Kavitha Political Party: ఒక రాజకీయ పార్టీని నడపాలంటే ఒకప్పుడు ఆర్థిక వనరులు అంతగా ఉండాల్సిన అవసరం ఉండదు కాదు. ఎందుకంటే కార్యకర్తలు పార్టీకి పని చేయడాన్ని ఒక గౌరవంగా భావించేవారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పటి మాదిరిగా లేరు కాబట్టి.. అప్పుడు అంతగా ఖర్చు ఉండేది కాదు. పైగా దోచుకోవడం, దాచుకోవడం అనే సిద్ధాంతాన్ని నేతలు పాటించేవారు కాదు. దీనివల్ల రాజకీయాలు అంత ఖరీదుగా ఉండేవి కాదు.. మీడియా కూడా న్యూట్రల్ గా ఉండేది. అందువల్ల నాటి రోజుల్లో రాజకీయ పార్టీని నిర్వహించడానికి నేతలకు భారీగా డబ్బు అవసరం పడేది కాదు.
ఇప్పటి రోజులు వేరు. ప్రతిదీ ఖరీదుగా మారిపోయింది. పార్టీ కార్యాలయాన్ని నిర్వహించాలి. జిల్లాలో కార్యాలయాలను నిర్వహించాలి. విలేకరుల సమావేశం పెడితే కవర్లు ఇవ్వాలి. సోషల్ మీడియాను రన్ చేయాలి. ప్రత్యర్థి పార్టీల నేతల మీద నిత్యం బురద చల్లుతూనే ఉండాలి. లీగల్ టీం బలోపేతంగా ఉండాలి. అన్నింటికీ మించి దండిగా సంపాదించుకోవాలి. తరాలు తిని కూర్చున్నా కూడా తగ్గని ఆస్తులను వెనకేసుకోవాలి. ఇదంతా జరగాలంటే దోపిడీ చేయాలి. దుర్మార్గాలకు పాల్పడాలి. అక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అందువల్లే రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో చులకన భావం.. మేధావుల్లో హేయమైన భావం.
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అయింది. ఈ పార్టీని ఏర్పాటు చేసింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత. తన పార్టీ పేరును ఆమె టిఆర్ఎస్ గా ప్రకటించారు. వాస్తవానికి ఒక మహిళ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం మన దేశంలో కొత్తగాక పోయినప్పటికీ.. మఘలో పుట్టి పుబలో మునిగిపోయిన మాదిరిగా కాకుండా.. రాజకీయ పార్టీ సుదీర్ఘకాలం పనిచేయాలంటే కచ్చితంగా ఆర్థిక వనరులు ఉండాల్సిందే. కవిత పార్టీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆమె దానిని కొనసాగించగలుగుతారా.. ఆమె దగ్గర ఉన్న ఆర్థిక స్థాయి ఎంత.. తెర వెనుక ఏవైనా భారీ అండదండలు ఉన్నాయా.. అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయ పార్టీని ఏర్పాటుచేసిన కవిత ఆర్థిక పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. 2021లో ఎమ్మెల్సీ ఎలక్షన్ అఫిడబిట్ లో ఆమె తన పేరు మీద 39.79 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 21.62 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. 1.9 కిలోల బంగారం, 11.2 కిలోల వెండి ఉన్నట్టు వెల్లడించారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 6.19 కోట్ల ఆస్తులు.. 2019 ఎన్నికల్లో 17.9 3 కోట్ల ఆస్తులు.. 2020లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27.64 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కవిత వెల్లడించారు. అయితే ఈ స్థాయి ఆస్తులతో రాజకీయ పార్టీని ఎలా నడుపుతారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆమె పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కనిపించడం లేదు. ఆమె చెప్పినట్టుగా గొప్ప గొప్ప నాయకులు పార్టీలో చేరలేదు. ఇప్పటికైతే పార్టీలో పెట్టుబడి పెట్టాల్సింది.. నిర్వహణ ఖర్చు చూసుకోవాల్సింది మొత్తం కవితనే. పైగా ఆర్థికంగా కవిత బలంగానే ఉన్నప్పటికీ.. అధికార పార్టీని.. ప్రతిపక్ష పార్టీని ఆమె ఏక కాలంలో విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఆమెకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు.. ఒకవేళ వచ్చినా ప్రభుత్వం ఒత్తిడికి వారు తట్టుకుంటారా.. ప్రతిపక్షం దూకుడు ముందు నిలబడతారా.. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే కవితకు, ఆమె రాజకీయ పార్టీకి మనగడం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
“పార్టీ ఆవిర్భావ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వంటకాలు మొత్తం కార్యకర్తలకు వడ్డించారు. కార్యకర్తలు కూడా భారీగానే వచ్చారు. జన సమీకరణ అనుకున్న దానికంటే ఎక్కువగానే చేశారు. పత్రికలలో భారీగా ప్రకటనలు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే కవిత అంత ఈజీగా లేరు. పైగా తను కేసీఆర్ కుమార్తె. అలాంటప్పుడు ఆమె తన పార్టీని గట్టిగానే నిర్వహిస్తారు. కెసిఆర్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చివరికి పార్టీని బలోపేతం చేసుకున్నారు. కవిత కూడా అలానే ఉంటుందేమో. ఎందుకంటే తను మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా స్పష్టత కనిపించింది. ధిక్కార స్వభావం వినిపించింది. అలాంటప్పుడు కవిత కచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకుంటుందని నమ్మకం కనిపిస్తోందని” విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.