కరోనా ఆర్ధిక భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సిఐఐ) సూచించింది. ఇందుకోసం ఆధార్ ఆధారంగా గ్రామీణ, పట్టణ పేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమ చేయాలని కోరింది. బలహీన వర్గాలు, వృద్దులకు రూ.10,000 చొప్పున అందించాలని సూచించింది.
పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతో పాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్ధీపనలు ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఈ ఉద్దీపనలతో రూ.5వేల చొప్పున అయితే 40 కోట్ల మందికి, రూ.10 వేల చొప్పున అయితే 20 కోట్ల మందికి సాయం అందించవచ్చని సిఐఐ పేర్కొంది. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుందని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
కరోన మూలంగా రియాల్టీ, విమానయానం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని బెనర్జీ తెలిపారు. ప్రస్తుత మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జిడిపిలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
ఈ అంశంపై ఆయన ప్రధాని మోడీకి లేఖవ్రాస్తూ దేశంలోని రూ.5 లక్షల ఆదాయం దిగువన కలిగిన 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరు పేదలకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించారు. దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
కాగా, రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని కేంద్రాన్ని సిఐఐ కోరింది. నిరర్ధక ఆస్తులుగా ప్రకటనకు 90 రోజుల నిబంధనకు బదులుగా 180 రోజులకు (సెప్టెంబర్ 30 వరకు) పొడగించాలని విజ్ఞప్తి చేసింది. ఇవి వెంటనే అమలైతే కరోన కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించవచ్చని సూచించింది.