SRH
SRH : ఐపీఎల్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) , సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) గురువారం హైదరాబాద్ వేదికగా తలపడుతున్నాయి.. టాస్ గెలిచిన లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శార్దూల్ ఠాకూర్ (4/34) నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు హైదరాబాద్ జట్టు టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్ మనోహర్ (2), మహమ్మద్ షమీ (1)ని వెనక్కి పంపించాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో హైదరాబాద్ జట్టు వణికిపోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 190 రన్స్ స్కోర్ చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్(47), అనికేత్ వర్మ (36), నితీష్ కుమార్ రెడ్డి (32) పర్వాలేదనిపించారు. ఒకానొక దశలో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు నెలకొల్పిన 61 పరుగులే హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ కు మూల స్తంభంగా నిలిచాయి.
Also Read : SRH “300” కల.. అన్ సోల్డ్ బౌలర్ వల్ల కల్ల! లక్నో టార్గెట్ ఎంతంటే?!
పూరన్ పూనకాలు
హైదరాబాద్ జట్టు విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో లక్నో జట్టు రంగంలోకి దిగగా.. నాలుగు పరుగుల వద్ద మార్క్రం(1) రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది. షమీ బౌలింగ్లో మార్క్ రం కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత రంగంలోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. వాస్తవానికి అతని దూకుడు చూస్తే లక్నో జట్టు 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించేలాగా కనిపించింది. మరో ఎండ్ లో మిచెల్ మార్ష్(37*) కూడా దూకుడుగా ఆడాడు. పూరన్, మార్ష్ రెండో వికెట్ కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించడం విశేషం. మార్క్రం అవుట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ, మహమ్మద్ షమీ, సిమర్ జీత్ సింగ్, పాట్ కమిన్స్, ఆడం జంపా.. ఇలా ప్రతి ఒక్క హైదరాబాద్ బౌలర్ బౌలింగ్ ను దంచి కొట్టాడు. మాత్రం కనికరం లేకుండా పరుగులు సాధించాడు.. ఫలితంగా లక్నో జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకు వెళ్లింది. 70 పరుగులు చేసి జోరు మీద ఉన్న.. పూరన్ కమిన్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి లక్నో జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయి దాటింది.. సాధారణంగానే బలమైన షాట్లు ఆడే పూరన్.. హైదరాబాద్ జట్టుపై వారి సొంత మైదానంలోనే దంచి కొట్టాడు. ఫలితంగా తనకు బౌలింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితిని హైదరాబాద్ బౌలర్లకు కల్పించాడు.
Also Read : SRH పై ఇంత అభిమానమా? ఉప్పల్ స్టేడియాన్ని ఇలా చేశారేంట్రా?