Home Blog Page 8548

జంట నగరాల్లో మరింత పెరిగిన కరోనా భయం!

జంటనగరాలలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువమంది నగర వాసులు కావడంతో కరోనా భయం మరింతగా పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 300 కంటే ఎక్కువ కేసులు నమోదు కాగా అందులో 150కి పైగా కేసులు జంటనగరాలలో నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మణికొండ, రాజేంద్రనగర్, షాద్‌ నగర్‌ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరిలో 90 శాతం కేసులు మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనే వెలుగు చూడటం గమనార్హం.

దీంతో ముఖ్యంగా సికింద్రాబాద్, ఎంజే రోడ్, మహేంద్రహిల్స్, సికింద్రబాద్, ఎంజే రోడ్, నాంపల్లి, యూసఫ్‌ గూడ, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌ పేట, చంచల్‌ గూడ, నారాయణ గూడ, ఖైరతాబాద్, దారుషిఫా తదితర బస్తీల్లోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఈ కరోనా వైరస్‌ సోకిందో..? ఏ రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడనుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని బస్తీల్లో రాకపోకల నియంత్రణకు ముళ్లకంచెలను కూడా అడ్డుగా పెడుతున్నారు.

రక్షణ చర్యలు తీసుకోకుండా రెడ్ జోన్ లో పర్యటించిన మంత్రి

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రెడ్ జోన్ గా ప్రకటించిన చిలకలపూడి, సర్కారు తోట, సీతయ్య నగర్, నవీన్ మిట్టల్ కాలనీల లోని పలు ప్రాంతలలో రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సోమవారం పర్యటించారు. ఆయన ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం విశేషం.

ఉదయం ఏడు గంటల నుంచి పర్యటిస్తూ ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు ప్రజలకు ప్రతి ఇంటికి వస్తున్నాయా అని ప్రజల వద్ద నుండి సమాచారం తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులు, మందులు కావాల్సిన వారు పాంప్లేట్ లో ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే ఇంటివద్దకు తెచ్చి అందజేస్తారని అక్కడి ప్రజలకు మంత్రి తెలిపారు.

తెలంగాణ హాట్ స్పాట్లలో ఇంటింటా టెస్టులు


ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా వైరస్ జాడ ఉండబోదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తబ్లిగ్ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో కొత్తగా 200 కు పైగా కేసులు రావడంతో ఖంగు తిన్నా, పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం సడలిస్తే, తెలంగాణలో కూడా అమలు పరచడం కోసం కేసీఆర్ సిద్దపడుతున్నారు. ఈ లోగా తబ్లిగ్ జమాత్ నుండి వచ్చిన వారున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్ స్పాట్ లుగా ప్రకటించి, ఆ ప్రాంతలాల్ ఓప్రతి ఇంతా కరోనా టెస్ట్ ను నిర్వహించడం ద్వారా ఈ ఉపద్రవంను చాలావరకు కట్టడి చేయడం కోసం వ్యూహరచన చేశారు.

మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లు రాష్ట్రంలో సుమారు వంద మందికి వైరస్‌ను అంటించారు. ఇందులో అధికశాతం కుటుంబ సభ్యులే ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఇతరులకూ వైరస్ వ్యాపించింది. ర్కజ్‌లో పాల్గొన్నవారు, మార్చి 17 నుంచి 21 మధ్య వివిధ రైళ్లలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు.

వీళలో 160 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఇందులో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ , నిజామాబాద్‌, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్ కేంద్రాలను గుర్తిస్తున్న ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఈ నెల 14 నాటికి ఈ టెస్ట్ లను పూర్తి చేయనున్నారు. ఒక వేల పూర్తి కానీ పక్షంలో వరకే టెస్టులు పూర్తిచేయాలని భావిస్తోంది. లేదంటే, టెస్టులు పూర్తయ్యేవరకూ ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉంది.

ఇక తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్‌ వ్యక్తులున్న ఇళ్లకు మూడు కిలోమీటర మేర హాట్‌ స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్‌ ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలిసింది. ఈ ఏరియాల్లో ఇంటింటికి వెళ్లి లక్షణాలున్న వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయనున్నారు.

కరోనా పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం జరుపుతున్న పరీక్షల ఫలితాలు రావడానికి ఐదారు గంటల సేపు పట్టడమే కాకుండా, అందుకు అవసరమైన కిట్ల లభ్యత కూడా తక్కువగా ఉంది. దానితో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్ట దలచిన హాట్‌స్పాట్‌ ప్రాంత ప్రజలు, అనుమానితులకు ర్యాపిడ్ డయాగ్నసిస్‌ టెస్ట్‌ (ఆర్డీటీ) ద్వారా పరీక్షా చేయాలని నిర్ణయించింది.

ఈ పద్దతిలో ఐదు నిముషాలలో అక్కడికక్కడే ఫలితాలు రాగలవు. తొలుత అనుమానితుల రక్తాన్ని పరీక్షించి, కరోనా ఉన్నదీ లేనిదీ ప్రాథమికంగా నిర్థారిస్తారు. ఐదు, పది నిమిషాల్లోనే ఈ టెస్ట్‌ ఫలితం వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 4 లక్షల టెస్టింగ్ కిట్లను ఆర్డర్ చేశామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

కరోనాతో ఇద్దరు మృతి..266 పెరిగిన బాధితుల సంఖ్య!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితులు ఇద్దరు మృతి చెందినట్లు కరుణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. అనంతపురానికి చెందిన ఒక వ్యక్తి మక్కా సందర్శన వెళ్లి రావడంతో కరోనా సోకింది. ఈనెల1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగో తేదీ మరణించాడు. మచిలీపట్నం కు చెందిన మరో వ్యక్తి కి సెక్స్ వ్యాపార నిమిత్తం ఒరిస్సా వెళ్లి రావడంతో కరోనా సోకింది. ఈనెల 2వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4వ తేదీ రాత్రి మృతి చెందాడని అధికారులు ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266 కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఆదివారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు 14 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 32, నెల్లూరు జిల్లాలో 34, ప్రకాశం జిల్లాలో 23, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 16, విశాఖపట్నం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 56 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 56 నమోదై కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి.

మొదటి సారి తెరవెనుక నుండి చంద్రబాబు


కరోనా సంబంధించి లాక్ డౌన్ కారణంగా తన 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటి సారిగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పక్షం రోజులుగా తెరవెనుక నుండి వ్యవహరిస్తున్నారు. విద్యార్థి నాయకుడి దశ నుండి ఎప్పుడు చూసినా మితృలు, పార్టీ నేతలు, అధికారులతో గంటల తరబడి సమాలోచనలు జరుపుతూ ఉండే ఆయన ఇప్పుడు వారెవ్వరిని కలవకుండా హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయ్యారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా ఉదయమే కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి పొద్దు పోయే వరకు గడపటం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు, పార్టీ నేతలు ఆయనతో సమావేశం కోసం గంటల తరబడి వేచి ఉండడం ఎప్పుడు జరుగుతూ ఉండెడిది.

ఆయా సమావేశాలు గంటల తరబడి ఆలస్యంగా జరుగుతూ ఉండెడివి. పలు సందర్భాలలో భార్య భువనేశ్వరి రాత్రి సమయాలలో ఫోన్ చేసి, సమావేశాలను సత్వరం కుదించాలని, వయస్సు – ఆరోగ్యం దృష్ట్యా తొందరగా నిద్రకు వెళ్లాలని వారిస్తూ ఉండేవారు .

అందుకు భిన్నంగా, ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 6 గంటలు దాటితే ఎవ్వరికీ అందుబాటులో ఉండరు. సాధారణంగా ఆయన పిలిస్తే తప్ప మంత్రులు, ఉన్నత అధికారులకు సహితం ఆయనను కలవడం సాధ్యం కాదు. ఇక వారాంతరమైతే ఆయన సాధారణముగా ఎవ్వరికీ అందుబాటులో ఉండరు.

ఇప్పుడు తమ నేత ఇంటికే పరిమితం కావడంతో తమకు కొంత కాలం విరామం అనుకున్న టిడీపి నాయకులకు మాత్రం నిరాశే ఎదురవుతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వీడియో/టెలి కాన్ఫరెన్స్ లు జరుపుతూ ఉండడంతో ఎప్పుడు అప్రమత్తంగా ఉండవలసి వస్తున్నదని, తమతో గడపలేక పోతున్నారని అంటూ టిడిపి నేతలు కుటుంభం సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇక నిత్యం మీడియాతో గడపడం టీడీపీ అధినేతకు పరిపాటిగా మారింది. అందుకు విరుద్ధంగా జగన్ మోహన్ రెడ్డి చాల అరుదుగా మీడియా ముందుకు వస్తారు. అప్పుడు కూడా అందరికి ప్రశంలు వేసే అవకాశం ఉండదు అనుకోండి. అయితే కరొనపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు ఒక విధంగా అయన పార్టీ వారికే విసుగు కలిగిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో, దేశంలో నెల కొన్న పరిస్థితులపై నిర్దుష్టమైన అంశాలను ప్రస్తావించకుండా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలపై తన `పరిజ్ఞానం’ తెలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారనే ఈసడింపులు వినవస్తున్నాయి.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడులో గతంలో ఎన్నడూ లేని ఒక మార్పు కనిపిస్తున్నది. తన రాజకీయ ప్రత్యర్థులను ప్రస్తావించడం లేదు. బొత్స సత్యనారాయణ, విజయ్ సాయి రెడ్డి వంటి వారు నిత్యం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా స్పందించడం లేదు. కేవలం విధానపరమైన అంశాలకు, పాలనాపరమైన చర్యలకు పరిమితం అవుతున్నారు.

టిడిపి ప్రారంభించినప్పటి నుండి బహుశా మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం నుండి నిర్దిష్టమైన కార్యక్రమం గత పక్షం రోజులుగా లేకపోవడంతో వారంతా చాలావరకు మౌనంగా ఉంటున్నారు. చివరకు బిజెపి కార్యకర్తలు సహితం పేదలకు ఆహారం అందించడం, ప్రజలకు మాస్క్ లు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

లాయర్ గారు ఒక్కడే వచ్చేలా ఉన్నాడు

pawan


2020 లో తెలుగు సినిమా పెద్ద చిత్రాలతో కళకళ లాడి పోతుందని అంతా భావించారు. ఆరంభంలో వచ్చిన `అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ` చిత్రాలు అద్భుత విజయాన్ని సాధించి , వసూళ్ల మోత మోగించాయి . ఇక అదే ఊపులో 2020లో తెలుగు సినిమా మోతెక్కిపోతుందని సినీ రంగం ఆశించింది . ‘ఆర్ఆర్ఆర్’తో పాటు, `ఆచార్య ` , బన్నీ సుకుమార్ కాంబో మూవీ , ప్రభాస్ ,పూజా హెగ్డే ల భారీ చిత్రం …ఇలా ఎన్నో భారీ చిత్రాలు ఈ ఏడాది సందడి చేయాల్సి ఉంది. కానీ చూస్తుండగానే కరోనా ఎఫెక్ట్ తో పరిస్థితులు మారిపోయాయి.

ఇక ప్రారంభం కావాల్సిన చిత్రాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతా అనుకున్న ప్రకారం జరిగినట్టయితే మహేష్ కొత్త చిత్రం ఈపాటికి పట్టాలెక్కాల్సింది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఆరంభించేందుకు నిర్మాత , దర్శకులు రెడీ గా ఉన్నారు. నిజానికి ఆ చిత్రాన్ని ఈ ఏడాదే పూరి చేయాలను కొన్నారు. కానీ అది కూడా ఈ ఏడాదికి పూర్తి కాదు.

ఇవన్నీ అలా సందిగ్ధం లో కొట్టుమిట్టాడు తుంటే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మాత్రం ఈ సంవత్సరం వెలుగు చూడటం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు పూర్తయిన ఈ చిత్రం సాధారణ పరిస్థితులు వచ్చాక రెండు నెలల్లో రెడీ అయిపోతుంది కాబట్టి రూట్ క్లియర్ అయ్యింది.

రెండు సినిమాలు ఒకే చేసిన శర్వానంద్


మన తెలుగు యువ హీరోల్లో శర్వానంద్ భిన్నంగా ఆలోచిస్తాడు. కథ కొత్తగా ఉండాలి దానికి తగ్గట్టు .. తన పాత్ర వైవిధ్యభరితంగా ఉండాలి అనుకొంటాడు..అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఇటీవల శర్వానంద్ సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఆయన కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది..ఆ క్రమంలో ఇపుడు రెండు ప్రాజెక్ట్ లు ఒకే చెప్పాడని తెలుస్తోంది.

‘ఆర్ఎక్స్ 100’ వంటి సూపర్ హిట్ మూవీ తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి ఆ చిత్ర నిర్మాతకి
పెట్టుబడి మీద పది రెట్లకు మించి లాభాలు తెచ్చి పెట్టాడు . ఆ దర్శకుడితో సినిమా చేయడానికి శర్వానంద్ రాదు అవుతున్నాడు.ఈ దర్శకుడు ఏడాది కిందటే ‘మహాసముద్రం’ అనే పేరుతో తన రెండో సినిమాకు స్క్రిప్టు రెడీ చేసేశాడు. కానీ దానికి నిర్మాతను ఎంపిక చేసుకోవడం లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు.

ఐతే ఎట్టకేలకు దర్శకుడు అజయ్ భూపతి నిరీక్షణ ఫలించిందని. తెలుస్తోంది. శర్వా నంద్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఒక పెద్ద నిర్మాత ఓకే అన్నాడట.. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మించ బోతున్నాడు అని తెలుస్తోంది .

అదలా ఉండాగా శర్వానంద్ మరో సినిమా అంగీకరించడం జరిగింది. ప్రముఖ డాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఈ సినిమాలో కథానాయకుడిగా శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా తమిళంలో నిర్మితం కానుంది. ‘జర్నీ’ తరువాత తమిళంలో శర్వానంద్ చేస్తున్న రెండో సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులోను విడుదల అయ్యే ఈ చిత్రం అన్నీ కుదిరితే మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకో నుంది.

కరోనా జంగ్ అంటున్న అల్ ఇండియా స్టార్స్


కరోనా వైరస్ విస్తృతమౌతున్న తరుణంలో భారతీయ చలన చిత్ర రంగానికి చెందిన ఎందరో తారలు సోషల్ మీడియా లో ప్రజల్ని చైతన్య పరచడం మొదలెట్టారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాగా వివిధ భాషల అగ్ర తారల కలయికలో తాజాగా మరో వీడియో రూపొందించడం జరిగింది. హిందీ , తెలుగు , తమిళ రంగాలకు చెందిన శిఖరాగ్ర నటుల కలయికలో కరోనా వైరస్ ఫై రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం రేపు మన ముందుకి రాబోతుంది.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహకారంతో ప్రసూన్ పాండే దర్శక పర్యవేక్షణలో కరోనా వైరస్ సంబంధంగా ఒక షార్ట్ ఫిలిం రెడీ అయ్యింది. ఇందులో అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , మెగా స్టార్ చిరంజీవి , రణబీర్ కపూర్ , ప్రియాంక చోప్రా , అలియా భట్ నటించడం జరిగింది. కాగా ఈ లఘు చిత్రానికి ‘ఫామిలీ ‘ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఈ లఘు చిత్రం లో కరోనా వైరస్ ని నివారించడం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెబుతారట … ఇంట్లో ఎలా మసలు కోవాలి ,ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు , మంచి ఆహారం ఏం తీసుకోవాలి , సామాజిక దూరం ఎలా పాటించాలి వంటి అంశాలు ఉంటాయట … అలా రూపొందిన ” ఫామిలీ ” లఘు చిత్రం మార్చ్ 6 సోమవారం రాత్రి 9 గంటలకు సోనీ నెట్ వర్క్ ద్వారా ప్రసారం కాబోతుంది.

మానవత్వం చూపుతున్న మెగా కోడలు


కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత భయపెట్టినా కొంతలో కొంత మేలు చేస్తోంది.ప్రజల మధ్య సంఘీభావం పెంచు తోంది. ఒకరికి ఒకరు తోడుండాలి అన్న నిత్య సత్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. ఉన్నోడికి లేనోడి భాద అర్ధమయ్యేలా చేసింది. ఇంకా చెప్పాలంటే నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపింది. మన చుట్టూ ఉన్న వాళ్లలో అంతర్లీనంగా ఉన్న సేవా గుణం ఇప్పుడు బయటికి వస్తోంది. దాంతో ఇతరులకు తమ చేతనైనంత, చేయగలిగినంత సాయం చేస్తున్నారు. మానవ సమాజం బలంగా సంఘటిత మౌతోంది. నిత్యాన్న దానం చేస్తున్న మహానుభావులు ఇపుడు చాలా మంది తయారయ్యారు. అనిశ్చిత గృహ నిర్బంధం మానవ సంబంధాలకు వారధి అయ్యింది. ఎన్నో మంచి పనులు చేయిస్తోంది.

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నరోజువారీ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ ‘ ( సి సి సి ) ఏర్పాటైంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు తారలు , నిర్మాతలు , దర్శకులు ,సాంకేతిక నిపుణులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. సుమారు 7 కోట్ల పైనే విరాళాలు పోగయ్యాయి. ఇపుడా డబ్బుని రోజువారీ సినీ కార్మికుల నిత్యావసరాల కోసం వెచ్చించ బోతున్నారు . దానిలో కొంత ఆర్ధిక సాయం కూడా ఉంటుందట ..ఇవన్నీ ఒకెత్తు అయితే చిరంజీవి కోడలు , రాంచరణ్ భార్య అయిన ఉపాసన కొణిదెల ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. తాను డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న అపోలో హాస్పిటల్స్ కి సంబందించిన ఫార్మసీ లలో సినీ రంగానికి చెందిన దినసరి కార్మికులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు సంకల్పించింది.

వామ్మో.. చికెన్ ధర ఇంత పెరిగిందా!

దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి పై పుట్టుకొచ్చిన వదంతుల్లో ఒకటి “చికెన్ తింటే కరోనా వస్తుంది”. అయితే అది తప్పుడు ప్రచారం అని తేలాడంతో.. చికెన్ ట్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఐదింతలు పెరిగాయి. గుడ్డు కూడా 5రూపాయలకు చేరింది. కరోనా పుకార్లతో మార్చిలో చికెన్‌‌‌‌‌‌‌‌ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తినేందుకే జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని జిల్లాల్లో కోళ్లు ఫ్రీగా కూడా ఇచ్చారు. మరికొన్నిచోట్ల పాతిపెట్టారు .

ఈ రెండు నెలల వ్యవధిలో పౌల్ట్రీ పరిశ్రమకు దాదాపు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. చికెన్‌‌‌‌‌‌‌‌ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం, జనం కూడా ఇండ్లల్లోనే ఉంటుండడంతో గిరాకీ ఊపందుకుంది. ఆదివారం హైదరాబాద్ లోని చికెన్ సెంటర్ల దగ్గర  జనం బారులు దీరారు. గతంలో స్కిన్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ కిలో రూ.40 ఉండగా, తాజాగా రూ.230 వరకు అమ్ముతున్నారు. విత్‌ స్కిన్‌ ‌‌‌‌‌‌‌కిలో రూ.200, లైవ్‌‌‌‌‌‌‌‌ 100 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు. గుడ్డు ధరలు కూడా అమాంతం పెరిగాయి. లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో ఒక్క గుడ్డు రూ.3 ఉండగా, ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు మటన్‌‌‌‌‌‌‌‌ ₹700 నుంచి ₹ 850కి పెరిగింది. మాంసం ధరలు పెరగకుండా చూస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు కనిపించడం లేదు.

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ విధించడంతో… జనజీవనం, రవాణా స్తంభించింది. అత్యవసర సరుకులను మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో కోళ్లు , మేకలు, గొర్రెల ట్రాన్స్ ‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోయింది. లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ కు ముందు పెద్దఎత్తున కోళ్లను పాతిపెట్టారు. ఆ తర్వాత కూడా పౌల్ట్రీల్లో పెద్దగా పెంపకం చేపట్డడంలేదు. ఇలా డిమాండ్ మేరకు సప్లయ్ లేక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తక్కువ మొత్తంలో కోళ్లు , మేకలు ఉండటంతో ఎక్కువ ధరకు అమ్ముతున్నామని, ఇప్పటికే కరోనా ప్రభావంతో పెద్దఎత్తున నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు.

కరోనా మీద ఐక్య పోరాటానికి చిహ్నం..

కరోనా వైరస్‌ మీద జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఈ రాత్రి తొమ్మిది గంటలకు తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు నివాసంలో లైట్లు ఆన్నీ ఆఫ్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా కోవిడ్‌ –19 పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటై ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం ఇప్పటికే తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

భారతీయుల దీక్ష, దక్షతలకు ప్రతిరూపంగా జ్యోతీప్రజ్వలన: గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్

కరోనా మహమ్మారి నుండి భారతావనిని రక్షించుకునే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించి తమలోని ఐక్యతను చాటటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ దంపతులు బిశ్వ భూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 9 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు జ్యోతులను వెలిగించి కరోనా వ్యాప్తి నిరోధం పట్ల తమ అంకాంక్షను ప్రపంచానికి చాటారు.
ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ దీపాలను ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించటం సహేతుకమైన పోరాటానికి నిదర్శనమన్నారు. జనతా స్ఫూర్తిని మరోమారు చాటుతూ, రాష్ట్ర ప్రజలు తమ విలువైన సమయంలో 9 నిమిషాలు దేశం కోసం కేటాయించటం అభినందనీయం అన్నారు.

కారోనా ను తరిమికొట్టాలి: బాబు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్లోని వారి నివాసంలో క్యాండీల్స్ వెలిగించారు. దేవాంషు ఈ కార్యక్రమంలో పాల్గొని టార్చితో వెలుగు ప్రదర్శించాడు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కరోనాపై పోరాటం చేసి తరిమి కొట్టాలన్నారు.

నెగటివ్ గా మారిన కనికా కపూర్


`టూటక్ టూటక్ టూటీయా` ఫేమ్ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయట పడింది. మార్చ్ తొమ్మిదో తారీఖున లండన్ నుంచి ఇండియా కి వచ్చిన ఈ లక్నో గాయని వెంట వెంటనే రెండు , మూడు పార్టీ ల్లో పాల్గొంది. ఆ క్రమంలో మార్చ్ 14 వ తారీఖున కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. అయినాగానీ నిర్లక్ష్యం తో క్వారంటైన్ కి వెళ్లకుండా బయట తిరగడం జరిగింది.దాంతో కనికా కపూర్ మార్చ్ 20 వ తారీఖున కోవిడ్ 19 టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆ తరవాత ఇప్పటి వరకు మార్చ్ 23, 24, 27, 31 తారీకుల్లో వరుసగా నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 4 న ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడం జరిగింది.

ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వీయ నిర్బంధంలో ఉన్న కనికా కపూర్ పూర్తి నెగిటివ్ వచ్చేంతవరకూ మరో 8 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కరోనాపై విజయం సాధించినట్లే. కాగా నెగిటివ్ రిపోర్ట్ రావడంపై కనికా కపూర్ కుటుంబ సభ్యులు, మిత్రులు మిక్కిలి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న రెండు వారాలు అత్యంత కీలకం: రాజీవ్ గౌబ


కరోనా వైరస్ మహమ్మారిని జయించేందుకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని కావున అన్ని రాష్ట్రాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. కోవిద్-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల కలక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్మెంట్ విధానం పై ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ సెషన్ ను ఆదివారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేసేలా చూడాలని సిఎస్ లకు సూచించారు. ఆహారం, మందులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.లాక్ డౌన్, కంటైన్మెంట్ విధానాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని చెప్పారు.లాక్ డౌన్ ఆనేది మనకు లభించిన అద్భుత అవకాశమని దీనిని కట్టుదిట్టం గా అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమి గొడదామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాల్లో ర్యాఫిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సిఎస్ లను, కలెక్టర్లను ఆదేశించారు.,రాష్ట్రాలు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని వనరులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అవసరమైన సమయంలో అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. హైరిస్క్ ఉన్నవారంతా విధిగా క్వారంటైన్ కేంద్రాలు లేదా ఐసోలేషన్లోను ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.ఇప్పటి వరుకూ విజయవంతం గా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నందుకు రాష్ట్ర,జిల్లా యంత్రాంగాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రత్యేకంగా అభినందించారు.

ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

దోపిడీ చేయడమే కరోనపై జగన్ చేస్తున్న పోరాటమా?


ముఖ్యమంత్రి ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో, ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలంటూ అర్ధం లేని ప్రకటనలు ఇచ్చి ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చెయ్యడమే కరోనా పై జగన్ చేస్తున్న పోరాటమా అని టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. శ్మశానాల దగ్గర నుండి మరుగుదొడ్ల వరకూ దేనిని వదలకుండా వైకాపా రంగులు వేసుకోవడానికి రూ. 2 వేల కోట్లు మింగారని ట్వీట్ చేశారు. ఇప్పుడు అవి తొలగించే పేరుతో మరో రూ. 2 వేల కోట్లు కాజేసేందుకు చూసున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు దోచుకున్న రూ. 4 వేల కోట్లు పెడితే రాష్ట్రంలో ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు కొని ఉంటే ఈ సమయంలో ప్రజలకు ఉపయోగపడేవన్నారు. కరోనా లాంటి వైరస్ ని ఎదుర్కోవడానికి అన్ని వసతులు ఉన్న ప్రత్యేక ఆసుపత్రి నిర్మించుకోవచ్చని తెలిపారు. కరోనా వచ్చి ఉపాధి లేక ప్రజలు సర్వం కోల్పోయినా బ్లూ పత్రిక దోపిడీ ఆగడం లేదన్నారు.

లాక్ డౌన్ తో కల్లుకు పెరిగిన గిరాకీ


లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు గత నెల నుంచి మూతబడ్డాయి. ఫలితంగా కల్లుకు గిరాకీ పెరిగింది. గ్రామాల్లో తాడి చెట్ల వద్దకు మద్యం ప్రియులు పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో మద్యం దొరకక పోవడంతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు మరింత వింతగా ప్రవర్తించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్ లోను మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ అందుబాటులో లేకపోవడం, ఇదే సమయంలో కల్లుకు సీజన్ ప్రారంభం అవడంతో మద్యం ప్రియులు కల్లు కోసం క్యూ కడుతున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన మద్యం ప్రియులు సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు వెళ్లి కల్లుతో జీవిస్తున్నారు. ఎక్కడ కొందరు సామాజిక దూరం పాటించక పోవడంతో తోటివారు ఇబ్బందులకు గురవుతున్నారు. కల్లు కోసం కూడా కొన్నిచోట్ల పోటీ పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం మద్యానికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆ శాఖ సి.ఐ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు, చిత్తూరు, తదితర జిల్లాలో కొన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలలో దొంగతనాలు జరిగాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలో మద్యం కు ఉన్న డిమాండను స్పష్టం చూస్తోంది.

డీఆర్డీవో కొత్త ఆవిష్కరణ.. 25 సెకన్లలో వైరస్‌ ఖతం


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపచంలోని అన్ని దేశాలకు కరోనా వైరస్ పాకింది. పేద, ధనిక దేశాలనే తేడాలేకుండా కరోనా విజృంభిస్తుంది. కరోనా దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు సరైన సదుపాయాలు లేనప్పటికీ వైద్యలు ధైర్యసాహసాలతో ముందుజాగ్రత్తలు తీసుకుంటూ పోరాడుతున్నారు.

ఈనేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రెండు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఇందులో పర్సనల్‌ శానిటైజేషన్‌ ఎన్‌క్లోజర్‌ ఒకటి. ఇందులో ఉండే షవర్‌ హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఈ షవర్ కింద వైద్యులు 25సెకన్లపాటు నిలబడితే వారి దుస్తులపై ఉండే వైర్‌స్ లు నశిస్తాయి. ఈ ఎన్‌క్లోజర్‌ యంత్రంలో 700లీటర్ల హైపో సోడియం క్లోరైడ్‌ను నింపే వీలుంది. ఒక్కో ట్యాంకు ద్రావణం 650మంది డాక్టర్ల వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగపడనుంది.

అదేవిధంగా కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్ల కోసం తేలికపాటి ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇప్పటికే 100 ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌లను ఈఎస్ఐసీ ఆసుపత్రులకు అందజేశారు. దీంతోపాటు మరో 10వేల మాస్కుల తయారీకి ఆర్డర్లు వచ్చాయని డీఆర్డీవో తెలిపింది. వీటిని త్వరలోనే వైద్యులకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతో వైద్యుల రక్షణకు ఉపయోగపడేలా డీఆర్డీవో సరికొత్త ఆవిష్కరణలు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నగదు పంపిణీపై ఈసీకి కన్నా ఫిర్యాదు


లాక్ డౌన్ తో ఉపాధి లేక, నిస్సహాయంగా ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు గలవారికి కుటుంభానికి రూ 1,000 చొప్పున నగదు పంపిణి జరుగుతున్న తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

ఇటీవలనే జగన్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తే జైలు శిక్షతో పాటు, పోటీకి అనర్హులుగా ప్రకటించే వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సు ప్రకారం అటువంటి వారందరిని అనర్హులుగా ప్రకటించాలని కమీషనర్ కు వ్రాసిన లేఖలో కన్నా డిమాండ్ చేశారు.

ఈ నగదును వైసిపి నేతలు, పైగా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారు ఇంటింటికి పోయి పంపిణి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా సాయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కరోనా సాయం మొత్తాన్ని గ్రామ/వార్డ్ వాలంటీర్లు పంపిణీ చేయాలని, కానీ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, పోటీదారులు హైజాక్ చేశారని కన్నా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమ పార్టీ పంపిణీ చేస్తున్నట్లుగా డబ్బును పంపిణీ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

పంపిణీ చేస్తున్న సహాయాన్ని గుర్తుంచుకోవాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వారు బహిరంగంగా లబ్ధిదారులకు చెబుతున్నారని ఆయన ఈసీ దృష్టికి తీసుకు వచ్చారు. ఆ విధంగా వారు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ సందర్భాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది ప్రభుత్వ నిధులతో ఓటర్లను ప్రేరేపించడం తప్ప మరొకటి కాదని కన్నా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రాథమిక నైతిక నియమావళిని ఉల్లంఘించారని చెబుతూ అధికార పార్టీ అభ్యర్థులకు ప్రయోజనాన్ని కలిగించేలా ఉన్నదని విమర్శించారు.

ఈ పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్న కొంతమంది పార్టీ నాయకులు 200/300 రూపాయలను తగ్గించి జేబులో వేస్తున్నారని పలు ప్రసార సాధనాల్లో వార్తలు వచ్చాని కన్నా ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం చీకటిలో చిక్కుకున్న సమయంలో ఈ సహాయం కూడా పేద ప్రజలకు పూర్తిగా చేరకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనధికార నగదు పంపిణీ వెంటనే ఆపాలని కన్నా డిమాండ్ చేశారు.