Boddemma Festival : తెలంగాణలో సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు చాలా వరకు ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. ఇలాంటి పండుగల్లో బొడ్డెమ్మ ఒకటి. బోనాలు, బతుకమ్మ పండుగలను భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో చేస్తారు. అదే విధంగా బతుకమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ పండగను మహిళలే చేసుకుంటారు. బొట్టె, బొడ్డె అంటే చిన్న పండుగ అని అర్థం. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటుంది. మట్టి, పూలతో సంబంధం ఉండే పండగ. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ఆదివారం నుంచే ప్రారంభం అయ్యాయి.
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి బొడ్డెమ్మ పున్నమిగా చేస్తుంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు ప్రజలు. ఈ పండుగ కూడా బతుకమ్మ మాదిరి తొమ్మిది రోజులు జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు గల్లీలు, వాడలు మురిసిపోతుంటాయి. యువతుల జీవన విధానం, ప్రకృతి, గౌరీదేవిపై పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూనే పల్లె వాతావరణం ఆనందంగా ఉంటుంది. తొమ్మిదవ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఆ తర్వాత నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం చేస్తారు.
ఎలా చేస్తారు: బొడ్డెమ్మను వేసేవారు చెరువు దగ్గరకు వెళ్తారు. అక్కడ నుంచి పుట్టమన్ను తెచ్చి నీటితో తడిపి ఒక చెక్క పీటపై నాలుగు మూలలతో ఐదు అంతస్తులు చేస్తారు. దాని మీద చెంబు, ఆ పైన జాకెట్ ముక్క పెట్టి బియ్యం పోసి అలంకరిస్తారు. తొమ్మిది రోజులు సాయంత్రం ఎర్రమట్టి అలికి.. బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో ముగ్గులు వేస్తారు. ఆ తర్వాత సహజ సిద్ధంగా దొరికే పూలతో అందంగా అలంకరిస్తారు. ఇలా తొమ్మిది రోజులు చేసి అమ్మవారిగా కొలుస్తూ.. దాని చుట్టూ కోలాటాలతో పాటలు పాడుతుంటారు.
సంధ్యా సమయంలో దేవతలు ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. పూజతో అలంకరించడం మాత్రమే కాదు ప్రతి రోజు వేరు వేరు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బొడ్డమ్మ చుట్టూ చేరి.. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఊరిని తొమ్మిది రోజులు పండగలా చేస్తుంటారు మహిళలు. ఇక కాసేపు అక్కచెల్లెమ్మలు ఆడుకున్న తర్వాత ఆట ముగిశాక అందరూ చుట్టూ కూర్చొని నిద్రపో బొడ్డెమ్మ… నిద్రపోమ్మా. నిద్రాకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు అంటూ అన్ని రకాల పూల పేర్లు వచ్చే పాటలు పాడుతూ ఎండ్ చేస్తారు.
పేర్లు వేరైనా.. అమ్మ ఒక్కతే.. :బొడ్డెమ్మను.. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇతర పేర్లతో పిలుస్తుంటారు. బొడ్డెమ్మను పీటపై చేసి కొందరు పందిరి కూడా వేస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరిరోజు.. బియ్యంతో కుడుములు, సత్తుపిండి నైవేద్యాలు చేసి మరీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మాయిలకు వాటిని తినిపిస్తారు. చివరి రోజు గౌరమ్మను చేసి.. పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలతో పూజిస్తారు. పాటలు పాడి ఆడిన తర్వాత చెరువులో వేస్తారు. చెరువులో వేసే ముందు కూడా పోయిరా బొడ్డెమ్మ.. అంటూ పాటలు పాడుతూనే నిమజ్జనం పూర్తి చేస్తారు.
బొడ్డెమ్మ వేడుకలు పూర్తయిన మరుసటి రోజు నుంచి అంటే మహాలయ అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఈ రోజులు కూడా చాలా పండగ వాతావరణం ఉంటుంది. ఇవి కూడా తొమ్మిదిరోజులు ఉంటాయి. బతుకమ్మ తర్వాత దసరా వస్తుంది. ఇలా దాదాపు ఇరవై రోజుల వరకు పండగ వాతావరణంతో పల్లెలు నిండుగా ఉంటాయి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: What is special about boddemma that comes before bathukamma do you know these things about this festival
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com