Homeటాప్ స్టోరీస్Rahul Gandhi : రాహుల్ గాంధీ మరోసారి విఫల నాయకుడిగా తేల్చిన ఇండియా టుడే సర్వే

Rahul Gandhi : రాహుల్ గాంధీ మరోసారి విఫల నాయకుడిగా తేల్చిన ఇండియా టుడే సర్వే

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో ప్రజల మూడ్‌ను అంచనా వేసే సర్వేల్లో ఇండియా టుడే – సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్కు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ సర్వే తాజాగా మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి వెల్లడైన ప్రజాభిప్రాయం ఆసక్తికరంగా మారింది. సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ […]

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో ప్రజల మూడ్‌ను అంచనా వేసే సర్వేల్లో ఇండియా టుడే – సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్కు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ సర్వే తాజాగా మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి వెల్లడైన ప్రజాభిప్రాయం ఆసక్తికరంగా మారింది.

సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రజాదరణ విషయంలోనూ మోదీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు సర్వే చెబుతోంది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ, రాజకీయ నాయకత్వంపై ప్రజల ప్రస్తుత అభిప్రాయం మాత్రం స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది.

ఇక్కడే రాహుల్ గాంధీ విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షానికి బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకునేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు సరైన స్థాయిలో ప్రజామోదం లభిస్తోందా? అన్నదే అసలు ప్రశ్న. సర్వేలో రాహుల్‌కు కేవలం 27 శాతం ప్రజామోదం లభించడం ఆయన నాయకత్వానికి పెద్ద సవాలుగా కనిపిస్తోంది.

అయితే ఈ ఫలితాలను కేవలం మోదీ వర్సెస్ రాహుల్ పోటీగా చూడటం కూడా సరైంది కాదు. ప్రజలు ఏ అంశాలను సమర్థిస్తున్నారు? ఏ విధానాలపై వారికి నమ్మకం ఉంది? అన్నదే అసలు విశ్లేషించాల్సిన అంశం.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) కు విస్తృత మద్దతు లభించడం, వన్ నేషన్–వన్ ఎలక్షన్కు సుమారు 70 శాతం మంది ప్రజలు అనుకూలంగా స్పందించడం గమనించదగ్గ పరిణామాలు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు కూడా మెజారిటీ ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు సర్వే చెబుతోంది. అలాగే ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లను తొలగించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వంటి చర్యలకు కూడా ప్రజల మద్దతు కనిపించడం మరో కీలక అంశం.

అక్రమ వలసదారుల ఏరివేత విషయంలోనూ ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం మోదీ ప్రభుత్వం గత కొంతకాలంగా ముందుకు తీసుకెళ్తున్న రాజకీయ, పరిపాలనా అంశాలకు ప్రజల్లో ఉన్న ఆదరణను సూచిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అంటే.. మోదీ చెబుతున్న ప్రతి మాటకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని సర్వేను సరళీకరించడం ఎంత తప్పో, రాహుల్ గాంధీ పూర్తిగా తిరస్కరించబడ్డారని చెప్పడం కూడా అంతే తప్పు. సర్వే అనేది ఒక నిర్దిష్ట సమయంలో ప్రజల అభిప్రాయానికి అద్దం మాత్రమే. ఎన్నికల ఫలితం కాదు. రెండున్నరేళ్లలో రాజకీయ పరిస్థితులు అనేకసార్లు మారే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతానికి మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మోదీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా అంగీకారం పొందే నాయకుడిగా రాహుల్ గాంధీ ఇంకా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ప్రతిపక్ష ఐక్యత, పార్లమెంటరీ పోరాటం, ప్రభుత్వంపై విమర్శలు మాత్రమే సరిపోవు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే స్పష్టమైన ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాను రాహుల్ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది.

అందుకే ఈ సర్వే కాంగ్రెస్‌కు ఒక హెచ్చరికగా, రాహుల్ గాంధీకి ఒక రాజకీయ సవాలుగా చూడాల్సి ఉంటుంది. మోదీకి వ్యతిరేకతను సమీకరించడం ఒక విషయం.. మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజల నమ్మకాన్ని సంపాదించడం మరో విషయం. ప్రస్తుతం రెండో విషయంలో రాహుల్ గాంధీ ఇంకా వెనుకబడే ఉన్నారన్నదే ఈ సర్వే ఇచ్చే ప్రధాన రాజకీయ సందేశంగా కనిపిస్తోంది.

రాహుల్ గాంధీ మరోసారి విఫల నాయకుడిగా తేల్చిన ఇండియా టుడే సర్వే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper