Google Pixel : స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు గూగుల్ మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. నవంబర్ పిక్సెల్ డ్రాప్‌లో భాగంగా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లకు పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ముఖ్యంగా జెమినీ ఏఐ సామర్థ్యాలను మరింత విస్తరించడంతో పాటు, ఫోన్‌ను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశాలను కల్పించింది. ఈ అప్‌డేట్స్ దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
జెమినీతో పనులన్నీ మరింత సులభం
పిక్సెల్ 10 సిరీస్‌లో ఇప్పుడు Gemini Intelligence అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా రాంబ్లర్ (Rambler) అనే కొత్త వాయిస్ టైపింగ్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మనం మాట్లాడేటప్పుడు వచ్చే ‘ఉమ్’ వంటి అనవసర పదాలను తొలగించి, మాట్లాడిన విషయాలను స్పష్టమైన మెసేజ్‌లుగా మార్చుతుంది. అంతేకాదు.. కిరాణా సరుకుల ఆర్డర్, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రెస్టారెంట్ రిజర్వేషన్ వంటి బహుళ దశల పనులను జెమినీ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ సదుపాయం భారత్, జపాన్, యూకేలో అందుబాటులోకి వచ్చింది.
మన అభిరుచులకు తగ్గట్టుగా విడ్జెట్లు
హోమ్ స్క్రీన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు కస్టమ్ విడ్జెట్లను రూపొందించుకునే సదుపాయాన్ని గూగుల్ తీసుకొచ్చింది. నెలవారీ ఖర్చుల ట్రాకర్, క్రికెట్ టీమ్ రంగులతో గేమ్ డే విడ్జెట్, ప్రయాణాల కౌంట్‌డౌన్ వంటి వాటిని సృష్టించుకోవచ్చు. సుదీర్ఘమైన మెసేజ్ సంభాషణలను ఏఐ సాయంతో సంక్షిప్తంగా తెలుసుకునే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది.
కాల్స్, ఐకాన్స్‌లోనూ కొత్తదనం
తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్క్రీన్ చేసే విధానాన్ని కూడా గూగుల్ మెరుగుపరిచింది. జెమినీ కాల్ చేస్తున్న వ్యక్తితో సంభాషిస్తూ, వారు ఎందుకు కాల్ చేస్తున్నారో లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ ద్వారా చూపిస్తుంది. మరోవైపు కొత్త కస్టమ్ ఐకాన్ స్టైల్స్‌తో హోమ్ స్క్రీన్‌ను వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. పిక్సెల్ 6, ఆ తర్వాతి మోడళ్లలో సెర్చ్ ఫీచర్ కూడా మరింత మెరుగుపడింది.
పిక్సెల్ ట్యాగ్‌తో వస్తువులకు రక్షణ
నవంబర్ 11 నుంచి అందుబాటులోకి వచ్చిన Pixel Tag మరో కీలక ఆకర్షణ. వాలెట్‌లో పెట్టుకునేంత చిన్నగా ఉండే ఈ ట్రాకర్‌తో కీలకమైన వస్తువుల లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ఏడాదికి పైగా పనిచేసే బ్యాటరీ, ఒక బిలియన్‌కు పైగా ఆండ్రాయిడ్ పరికరాలతో కూడిన Find Hub నెట్‌వర్క్, UWB టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. దీని ధర సింగిల్ ప్యాక్‌కు 29.99 డాలర్లు, నాలుగు ప్యాక్‌లకు 99.99 డాలర్లు.
స్మార్ట్‌ఫోన్‌ను కేవలం కమ్యూనికేషన్ పరికరంగా కాకుండా, వ్యక్తిగత పనులను ముందుగానే అంచనా వేసి సహాయపడే ఏఐ అసిస్టెంట్‌గా మార్చడమే ఈ నవంబర్ పిక్సెల్ డ్రాప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.