Home Blog Page 8576

పేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా ఇవ్వండి

కరోనా ఆర్ధిక భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తల సంఘం కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సిఐఐ) సూచించింది. ఇందుకోసం ఆధార్‌ ఆధారంగా గ్రామీణ, పట్టణ పేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమ చేయాలని కోరింది. బలహీన వర్గాలు, వృద్దులకు రూ.10,000 చొప్పున అందించాలని సూచించింది.

పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతో పాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్ధీపనలు ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఈ ఉద్దీపనలతో రూ.5వేల చొప్పున అయితే 40 కోట్ల మందికి, రూ.10 వేల చొప్పున అయితే 20 కోట్ల మందికి సాయం అందించవచ్చని సిఐఐ పేర్కొంది. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుందని సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

కరోన మూలంగా రియాల్టీ, విమానయానం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని బెనర్జీ తెలిపారు. ప్రస్తుత మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జిడిపిలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

ఈ అంశంపై ఆయన ప్రధాని మోడీకి లేఖవ్రాస్తూ దేశంలోని రూ.5 లక్షల ఆదాయం దిగువన కలిగిన 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరు పేదలకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించారు. దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

కాగా, రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని కేంద్రాన్ని సిఐఐ కోరింది. నిరర్ధక ఆస్తులుగా ప్రకటనకు 90 రోజుల నిబంధనకు బదులుగా 180 రోజులకు (సెప్టెంబర్‌ 30 వరకు) పొడగించాలని విజ్ఞప్తి చేసింది. ఇవి వెంటనే అమలైతే కరోన కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించవచ్చని సూచించింది.

కరోనాతో ఒలింపిక్స్‌‌ వాయిదాకు పెరుగుతున్న వత్తిడి

ఒలింపిక్స్‌‌కు సంబంధించి రోజుకో కీలక ఘట్టం జరుగుతున్నా… క్రీడల నిర్వహణపై సందేహాలు మాత్రం తగ్గడం లేదు. ఏదో ఓ దశలో క్రీడలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా దృష్ట్యా క్రీడలను వాయిదా వేయాలని వత్తిడులు పెరుగుతున్నా జపాన్ మాత్రం ఉలకడం లేదు. గురువారం నుంచి జరిగే టార్చ్‌‌ రిలేను జపాన్‌‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏథెన్స్‌‌ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న టార్చ్‌‌ను చూడటానికి జనాలు ఎగబడుతున్నారు.

జపాన్‌‌ ఉత్తర భూభాగంలోని ఫకుషిమాలో ప్రారంభమయ్యే ఈ రిలే కోసం అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 2011లో వచ్చిన సునామీ, భూకంపాలకు తోడుగా న్యూక్లియర్‌‌ రియాక్టర్ల పేలుడుతో ఫకుషిమా ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. చాలా కాలం కనీస వసతులు లేక జనసంచారం కూడా బాగా తగ్గింది.

ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకుని జీవనం మొదలుపెట్టారు. అలాంటి ప్రాంతంలో రిలేను నిర్వహించడం ద్వారా ఫకుషిమా కోలుకుందని ప్రపంచానికి చాటి చెప్పాలని జపాన్‌‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ జరిగే టార్చ్‌‌ రిలే ద్వారా స్పాన్సర్లకు కూడా భారీ ఆదాయం సమకూరనుండటంతో క్రీడలకు ఢోకా లేదనే ప్రచారం కూడా మొదలైంది.

మే 18, 19 తేదీల్లో హిరోషిమాలో రిలే జరుగుతుంది. ఇంత పకడ్బందీగా రిలే మొదలుపెడుతున్నా… ఓ సర్వేలో 69.9 శాతం మంది జపాన్‌‌ ప్రజలు మాత్రం షెడ్యూల్‌‌ ప్రకారం క్రీడలు జరగవని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రీడలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

క్వాలిఫికేషన్‌‌ ఈవెంట్స్‌‌ నిలిచిపోవడంతో చాలా మంది అథ్లెట్లు గేమ్స్‌‌ను వాయిదా చేయాలని కోరుకుంటున్నారు. చాలా ఇంటర్నేషనల్‌‌ అసోసియేషన్లు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. కొలంబియా, స్లోవేనియా, నార్వే, అమెరికా స్విమ్మింగ్‌‌, ఫ్రెంచ్‌‌ స్విమ్మింగ్‌‌ అసోసియేషన్లు.. క్రీడలను వాయిదా వేయాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి.

కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ కాకపోతే దాదాపు 11 వేల మంది అథ్లెట్లను గేమ్స్‌‌ విలేజ్‌‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల వైరస్‌‌ పెరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడలను వాయిదా వేయడం మంచిదని నార్వే ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ చేసిన విజ్ఞప్తిపై టోక్యో గేమ్స్‌‌ ఆర్గనైజింగ్‌‌ కమిటీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ తొషియాకి ఎండో వాయిదా గురించి మాట్లాడకుండా అనుకున్న షెడ్యూల్‌‌ ప్రకారమే గేమ్స్‌‌ జరుగుతాయని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది పాటు వాయిదా వేయాలని యూఎస్‌‌ అసోసియేషన్‌‌ కోరుతోంది.

ఇంకా నాలుగు నెలల సమయం ఉందని చెబుతున్న నిర్వాహకులు ఇప్పుడే వాయిదా నిర్ణయం ప్రకటించడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు. 1.43 బిలియన్‌‌ డాలర్లతో నిర్వహించిన టోక్యో సెంటర్‌‌ స్టేడియంలో అట్టహాసంగా క్రీడలను మొదలుపెట్టాలని భావిస్తున్నా.. అది జరిగేలా కనబడటం లేదు.

క్రీడల వాయిదాకు వస్తున్న వత్తిడులను ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ బాచ్‌‌ మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. క్రీడలను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేస్తున్నారు. దానితో ఐఓసీ తీరుపై సంఘంలోని సభ్యులే విమర్శలు చేస్తున్నారు.

మానవత్వం లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఐఓసీ సభ్యురాలు కెనడాకు చెందిన హాలే విక్‌‌నైసర్‌‌ విమర్శించింది. ఇక అథ్లెట్ల ప్రాణాలతో అంతర్జాతీయ బాడీ ఆటలాడుతోందని జపాన్ ఒలింపిక్‌‌ కమిటీ సభ్యుడు కొరీ యమగుచి మండిపడ్డారు.

అవన్నీ గాసిప్సే.. అంటున్న బోల్డ్ హీరోయిన్


బొయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తాజా చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పోలీస్ అధికారి పాత్రతోపాటు ఫ్లాష్ బ్యాక్ లో అఘెరా కనిపించనున్నాడు. బాలయ్య సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఒక హీరోయిన్ గా అంజలి ఎంపికైంది. మరో హీరోయిన్ గా ఆర్ఎక్స్-100 భామ పాయల్ రాజ్ పుత్ ఎంపికైనట్లు ప్రచారం జరిగింది.

దీనిపై పాయల్ రాజ్ ఫుత్ ట్వీటర్లో స్పందించారు. బాలయ్య మూవీ కోసం తాను ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని.. బాలయ్య మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు గాసిప్స్ అంటూ ట్వీటర్లో ట్వీట్ చేసింది. దీంతో పాయల్ ఈ మూవీలో నటించడం లేదని తెలుస్తోంది. దీంతో బాలయ్య పక్కన నటించే మరో ఎవరనేది ఆసక్తిగా మారింది.

‘ఆర్‌ఎక్స్-100’ మూవీతో పాయల్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇటీవల రవితేజతో కలిసి ‘డిస్కోరాజా’, విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’లో నటించి మెప్పించింది.గతంలో బాలకృష్ణ నటించిన ‘కథానాయకుడు’ మూవీలో పాయల్ నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ ఫుత్ ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది.

ఇంట్లో ఉండి ఆరోగ్యంగా ఉండండి:మోడీ

O

ఈ రోజు మార్చి 22 న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను ఉధ్యేసించి ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు.

“భారతీయులుగా మనమందరం జనతా కర్ఫ్యూను పాటించి కారోన రక్కసిపై యుద్ధం చేసి అద్భుతమైన శక్తిని పొందుకుందాం.. అదేవిధంగా ఇంట్లో ఉండి ఆరోగ్య ఉందాం” అని మోడీ ట్వీట్ చేశారు.

ఆదివారం అందరం ఒక్కటవుదాం

ఈవారం ఇంకా భయానకంగా తయారయ్యింది. ప్రపంచం మొత్తంమీదకరోనా వైరస్ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 11 వేలు దాటింది. వచ్చేవారం, ఆ పైవారం వార్తలు ఇంకా వినటానికి కష్టంగా ఉండొచ్చు. భారత్ ప్రస్తుతం చాలా క్లిష్టదశలో వుంది. వచ్చే నెలరోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వుంది. అందుకని ఈ వారం ముచ్చట్లు సరదాగా కాకుండా సీరియస్ గానే చెప్పుకుందాం. ఈ మహమ్మారి అంతమయ్యేవరకు వేరే విషయాలు మన వారాంతపు ముచ్చట్లలో మాట్లాడుకోవద్దు. దీన్ని ఎలా తరిమి కొట్టాలా అనేదే మన ముచ్చట్లలో ఉండాలి. ఇక మొదలుపెడదామా.

అశాస్త్రీయ ఆలోచనలు, ప్రచారాలు

ఒకవైపు ఈ మహమ్మారి ని ఎలా మట్టుబెట్టాలా అని తలలు బద్దలు కొట్టుకుంటుంటే సాంఘిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అసలు మనకేమీకాదని , భారత దేశపు ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, వాతావరణ పరిస్థితులు మనన్ని కాపాడతాయనే ప్రచారం జరుగుతుంది. ఈ వాదనను స్వయంగా ప్రధానే ఖండించారు . ప్రపంచంలో మనమూ భాగమేనని మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మహమ్మారి మనన్ని కాటేయటం ఖాయమని చెప్పకనే చెప్పాడు. ప్రధానమంత్రే దీని తీవ్రతను తక్కువ చేయొద్దని హెచ్చరించిన తర్వాత ఎవరూ లైటుగా తీసుకోరని భావిద్దాం. ఎందుకుచెప్పాల్సివచ్చిందంటే కొన్ని ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే ఇదే అదను అనుకొని పిల్లలని బయటకు తీసుకురావటాన్ని ఏమనాలో తెలియటంలేదు. ఇంత క్యాజుయల్ గా మీరు ఉండటం తో మీతోపాటు మీ చుట్టుపక్కలవాళ్ళను కూడా ప్రమాదానికి గురిచేస్తున్నారని మరిచిపోవద్దు.

ఇదే అదనుగా కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. గోమూత్రం తాగితే కరోనా వైరస్ దగ్గరకు రాదనీ, వెల్లుల్లి రసం తాగితే సరిపోతుందని, ఇంకొంతమంది మంచినీళ్లు అయిదు నిమషాలకొక సారి తాగమని, మరికొంతమంది గోరువెచ్చటి ఉప్పు నీళ్లు తాగమని , చివరకు టీవీ మాధ్యమాల్లో కూడా ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎక్కువమంది, అందులో డాక్టర్లు కూడా వున్నారు సుమా , ఎండలురాగానే తగ్గుతుందని చెబుతున్నారు. దానికి శాస్త్రీయ ఆధారం ఎక్కడా లేదు. ప్రధానమంత్రి కూడా అదే చెప్పాల్సివచ్చింది. ఇంతకుముందు వచ్చిన సార్స్ ని దృష్టి లో పెట్టుకొని ఎండాకాలం లో ఇది తగ్గిపోతుందని చెబుతూ వస్తున్నారు. ఇదికూడా ఊహాజనితమే. ఇది కొత్త వైరస్ . దీని లక్షణాలు ఇదమిద్ధంగా ఎవరూ నిర్ధారణకు రాలేనప్పుడు ఊహాజనిత అభిప్రాయాలకు అర్ధంలేదు. మరికొంతమంది అసలు దీన్ని గురించి గోరింతలు కొండంతలు చేస్తున్నారని ఇది కూడా ఫ్లూ లాంటిదేనని ఇది పెట్టుబడిదారులు వ్యాపారాభివృద్ధి కోసం చేస్తున్నారని కూడా సాంఘిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. సాంఘిక మాధ్యమం ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుందని కూడా దీన్ని చూస్తే అర్ధమవుతుంది. ఫ్లూ వలన మరణాల సంఖ్య వెయ్యికి ఒక్కరుంటే దీనివలన ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము. చైనా లో 80 వేలకి 3 వేలమంది చనిపోతే ఇటలీలో 40 వేలమందికి 4 వేలు చనిపోయారు. ఈ మహమ్మారిని దయచేసి ఎవరూ తక్కువచేసి చూడొద్దు. దీని విశ్వరూపం, వికృతరూపం ఇంకా పూర్తిగా మనకు అవగాహన కాలేదు. ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పింది తూచా తప్పకుండా పాటించటం మన విధి. అదే మనం సమాజానికి చేయదగ్గ సహాయం.

ప్రభుత్వానికి సహకరించకపోవటం క్షంతవ్యం కాదు

కొంతమంది అతి తెలివితేటలు ప్రదర్శించటం చూస్తున్నాము. విదేశీ ప్రయాణాలనుంచి వచ్చినవాళ్లు విమానం దిగటానికి ఒక గంట ముందు పారాసెటమాల్ గోలీ వేసుకొని థర్మల్ స్క్రీనింగ్ నుంచి తప్పించుకుంటున్నారని ప్రత్యక్ష సాక్షులే చెబుతున్నారు. అలాచేసినవాళ్ళని ఏమనాలి? ఖచ్చితంగా సంఘవిద్రోహక శక్తులేనని చెప్పాలి. హత్య చేస్తేనో , దొంగతనం చేస్తేనో , రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తేనో కాదు ఇటువంటివాళ్లను కూడా వాళ్ళ జతన చేర్చాలి. ఎందుకంటే రేపొద్దున వీళ్ళు కోవిద్ పాజిటివ్ అని తేలితే అప్పటికే ఎంతమందికి ఈ వ్యాధి సోకివుంటుందో తెలియదుకదా. అలాగే కొంతమంది హాస్పిటల్ నుండి పారిపోయి ఎక్కడెక్కడో తిరగటం , రైళ్లలో సుదీర్ఘ ప్రయాణాలు చేయటం ఖచ్చితంగా అతి నేరంగా పరిగణించాలి. వాళ్ళను పట్టుకోవటమే కాదు పరీక్షాకాలం అయినతర్వాత నయమైనా వీళ్ళను శిక్షించాలి. ఇది ఎంత నేరమో టీవీ మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. ఇక మత ప్రచారకులు కూడా తక్కువేమీ తినలేదు. 14 రోజుల నిర్బంధ సమయాన్ని పాటించకుండా రైళ్లలో ప్రయాణం చేయటం దారుణం. ఇలా సహకరించని వాళ్ళ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే భావం కలిగించాలి. కనీసం అప్పుడైనా ముందు ముందు అలా జరగకుండా ఉంటాయి.

ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి

అయినవాడి కో నిబంధన కాని వాడికి ఇంకో నిబంధన ఉండరాదు. ఈ విషయం లో తెలంగాణ ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. సిర్పూర్ ఎమ్యెల్యే కోనేరు కోనప్ప విదేశాలనుంచి వచ్చి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండకుండా ఎకాఎకిన ఊరెళ్ళటమే కాకుండా సమావేశాల్లో పాల్గొనటం క్షంతవ్యం కాదు. స్వీయ నిర్బంధంలో నన్నా ఉండివుంటే బాగుండేది. రూల్స్ సామాన్యులకేనా విఐపి లకు కాదా. వాస్తవానికి వాళ్లకు ఇంకా కఠినంగా ఉండాలి. ఇంకో వుదంతం . వరంగల్ కి చెందిన ఒకతను ఫ్రాన్స్ నుంచి మార్చి 12 వ తేదీన హైదరాబాద్ లో దిగి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండకుండా 150 కిలోమీటర్లు హన్మకొండ వెళ్లి మార్చి 19 వ తేదీన పెళ్లి కూడా చేసుకున్నాడు. షుమారు 1000 మంది అతిధులు హాజరయ్యారట. అందులో తెరాస ప్రముఖురాలు కూడా ఉందట. ఇంతకీ అతను ప్రముఖ రాజకీయనాయకుడికి దగ్గర బంధువట. కెసిఆర్ గారూ , వీటి విషయం లో మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ బాధ్యతారాహిత్యమవుతుంది.

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఏకంగా లండన్ నుంచి వచ్చి లక్నో లో మూడు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ కార్యక్రమాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు వసుంధర రాజే , ఆమె తనయుడు దుశ్యంత్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత దుశ్యంత్ సింగ్ పార్లమెంటు సమావేశాల్లో , రాష్ట్రపతి విందులో పాల్గొనటం పెద్ద దుమారం లేపింది. ఆవిడపై యోగి ఆదిత్యనాథ్ కేసు పెడుతున్నట్లు ఇంతకుముందే వార్తల్లో వచ్చింది. మరి అదేపని మన ముఖ్యమంత్రి కూడా చేస్తే ప్రజలకు సందేశమిచ్చినవారు అవుతారు. అప్పుడే నైతికంగా ప్రజలకు నిబంధనలు పాటించమని చెప్పే హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ఆశిద్దాం.

చైనా ద్వేషం మంచిది కాదు

ఈ వైరస్ వచ్చిన దగ్గర్నుంచి చైనా పై , చైనీయులపై విశ్వవ్యాప్తంగా వ్యతిరేకప్రచారం జరుగుతుంది. ఇది సరైనది కాదు. మన దేశ విదేశాంగ విధానాల్లో చైనా అనుసరిస్తున్న విధానాలను మనమందరం వ్యతిరేకిస్తున్నాము. అది మన దేశ రక్షణ, విదేశాంగ విధానానికి సంబంధించింది. కానీ ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చింది కాబట్టి చైనీయులను ద్వేషించటం ఎంతవరకు సబబు? వారి ఆహారపు అలవాట్లకు సంబంధించి ఈ మహమ్మారి ఆగిపోయిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారిస్తుందని అనుకుందాము. కానీ ఆ దేశాన్ని ఈపరంగా ద్వేషించటం దీనికి స్వయంగా అమెరికా అధ్యక్షుడే నాయకత్వం వహించటం శోచనీయం. చివరకు ఎక్కడిదాకా వెళ్లిందంటే చైనా అమలుచేస్తున్న ‘ఒక బెల్టు, ఒక రోడ్డు ‘ పధకం , అందులో భాగమైన చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా వీటివల్లే ఈ వైరస్ ఈ దేశాల్లో వస్తుందనే వాదన దారుణం. ద్వేషానికి కూడా హేతుబద్ధ కారణం ఉండాలి. చైనా- పాకిస్తాన్ ఆర్ధిక నడవా ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లలో నేనూ ముందున్నాను. కానీ దాన్ని రాజకీయంగానే ఎదుర్కొవాలిగానీ ఇలా చౌకబారు ప్రచారం మంచిదికాదు. వైరస్ ని అడ్డంపెట్టుకొని చైనాపై రాజకీయ కక్షసాధింపు అదీ జాతిపరమైన వ్యతిరేకప్రచారం మంచిదికాదు. ఈ రోజు చైనాకు జరిగేదే రేపు భారత్ కు జరగదని చెప్పలేము. ఈ వైరస్ ని ప్రపంచానికి చెప్పకుండా చైనా దాచిపెట్టిందని విమర్శించటం నూటికి నూరు పాళ్ళు కరెక్టు . చైనా కనక ముందుగా బయటపెట్టివుంటే ప్రపంచం ఇంకొంచెం ముందు మేల్కొని ఉండేది. ఇందుకు చైనా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలి. చైనా వైఖరి గర్హనీయం.

ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కాదనలేము

ఈరోజుకి కేవలం 300 కేసులు ఉండటం భారత్ సాధించిన విజయంగా భావిస్తూనే ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కూడా పరిగణన లోనికి తీసుకోవాల్సివుంది. భారత్ లో పరీక్షల నిర్వహణపై అనేక సందేహాలు వున్నాయి. ఎన్ని ఎక్కువ పరీక్షలు చేయగలిగితే అంతగా కోవిద్ ని అరికట్టగలమనేది నిపుణుల అభిప్రాయం. ఈ విషయంలో దక్షిణ కొరియా ప్రపంచానికే ఆదర్శంగా నిల్చింది. అందుకే వైరస్ సోకినా వాళ్లలో మరణాల రేటు అన్నిదేశాలకన్నా తక్కువగా వుంది. మనదేశంలో ఇంతవరకు జరిపిన పరీక్షలు చాలా తక్కువగా వున్నాయి. కేవలం 14 వేలేనని తెలుస్తుంది. ఇది ఆందోళనకర విషయం. అందుకనే చాలామంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు అమెరికా కూడా మొదట్లో ఇలానే ఉండేది. ఈ వైరస్ లక్షణాలు మొదట వారం రోజులు బయటపడకుండా వుండే అవకాశాలు ఎక్కువగా వున్నాయి కాబట్టి పరీక్షల పరిధిని తక్షణం విస్తృత పరచాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. అంటే కమ్యూనిటీ టెస్టింగ్ కి సిద్ధమవ్వాలి. ఇప్పుడున్న ఐసీయూ బెడ్ల శాతాన్ని పెంచాలి. మూడవ దశ కు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలా అయితేనే ఈ మహమ్మారిని ఎదుర్కోలేము. ఇప్పటివరకు ప్రభుత్వం వేగంగానే కదులుతుందని చెప్పాలి. ఇతరదేశాల వారి ప్రవేశాల్ని నియంత్రించటం, చివరకు నిషేదించటం లాంటి ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ప్రో యాక్టీవ్ గా ఉందని చెప్పాలి. దానితో బాటు అంతరంగికంగా పరిస్థితుల్ని చక్కదిద్దటం లో కొంతమంది నిపుణుల ఆందోళనలను పరిగణలోనికి ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం.

మరికొన్ని

ఈ సమయం లో ఈ విషయం లో రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. కేరళ లో ప్రభుత్వం చేసినట్లు మోడీ చేయటం లేదనే వాదన కొంతమంది వామపక్ష మేధావులు ప్రచారం చేయటం తగదు. దీనికి ఎక్కడా పరిమితులు వుండవు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం బాగాచేస్తుందని ఒకరు, ఉత్తర ప్రదేశ్ లో యోగి బాగా చేస్తున్నాడని ఇంకొకరు మొదలుపెడతారు. ఇప్పుడివి అవసరమా? కేరళ, ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల చర్యలని హర్శిద్దాం. పాజిటివ్ గా ప్రచారం చెయ్యండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ బాటలోనే ఉందని అర్ధమవుతుంది. మోడీ జాతినుద్దేశించి ప్రసింగించిన దాంట్లో ఆర్ధికమంత్రి అధ్యక్షతన కోవిద్ -19 మహమ్మారి ని ఎదుర్కోవటానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పటం జరిగింది. అతి త్వరలోనే దీనిపై నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుంటామని నిర్మల సీతారామన్ ప్రకటన చేయటం చూసాం. దయచేసి కొద్దిరోజులు అందరూ పాజిటివ్ ప్రచారానికే కట్టుబడదామని ప్రతిజ్ఞ చేద్దాం. అదేసమయం లో మిగతా అంశాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కోవిద్-19 వరకు అందరం ఒకటవుదాం. నిర్దిష్ట ప్రతిపాదనలేమన్నా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకి ఇద్దాం.

చివరగా హర్షించాల్సింది పోయినవారం మన వారాంతపు ముచ్చట్లలో టీటీడీ వారి గంటకు 4 వేలమంది సందర్శుకుల నియంత్రణ వద్దని చెప్పాం. పూర్తిగా ఆపట మొక్కటే పరిష్కారమని సూచించాం. ఈ వారానికి మన మొర ఆలకించినట్లున్నారు. అన్ని ఆలయాలు భక్తులను అనుమతించక పోవటం మంచి నిర్ణయం. దానితో పాటు యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామ నవమి ఉత్సవాలను రద్దుచేయటంకూడా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ముందుగా అవి జరుగుతాయని ప్రకటించటంతో అన్ని లక్షల మంది గుమిగూడితే మహమ్మారిని ఆపటం కష్టమని నిపుణులు ఆందోళన చెందారు. అలాగే షహీన్ బాగ్ నిరశన కారులు కూడా మానుకోవాలి. మానవాళి మనుగడ ముఖ్యం. జనం ఇంతమంది చెబుతున్నా ఆపకపోవటం మంచిదికాదు. దీన్ని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. జనం సహనానికి పరీక్ష కాకూడదు.

జనతా కర్ఫ్యూ ని వందశాతం అమలుచేద్దాం

ప్రధానమంత్రి మోడీ ఇచ్చినపిలుపుమేరకు అందరం జనతా కర్ఫ్యూ ని స్వచ్చందంగా పాటిద్దాం. ఎవ్వరూ ఇళ్లనుంచి బయటకు రావద్దు. ఇది రెండు విధాలా మంచిది. ఒకటి స్వీయ క్రమశిక్షణ వస్తుంది. రెండు, సామాజిక దూరాన్ని పాటించటం తో ఈ మహమ్మారి వ్యాప్తిని కొంతమేర అరికట్టవచ్చు. ఇటువంటి జాతీయ విపత్తుల్లో భారత జాతిమొత్తం ఒక్కటని చాటుదాం. ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు గృహనిర్బందాన్ని పాటిద్దాం. దయచేసి దీన్ని ఇంకో సోషల్ గాదరింగ్ గా మార్చుకోవద్దు. ఈ ఒక్కరోజు పూర్తిగా ఎవరింట్లో వాళ్ళు వుండండి. బయటకు రాకండి.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు కృతజ్ఞతలు చెప్పటం మరవకండి

మనకోసం, మన క్షేమం కోసం డాక్టర్లు, నర్సులు , మిగతా పారా మెడికల్ సిబ్బంది అహర్నిశం కష్టపడుతున్నారు. ముందుగా వారికి చేతులెత్తి నమస్కారాలు. అలాగే ఎంతోమంది ఈ క్లిష్ట సమయం లో కూడా వారి వారి డ్యూటీలు నెరవేరుస్తున్నారు. రోజు వచ్చే పాలవాడు, పేపర్ బాయ్ , ఆన్ లైన్ లో అర్దర్లు ఇస్తే ఇంటికి తెచ్చే స్విగ్గి , జొమాటో లాంటి ఫుడ్ వర్కర్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్ లైన్ వ్యాపార సిబ్బంది, బిగ్ బాస్కెట్, గ్రోఫెర్ లాంటి ఇంటిసరుకుల సిబ్బంది, పోస్టుమాన్, కొరియర్ బాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంది ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా మీడియా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా విధినిర్వహణ చేయటం, సమాజానికి సమాచారాన్ని అందించటం మనందరికీ ఉత్తేజాన్నిస్తుంది. ప్రభుత్వ సిబ్బంది కూడా సమయంతో సంబంధం లేకుండా రేయింబవళ్లు కష్టపడటం చూస్తున్నాము. అలాగే బ్యాంకు సిబ్బంది ఆర్ధిక కార్యకలాపాలు ఆగకుండా సమాజసేవ చేస్తున్నారు. వాళ్లలో ప్రధాని మోడీ ఉటంకించిన వారిలో తమ పేరులేదని ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పోస్టులు పెట్టారు. వాళ్ళ ఆవేదన సహేతుకమే. నోట్ల రద్దు సమయంలో కూడా రేయింబవళ్లు కష్టపడి సామాజిక కర్తవ్యం నెరవేర్చటం తెలిసిందే. అయితే బ్యాంకు సిబ్బంది అందరికీ మనవి ఏమిటంటే మోడీ చెప్పివుంటే బాగుండేది, కాకపోతే మనతో పాటు ఇంకా ఎంతోమంది, ఎన్నోరకాల వర్గాలు పనిచేస్తున్నారు. అందుకని పేరు పేరునా చెప్పటం సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే పనిచేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుగా అర్ధంచేసుకోండి. అందరం ధన్యవాదాలు చెప్పేదాంట్లో బ్యాంకు సిబ్బంది కూడా వున్నారని మరిచిపోవద్దు.

మరి ఇక సిద్ధమవుదామా. ఆదివారం 5 గంటలకు 5 నిముషాలు చప్పట్లతోనో , గంట కొట్టటం తోనో పైన చెప్పిన అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సంఘీభావం తెలుపుదాం. కలిసిరండి. జయహో భారత్ , జయహో మన ఐక్యత, జయహో మన సంకల్పం.

ఇవీ ఈవారం ముచ్చట్లు కాని ముచ్చట్లు , సెలవా మరి. మరిన్ని ముచ్చట్లతో వచ్చేవారం .

……… మీ రామ్

చిరు పక్కన చందమామ.. చెర్రీ పక్కన బాలీవుడ్ భామ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైంది. ఈమూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. మెగాస్టార్ కు జోడీగా తొలుత త్రిషను ఖరారు చేశారు. తాజాగా త్రిష ఈ మూవీని తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో చిరు పక్కనే నటించే భామ ఎవరనే ఆసక్తి మొదలైంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో చిరుకు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ నే ఈ మూవీలో తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరుతో మరోసారి ఆడిపాడిందుకునే చందమామ రెడీ అయినట్లు సమాచారం.

‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో షూటింగ్లో రాంచరణ్ బీజీగా ఉండటంతో చరణ్ పాత్రలో మహేష్ నటిస్తాడనే ప్రచారం జరిగింది. అయితే చివరకు రాంచరణ్ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాంచరణ్ పాత్ర ఈ మూవీలో కీలకంగా ఉండనుంది. దాదాపు 30నిమిషాలపాటు రాంచరణ్ పాత్ర ఈ మూవీలో ఉండనుందట. ఇక రాంచరణ్ జోడీగా బాలీవుడ్ భామను తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ కు జోడీగా కియారా అడ్వాణీ ఎంపికైనట్లు సమాచారం. కియారా అడ్వాణీ గతంలో రాంచరణ్ సరసన ‘వినయవిధేయరామ’ మూవీలో నటించింది. ఈ మూవీలో చెర్రీకి జోడీగా మెప్పించింది. తాజాగా ‘ఆచార్య’ మూవీలో కియారా అడ్వాణీ చరణ్ పక్కన ఆడిపాడేందుకు సిద్ధమవుతుంది. చిరు-152వ మూవీని రాంచరణ్-మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. చాలాకాలం తర్వాత చిరు మూవీకి మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.

Rakul Preet Singh Recent Glamour Stills

ఆ విషయంలో పవన్ దారిలో మహేష్!

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వమని ప్రజలను కోరడంలో ఆయన పవన్ కళ్యాణ్ ను అనుసరించారు.

సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో “మమ్మల్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెడుతున్న మన ధైర్య హృదయాలకు కూడా వందనం చేద్దాం మరియు ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మా బాల్కనీలలో నిలబడి నావంతు సహకారం ఇస్తానని, వారి నిర్ణయాన్ని మనం ఎంతగానో అభినందించాలంటూ మహేష్ ట్వీట్ చేశారు.

అయ్యో… రేవంత్!

ఒకవైపు అధికార పార్టీ దూకుడు,మరోవైపు సొంత పార్టీ నేతల మద్దతు లేకపోవడంతో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ సతమతమవుతున్నారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ వివాదంపై కాంగ్రెస్ కోర్ కమిటీలో భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన ఉత్తమ్‌ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం సీనియర్లతో మరింత దూరం పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్లతో గ్యాప్ కారణంగా పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్.. ఆ గ్యాప్‌ ను మరింత పెంచేలా వ్యవహరిస్తుండటం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో సీనియర్లను కాదని రేవంత్ నెగ్గుకురాగలరా.. అని ఆయన పార్టీలో చేరిన కొత్తలో చాలామంది సందేహాలు వెలిబుచ్చారు. ఆ సందేహాలన్నీ నిజమవుతూనే ఉన్నాయి. టీపీసీసీ పదవి విషయంలో ఇప్పటికే ఆయనకు సీనియర్ల సెగ తగిలింది. రేవంత్‌ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి ఇవ్వవద్దని చాలామంది సీనియర్లు హైకమాండ్‌ కు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా డ్రోన్ కేసు వ్యవహారంలోనూ రేవంత్‌ పై సొంత పార్టీ నుంచే విమర్శల దాడి మొదలైంది. దీంతో అటు అధికార పార్టీ,ఇటు సొంత పార్టీ దాడితో రేవంత్ సతమతమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది

రేవంత్ వ్యవహారంపై ఇటీవల సీనియర్ నేతల విమర్శల దాడి పెరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి,సీనియర్ నేతలు వీహెచ్,దామోదర రాజనరసింహ వంటి వారు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీని కేవలం కుంతియా,రేవంత్ మాత్రమే నడిపిస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ ఇద్దరే పార్టీని నడిపిస్తే.. ఇక తాము ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీరు కాదని ఘాటుగా స్పందించారు. ఏదైనా సరే.. కోర్ కమిటీ సమావేశం పెట్టి చర్చించాలని.. అప్పుడు పులులు,సింహాలు ఎవరో తేలుతుందని అన్నారు. అటు వీహెచ్ కూడా రేవంత్ తీరును తప్పు పట్టారు. పార్టీలో తానొక్కడినే పోరాడుతున్నానని చెప్పుకోవడం సరికాదన్నారు. అంతేకాదు,గతంలో రేవంత్ ఇందిరా,సోనియా గాంధీలపై చేసిన వ్యాఖ్యలను తాము ఇప్పటికీ మరువలేదని గుర్తుచేశారు.

మోడీని అవహేళన చేస్తే జాగ్రత్త.. కేసీఆర్ హెచ్చరిక

జనతా కర్ఫ్యూ పిలుపు ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతూ ఉండడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రపంచ ప్రజలకు భారత ప్రజల సమిష్టి సంసిద్ధతను తెలపడం కోసం ఇదొక్క గొప్ప అవకాశమని, విశేషంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం అని కొనియాడారు.

విపత్కర పరిస్థితులలో దేశ ప్రజలు అందరు ఒకటిగా స్పందించ వలసిన తరుణంలో ఇటువంటి వాఖ్యలు చేసేవారిని `వెధవలు’ అంటూ కేసీఆర్ ఖండించ్చారు. అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోమని డిజిపిని ఆదేశించారు.

రేపు సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టాలన్నారని కొందరు. అయితే ప్రధాని పిలుపును కొంతమంది సోషల్ మీడియాలో అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

‘ఏది ఏమైనా ఆయన మన ప్రధానమంత్రి.. ఆయనను మనం గౌరవించుకోవాలి. మన మంచి కోసమే మోడీ పని చేస్తున్నారు. ఆయనను కించపరిచేలా పోస్టులు పెడితే అరెస్టులు తప్పవు’ అని హెచ్చరించారు.

కరోనా వైరస్‌ని ఐక్యతతో ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటడానికి, కష్ట సమయంలో ధైర్యంగా మన కోసం సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్.. ఇతర సిబ్బందికి సంఘీభావం తెలిపేందుకు రేపు ఐదు గంటలు చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చారని ఆయన మద్దతు తెలిపారు. తాను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడతానని చెప్పారు.

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ

కరోనావైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా దేశం వ్యాప్తంగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, 14 గంటల పాటు మాత్రమే జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వగా, తెలంగాణలో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు 24 గంటలపాటు అమలు జరపాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు సూచించారు.

వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని, మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోతాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలని కేసీఆర్ కోరారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, పాలు, కూరగాయలు, పండు, పెట్రోల్‌ బంకులు, మీడియా సిబ్బందికి ఇందులోనుండి మినహాయింపు ఉందని చెప్పారు.

రెండురోజుల తర్వాత మహారాష్ట్ర సరిహద్దును మూసివేసే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టామని పేర్కొంటూ 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 52 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, 8 మంది జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌లు పని చేస్తున్నాయని వివరించారు.

మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని చెబుతూ 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. 700 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారని, ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వివరించారు. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారే అని తెలిపారు.

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెబుతూ విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. “జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం. ఇది మీ సామాజిక బాధ్యతగా గుర్తించాలి” అని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ జాగ్రత్త తో పాటు వాటా కూడా తీసుకొంటున్నాడు

జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే 30వ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కాగా ఈ చిత్ర విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండేలా చూసుకొంటూ సంగీతానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆ క్రమంలో అల వైకుంఠపురంలో చిత్రం కొరకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ నే ఎన్టీఆర్ చిత్రం కొరకు కూడా తీసుకొనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు త్రివిక్రమ్. థమన్ అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా పూర్తి న్యాయం చేయగలడని త్రివిక్రమ్, తారక్ నమ్ముతున్నారట. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత కోసం మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ గతంలో ఎన్టీఆర్ నటించిన బృందావనం మూవీకి కూడా సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ పంథా మార్చారు. వారు నటించే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. తారక్ కూడా ఇదే ఫాలో అవుతూ త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం నుండి ఈ పద్ధతి మొదలుపెట్టనున్నాడు. నిజానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ ది అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఈసారి వాటా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఓ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్న ఎన్ టి ఆర్ ఇకపై తాను నటించే ప్రతి సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకొన్నాడట.
Changing according to times

కేజ్రీవాల్ ప్రేమపూర్వక కర్ఫ్యూ!

మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ గూర్చి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదో పెద్ద యజ్ఞంగా భావిస్తూ.. అనేకమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా మోడీ ప్రసంగానికి ముగ్ధులైన అనేకమంది రాజకీయ విశ్లేషకులు మోడీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి ఢిల్లీలో కేజ్రీవాల్ విధించిన కర్ఫ్యూ అద్భుతమైన కర్ఫ్యూ అని అనేకమంది మేధావులు అభిప్రాయ పడుతున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ముందుజాగ్రత్త చర్యగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ లో ప్రభుత్వ విలేకరుల సమావేశాలన్నీ డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా విలేకరుల సమావేశాలు ఇక నుండి డిజిటల్‌ గా నిర్వహించబడతాయి. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలో ముందంజలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వారు అధిక బహిర్గతం వాతావరణంలో ఉన్నారు” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కరోనావైరస్ సంక్షోభం మధ్య రోజువారీ కూలీలు, కార్మికులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఖాళీ కడుపుతో ఎవరైనా పడుకోవాలనుకోవడం లేదని పేదవారినిపట్టించుకోవాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ తెలిపారు.

కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ రెట్టింపు అవుతుందని సిఎం తెలిపారు.

ఢిల్లీలోని రోడ్డు ప్రక్కన షెల్టర్లలో ఉన్నవారు, అనేకమంది నిరాశ్రయులకు ఆహారం అందిస్తామని, ఢిల్లీలో 72 లక్షల మంది పేదలకు సరసమైన ధరల దుకాణాల నుండి రేషన్ అందించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి వ్యక్తికి 50 శాతం రేషన్ పెంచడం ఉచితంగా ఇవ్వబడుతుందని కూడా కేజ్రీవాల్ తెలిపారు.

జనతా కర్ఫ్యూ సమయంలో 50% బస్సులు ఢిల్లీ రోడ్లపై నడవవు అని సిఎం అన్నారు.

పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “జాన్ “చిత్రం పూర్తి కాగానే తన తర్వాతి చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట. కాబట్టి,ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం యొక్క విఎఫ్ఎక్స్ కోసం సుమారు 50 కోట్లకు పైగా కేటాయించారట. అందుకు గాను విఎఫ్ఎక్స్ చేయటానికి అతిపెద్ద హాలీవుడ్ సాంకేతిక నిపుణులలో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా రూపొందుతోంది. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో ఊహించుకోవచ్చు. భారీ తారాగణంతో రూపొందే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందటంతో ఇక ప్రభాస్ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అంతా ఆశిస్తున్నారు.
Great people thinks high