
కరోనా సంబంధించి లాక్ డౌన్ కారణంగా తన 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటి సారిగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పక్షం రోజులుగా తెరవెనుక నుండి వ్యవహరిస్తున్నారు. విద్యార్థి నాయకుడి దశ నుండి ఎప్పుడు చూసినా మితృలు, పార్టీ నేతలు, అధికారులతో గంటల తరబడి సమాలోచనలు జరుపుతూ ఉండే ఆయన ఇప్పుడు వారెవ్వరిని కలవకుండా హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయ్యారు.
అధికారంలో ఉన్నా, లేకపోయినా ఉదయమే కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి పొద్దు పోయే వరకు గడపటం ఆయనకు అలవాటు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు, పార్టీ నేతలు ఆయనతో సమావేశం కోసం గంటల తరబడి వేచి ఉండడం ఎప్పుడు జరుగుతూ ఉండెడిది.
ఆయా సమావేశాలు గంటల తరబడి ఆలస్యంగా జరుగుతూ ఉండెడివి. పలు సందర్భాలలో భార్య భువనేశ్వరి రాత్రి సమయాలలో ఫోన్ చేసి, సమావేశాలను సత్వరం కుదించాలని, వయస్సు – ఆరోగ్యం దృష్ట్యా తొందరగా నిద్రకు వెళ్లాలని వారిస్తూ ఉండేవారు .
అందుకు భిన్నంగా, ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 6 గంటలు దాటితే ఎవ్వరికీ అందుబాటులో ఉండరు. సాధారణంగా ఆయన పిలిస్తే తప్ప మంత్రులు, ఉన్నత అధికారులకు సహితం ఆయనను కలవడం సాధ్యం కాదు. ఇక వారాంతరమైతే ఆయన సాధారణముగా ఎవ్వరికీ అందుబాటులో ఉండరు.
ఇప్పుడు తమ నేత ఇంటికే పరిమితం కావడంతో తమకు కొంత కాలం విరామం అనుకున్న టిడీపి నాయకులకు మాత్రం నిరాశే ఎదురవుతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వీడియో/టెలి కాన్ఫరెన్స్ లు జరుపుతూ ఉండడంతో ఎప్పుడు అప్రమత్తంగా ఉండవలసి వస్తున్నదని, తమతో గడపలేక పోతున్నారని అంటూ టిడిపి నేతలు కుటుంభం సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఇక నిత్యం మీడియాతో గడపడం టీడీపీ అధినేతకు పరిపాటిగా మారింది. అందుకు విరుద్ధంగా జగన్ మోహన్ రెడ్డి చాల అరుదుగా మీడియా ముందుకు వస్తారు. అప్పుడు కూడా అందరికి ప్రశంలు వేసే అవకాశం ఉండదు అనుకోండి. అయితే కరొనపై చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు ఒక విధంగా అయన పార్టీ వారికే విసుగు కలిగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో, దేశంలో నెల కొన్న పరిస్థితులపై నిర్దుష్టమైన అంశాలను ప్రస్తావించకుండా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులలపై తన `పరిజ్ఞానం’ తెలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారనే ఈసడింపులు వినవస్తున్నాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడులో గతంలో ఎన్నడూ లేని ఒక మార్పు కనిపిస్తున్నది. తన రాజకీయ ప్రత్యర్థులను ప్రస్తావించడం లేదు. బొత్స సత్యనారాయణ, విజయ్ సాయి రెడ్డి వంటి వారు నిత్యం తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా స్పందించడం లేదు. కేవలం విధానపరమైన అంశాలకు, పాలనాపరమైన చర్యలకు పరిమితం అవుతున్నారు.
టిడిపి ప్రారంభించినప్పటి నుండి బహుశా మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం నుండి నిర్దిష్టమైన కార్యక్రమం గత పక్షం రోజులుగా లేకపోవడంతో వారంతా చాలావరకు మౌనంగా ఉంటున్నారు. చివరకు బిజెపి కార్యకర్తలు సహితం పేదలకు ఆహారం అందించడం, ప్రజలకు మాస్క్ లు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.