
లాక్ డౌన్ తో ఉపాధి లేక, నిస్సహాయంగా ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు గలవారికి కుటుంభానికి రూ 1,000 చొప్పున నగదు పంపిణి జరుగుతున్న తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
ఇటీవలనే జగన్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తే జైలు శిక్షతో పాటు, పోటీకి అనర్హులుగా ప్రకటించే వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సు ప్రకారం అటువంటి వారందరిని అనర్హులుగా ప్రకటించాలని కమీషనర్ కు వ్రాసిన లేఖలో కన్నా డిమాండ్ చేశారు.
ఈ నగదును వైసిపి నేతలు, పైగా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న వారు ఇంటింటికి పోయి పంపిణి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా సాయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కరోనా సాయం మొత్తాన్ని గ్రామ/వార్డ్ వాలంటీర్లు పంపిణీ చేయాలని, కానీ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, పోటీదారులు హైజాక్ చేశారని కన్నా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమ పార్టీ పంపిణీ చేస్తున్నట్లుగా డబ్బును పంపిణీ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పంపిణీ చేస్తున్న సహాయాన్ని గుర్తుంచుకోవాలని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వారు బహిరంగంగా లబ్ధిదారులకు చెబుతున్నారని ఆయన ఈసీ దృష్టికి తీసుకు వచ్చారు. ఆ విధంగా వారు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ సందర్భాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది ప్రభుత్వ నిధులతో ఓటర్లను ప్రేరేపించడం తప్ప మరొకటి కాదని కన్నా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రాథమిక నైతిక నియమావళిని ఉల్లంఘించారని చెబుతూ అధికార పార్టీ అభ్యర్థులకు ప్రయోజనాన్ని కలిగించేలా ఉన్నదని విమర్శించారు.
ఈ పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్న కొంతమంది పార్టీ నాయకులు 200/300 రూపాయలను తగ్గించి జేబులో వేస్తున్నారని పలు ప్రసార సాధనాల్లో వార్తలు వచ్చాని కన్నా ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం చీకటిలో చిక్కుకున్న సమయంలో ఈ సహాయం కూడా పేద ప్రజలకు పూర్తిగా చేరకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనధికార నగదు పంపిణీ వెంటనే ఆపాలని కన్నా డిమాండ్ చేశారు.