌లను కూడా జోడించవచ్చు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
ఈ నాలుగు ఫీచర్లను దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అందువల్ల కొంతమందికి ముందుగానే, మరికొందరికి తర్వాత అప్‌డేట్ రావచ్చు. వినియోగదారులు తమ వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
ఈ కొత్త ఫీచర్లు కుటుంబ గ్రూపులు, స్నేహితుల గ్రూపులు, ఆఫీస్ గ్రూపులు, కమ్యూనిటీ గ్రూపుల్లో సమాచారాన్ని నిర్వహించుకోవడాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. ముఖ్యంగా శాశ్వత మెసేజ్ పిన్ సదుపాయం, కొత్త సభ్యులకు పాత చాటింగ్ పంపించే ఫీచర్ గ్రూప్ అడ్మిన్లకు ఎంతో ఉపయోగపడనున్నాయి.