Voter List : ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనది. అయితే ఇటీవల SIR ద్వారా చాలా మంది తమ ఓట్లు లేనట్లు గుర్తించారు. అంతేకాకుండా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన తర్వాత ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా, చిరునామా మారినా లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాలన్నా నిర్దిష్ట ఫారమ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ ఫారాలు ఏవో చూద్దాం..
జాబితాలో పేరు లేకపోతే..
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన వారు Form-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు కావచ్చు. 18 ఏళ్లు పూర్తయిన వారు లేదా అర్హత తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారు ఈ ఫారమ్‌ను సమర్పించవచ్చు. అవసరమైన గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేస్తే పరిశీలన అనంతరం పేరు ఓటరు జాబితాలో చేర్చబడుతుంది. అయితే దీనిని ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
విదేశాల్లో ఉన్నవారు..
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIలు) కూడా భారత ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు Form-6A ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. భారత పాస్‌పోర్ట్ వివరాలు, విదేశీ నివాసానికి సంబంధించిన సమాచారం సమర్పించి తమ స్వస్థల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఓటు తొలగించాలంటే..
ఓటరు జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని భావించినా… ఒక వ్యక్తి పేరు నమోదుపై అభ్యంతరం తెలిపాలన్నా Form-7 ద్వారా దరఖాస్తు చేయాలి. అలాగే మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారిన వారు లేదా ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదైన సందర్భాల్లో కూడా ఈ ఫారమ్ ద్వారా తొలగింపు కోరవచ్చు. అధికారులు విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.
అడ్రస్ మారిన వారు..
ఇప్పటికే ఓటరుగా నమోదై ఉన్నవారు తమ వివరాల్లో మార్పులు చేయాలనుకుంటే Form-8 ఉపయోగించాలి. పేరు, వయస్సు, ఫోటో, లింగం, పుట్టిన తేదీ వంటి వివరాల సవరణతో పాటు చిరునామా మార్పు, ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొకదానికి మార్పు, EPIC (ఓటరు గుర్తింపు కార్డు) వివరాల సవరణ, దివ్యాంగుల (PwD) గుర్తింపు నమోదు వంటి సేవలన్నీ ఈ ఫారమ్ ద్వారా పొందవచ్చు.