Bathukamma 2024: తెలంగాణలో అతిపెద్ద పండుగ.. తెలంగాణ రాష్ట్ర పండుగ.. తెలంగాణ ఆడపడుచుల పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది బతుకమ్మ, దసరా. దేవీ నవరాత్రులు. దేవుడి కొలిచేందుకు ఉపయోగించే పూలనే దేవుడిగా కొలిచే పండుగ. తొమ్మిది రోజులు జరుపుకునే సంబురం. ఆశ్వయిజ మాసం వచ్చిందంటే తెలంగాణలో ఒకవైపు బతుకమ్మ, మరోవైపు నవరాత్రి ఉత్సవాలతో పల్లె పట్టణం అంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ రెండు వేడుకల్లో తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ పండుగ ఆడపడుచుల ఉనికికి, ఆత్మగౌరవానికి ప్రతీక. పువ్వుల రూపంలో ప్రకృతిని, శక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగ. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి, గౌరమ్మను ఉంచి సాయంత్రం కూడళ్లకు చేర్చి పల్లె పాటలు, జాన పద గీతాలు ఆలపిస్తూ.. ఆడపడుచులు ఆడుకునే ఆట బతుకమ్మ.
పువ్వులే ప్రనధానం..
ఇక బతుకమ్మ వేడుకల్లో పువ్వులే ప్రధానం. దేవతలను కొలిచేందుకు పువ్వులను ఉపయోగిస్తారు. కానీ, పువ్వులనే దేవతగా ఆరాధించడమే బతుకమ్మ పండుగ గొప్పదనం. ఈ పండుగకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం పంట పొలాల్లో లభించే సాధారణ పువ్వులనే సీజనల్‌గా లభించే పువ్వులనే ఉపయోగిస్తారు. ఈ సీజన్‌లో రకరకాల పూలు వికసిస్తాయి. అందులో కొన్ని సువాసనలు కలిగి ఉంటాయి. మరికొన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటితో పర్చిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కూడా శుభ్రం అవుతుంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలో ఎలాంటి పూలు వాడతారు.. వాటి విషిష్టత గురించి తెలుసుకుందాం.
గునుగు పూలు..
బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలు చాలా ముఖ్యం. ఈ పూలు పొలం గట్ట వెంట లభిస్తాయి. గునుగు శాస్త్రీయ నామం సెలోసియా. ఇది ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉన్న గడ్డిజాతి పువ్వు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. గాయాలు నయం చేయడానికి, మధుమేహం, చర్మ సమస్యల నివారణకు ఇది ప్రసిద్ధి.
తంగేడు పూలు..
తంగేడు అనేది తెలంగాణ రాష్ట్ర పుష్పం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే ప్రధాన పుష్పం. దీని శాస్త్రీయ నామం సెన్నా ఆరిక్యూలాట. తంగేడు అనేక ఔషధగుణాలను క లిగి ఉంటుంది. నాటు వైద్యంలో మలబద్ధకం, మధుమేహం, ఇతర మూత్రనాళ సమస్యలు నయం కావడానికి ఉపయోగిస్తారు.
పట్టు కుచ్చులు..
ఇటీవలి కాలంలో బుతకమ్మ తయారీలో పట్టుకుచ్చులు కీలకంగా మారాయి. మంచి రంగు, ఆకర్షణీయంగా ఉండే పట్టు కుచ్చులతో బతుకమ్మ అందంగా కనిపిస్తుంది. ఇది కూడా గునుగు జాతికి చెందిన పూలే. వీటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో పట్టు కుచ్చులు రైతులకు ఆదాయ మార్గంగా కూడా మారాయి. పూలను సాగుచేసి విక్రయించి ఆదాయం పొందుతున్నారు.
బంతి, చామంతి..
బతుకమ్మ తయారీలో వాడే మరో ముఖ్యమైన పూలు బంతి, చామంతి సాధారణంగా ఇంటి అలంకరణ కోసం తోరణాలుగా, దేవేడికి దండల కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటినితో బతుకమ్మను తయారు చేస్తారు. ఇవి చర్మ సమస్యలు నివారించే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి కూడా రైతులకు ఆదాయంగా మారాయి. దసరా వస్తుందంటే బంతి, చేమంతి పూలను రైతులు విరివిగా సాగుచేస్తున్నారు. మార్కెట్‌లలో విక్రయించి ఆదాయం పొందుతున్నారు.
మల్లెలు, లిల్లీలు..
మల్లెలు, లిల్లిపూలను కూడా బతుకమ్మ తయారీలో ఉపయోగిస్తారు. వీటిని పై వరుసలో వాడతారు. వీటిని ఉపయోగించడం వలన బతుకమ్మ అంంగా కనిపిస్తుంది. పరిసరాలు సువాసన భరితంగా మారతాయి. మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి.
గడ్డిపువ్వు..
చిన్నగా ఉండే చిట్టి చామంతి, రోడ్డు పక్కన గడ్డిలో మొలిచే గడ్డి పూలను కూడా బతుకమ్మ తయారీలో వాడతారు. ఈ పూలలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. గాయాలు మానడానికి, రక్తస్రావం ఆపడానికి, జుట్ట పోషణకు వీటిని ఉపయోగిస్తారు.
వీటితోపాటు బీర పూలు, దోస పూలు, గుమ్మడి పూలు, వాము పూలు వంటివి కూడా బతుకమ్మ తయారీకి వాడతారు. తామర పూలు, గన్నేరు పూలు, కట్లపూలు పైన అలంకరణకు ఉపయోగిస్తారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Special article on the occasion of bathukamma festival
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com