Telangana Education Reforms : తెలంగాణ విద్యా రంగంలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను బలోపేతం చేయడంతో పాటు, విద్యార్థులకు చదువుతోపాటు వృత్తి నైపుణ్యాలు అందించేలా కొత్త విద్యా ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత పాఠశాల విద్యగా పరిగణించి, విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు, భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన పునాదులు ఈ దశలోనే బలంగా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
12వ తరగతి నుంచే నైపుణ్య శిక్షణ
కేవలం పుస్తక పరిజ్ఞానానికే విద్యను పరిమితం చేయకుండా, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్యాలను కూడా అందించాలని సీఎం సూచించారు. 12వ తరగతి నుంచే స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. తద్వారా విద్య పూర్తయ్యే సమయానికే విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, బోధనా సదుపాయాలు, ఇతర అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
విద్యార్థులకు నష్టం జరగకుండా సంస్కరణలు
విద్యా విధానంలో తీసుకొచ్చే మార్పుల అమలు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సంస్కరణల కారణంగా ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుతో తెలంగాణ విద్యా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. అయితే ఈ విధానం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, కార్యాచరణను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది.