Home Blog Page 8539

రతన్ టాటా పేరుతో వైరల్ అయిన ఆ వార్త ఫేక్!

దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి అదే స్థాయిలో కోవిద్19 పై నకిలీ వార్తలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా  ప్రముఖ పారిశ్రామిక వేత్త , టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ఈ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీంతో స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా నకిలీ వార్తపై స్పందించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి తాను చెప్పినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు, తనకు సంబంధం లేదని  రతన్ టాటా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం  ట్వీట్ చేశారు.

ఆ పోస్ట్ నేను రాయలేదు..చెప్పలేదు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నవార్తల పట్ల నిజానిజాలు తెలుసుకోవాలని రతన్ టాటా కోరారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పదల్చుకుంటే తానే అధికారికంగానే చెబుతానని వెల్లడించారు. నకిలీ వార్తలు, సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించారు. అందరూ క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలని రతన్ టాటా ఆకాంక్షించారు.  కరోనా సంక్షోభ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ ప్రభావంపై రతన్ టాటా వ్యాఖ్యల పేరుతో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యాఖ్యలు తనవి కావంటూ స్వయంగా రతన్ టాటా  నకిలీ వార్తలకు ముగింపు పలికారు.

ఇటీవల, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో రతన్ టాటా ప్రభుత్వానికి రూ .1,500 కోట్లు అందించారు. టాటా ట్రస్ట్స్ రూ .500 కోట్లు చెల్లించింది, టాటా సన్స్ కూడా రూ .1,000 కోట్ల అదనపు మద్దతును ప్రకటించింది, మొత్తం రూ .1,500 కోట్లు.కోవిడ్ 19 సంక్షోభం మేము ఒక జాతిగా ఎదుర్కొనే క్లిష్ట సవాళ్ళలో ఒకటి. టాటా ట్రస్ట్స్ మరియు టాటా గ్రూప్ కంపెనీలు గతంలో దేశ అవసరాలకు విరాళం ప్రకటించాయి ఇప్పుడు, ఇక ముందు ఎప్పుడు మా సహకారం దేశానికి ఉంటుందని రతన్ టాటా వెల్లడించారు.

హనుమంతుడికి వలే మోదీకి దిక్కుతోచడం లేదా!


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ మాత్రమే మార్గం అంటూ దాదాపు ఎవ్వరిని సంప్రదించకుండా ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు దాని మూడు వారాల గడువు పూర్తవుతూ ఉండడంతో కొంచెం అయోమయానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. దానిని పొడిగించాలా, సడలించాలా లేదా తొలగించాలా; ఏమి చేసినా ఆ తర్వాత ఏమి చేయాలో సలహాలు చెప్పండి అంటూ గత వారం రోజులుగా అందరిని కోరుతున్నారు.

గతంలో ఎప్పుడు ఏ విషయమైన కూడా ఎవ్వరిని ప్రధాని మోదీ సంప్రదించిన దాఖలాలే లేవు. ప్రతిపక్షాలను మాత్రమే కాదు సొంత పార్టీ వారిని, చివరికి మంత్రివర్గ సహచరులను సహితం విశ్వాసంలోకి తీసుకున్న దుష్ట్రాంతరాలు లేనే లేవు.

ఆయన మంత్రివర్గంలో ఎంతో బలవంతుడుగా భావించే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సంప్రదించకుండానే నోట్ల రద్దు తీసుకొచ్చారు. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ప్రమేయం లేకుండానే ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపారు.

చివరకు సైద్ధాంతికంగా బిజేపికి ఎంతో ముఖ్యమైన ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి విషయాలలో సహితం సొంత మంత్రులతో కూడా తగు రీతిలో సంప్రదింపులు జరపలేదు.

ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించే విషయమే రెండు సార్లు ముఖ్యమంత్రులతో, ఒక సారి ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, వివిధ పార్టీల అధ్యక్షులతో స్వయంగా టెలిఫోన్ చేసి మాట్లాడారు.

ఇదంతా ఆయనెందుకు చేస్తున్నారు? ఇక్కడి నుండి ముందుకు వెళ్లడం అర్ధం కావడం లేదా? ఒక వంక తబ్లిగ్ జమాత్ సదస్సు ఉనికిని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కనిపెట్టలేక పోవడంతో భారీ మూల్యం చెల్లింపవలసి వచ్చింది. ఆరేళ్ళ పాలనలో కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు చతికలపడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రధాని ఉపదేశాలు తప్ప నిధులు రాల్చడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వాలలో వెల్లడి అవుతున్నది. లాక్ డౌన్ కొనసాగితే ఆర్ధిక కార్యక్రమాలు స్తంభించిపోయి రోజువారీ ఖర్చులకు సహితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.

లాక్ డౌన్ లోనే పలు రేట్లు పెరిగిన కరోనా వైరస్ సడలిస్తే ఏమౌవుతుందనే భయం ఉంది. అందుకనే ఆయన ఇప్పుడు కనిపించిన ప్రతి వారిని సలహాలు అడుగుతున్నట్లు భావించవలసి వస్తున్నది.

కరోనా కట్టడికి ఔషధం లేక పోవడంతో ఖంగారు పడుతున్న దేశాలకు మలేరియా బిళ్ళలు పంపుతూ ఉండడంతో బ్రెజిల్ ప్రధాని మోదీని హనుమంతుడితో పోల్చారు. స్పృహ కోల్పోయిన లక్ష్మణుడి కోసం ఔషధంగా మూలికలు తెమ్మని పంపితే, దాని పేరు మరచిపోయిన హనుమంతుడు మొత్తం సంజీవని పర్వతమునే తీసుకు రావడం చూసాము. ఇప్పుడు మోదీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.

ప్రస్తుత ఉపద్రవం నుండి బైట పడే మార్గం తోచక అందరిని సలహాలు అడుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు అందరం కలసి, ఒకబాటలో నడుద్దామని, మీరెప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను అంటూ ముఖ్యమంత్రులకు చెబుతున్నారు.

గతంలో ప్రధానిని కలవడం కోసం సంవత్సరంకు పైగా తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేచి ఉండడం గమనార్హం. చివరకు కేంద్ర మంత్రులకు సహితం ఆయనతో లోతైన చర్చలకు అవకాశం సాధారణంగా లభించదు.

అలర్ట్.. అలర్డ్.. రోడ్లపై ఉమ్మితే జైలుకే!


దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈనెల 14నాటికి లాక్డౌన్ పూర్తి కానుంది. శనివారం జరిగే ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ లాక్డౌన్ కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ పొడగించాయి. తెలంగాణలోనూ లాక్డౌన్ పొడగించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా తెలంగాణపై రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది.

ఈమేరకు తెలంగాణలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రతీఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇళ్లలో తయారుచేసిన క్లాత్ మాస్కులకు అనుమతినిచ్చింది. మాస్కులు ధరించకుండా వీధుల్లోకి వస్తే పోలీసులు జరిమానాలు విధించటంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రభుత్వం కోరుతుంది.

ఈమేరకు ఉమ్మి వేయటంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్త వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. అవసరమైతే వారిని అరెస్టు చేయనున్నారు. శనివారం వీధుల్లో ఉమ్మేసిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా లేకుండా జైలుకెళ్లడం ఖాయంగా కన్పిస్తుంది. జరభ్రదం.. సుమా! వీటన్నింటి బదులు ఇంట్లోనే ఉండటం బెటర్.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..


దేశంలో కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దిగబడులు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రానుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఆది, సోమ వారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మధ్య అరేబియా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ లోనని గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా రైతులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చేతికొచ్చిన పసుపు, మిర్చి, తదితర పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు దిగాలు చెందున్నారు.

అటకెక్కిన జగన్ వ్యవసాయ కమీషన్


ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ లక్ష్యాలతో ఒకొక్క పధకాన్ని ప్రారంభించడం, సంస్థను ఏర్పర్చడం, ఆ తర్వాత అంతటితో తన పనైపోయిన్నట్లు వాటి గురించి పట్టించుకొనక పోవడం చేస్తుంటారు. ఆ విధంగా గత 10 నెలల్లో ఆయన ప్రారంభించిన అనేక కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి.

అందుకు ప్రత్యక్ష నిదర్శనం రాష్ట్ర వ్యవసాయ కమీషన్. రైతులు నిరంతరం ఎదుర్కొనే సమస్యలపై చర్చించి ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో ఏర్పాటైన రాష్ట్ర వ్యవసాయ కమీషన్ భేటీ జనవరి 6 తర్వాత జరగనే లేదు. లాక్‌డౌన్‌ ప్రభావంతో రైతాంగం తీవ్ర నష్టాలపాలవుతున్న దృష్ట్యా వ్యవసాయ మిషన్‌ సమావేశమై తగిన నష్ట నివారణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందని ఆశించగా, సరిగ్గా ఇప్పుడే మిషన్‌ భేటీ సుదీర్ఘకాలం వాయిదా పడటంగ మనార్హం.

గత టిడిపి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందన్న వైసిపి, ఆ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకంటూ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ను అధికారమలోకి వచ్చిన రెండు నెలల్లోనే నెలకొల్పింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ మిషన్‌ ఏర్పాటు కావడం, దీనిలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు, రైతు, వ్యాపార ప్రతినిధులను సభ్యులుగా వేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

విధిగా నెలకోసారి సిఎం అధ్యక్షతన మిషన్‌ భేటీ ఉంటుందని ఉత్తర్వుల్లో సైతం పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి, వాటికి తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చూపించే వ్యూహాత్మక పత్రాలు రూపొందించడం మిషన్‌ ప్రధాన లక్ష్యం. దీనిలో మార్కెట్‌ సమస్య అత్యంత కీలకం.

లాక్‌డౌన్‌ ఇప్పుడప్పుడే ముగియదని తాజాగా వార్తలొస్తున్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు, పంటల కొనుగోళ్లు, రవాణాపై లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకున్నా, సమస్య తీవ్రంగానే ఉంది. రబీ పంటలు చేతికొచ్చే సమయంలో లాక్‌డౌన్‌ రావడంతో పంటల కొనుగోళ్లు నిలిచిపోయాయి. విజయనగరంలో సుమారు లక్ష టన్నుల ఖరీఫ్‌ వరి ధాన్యం రైతుల వద్దే ఉంది. నెల్లూరులో ఖరీఫ్‌ ధాన్యం 18 లక్షల టన్నుల వరకు రైతుల వద్ద పేరుకుపోయింది.

ఏప్రిల్‌ రెండో వారం నుంచి రబీ పంట కోతలకొస్తుంది. మొక్కజొన్న, జొన్న, పప్పుల వంటి ఆహార పంటలు, మిర్చి, పూలు, కూరగాయలు, మామిడి, అరటి, బత్తాయి వంటి ఉద్యానవన పంటల మార్కెట్‌ సైతం స్తంభించింది. ఆక్వా ఉత్పత్తులదీ అదే దారి. ఈ ఆందోళకర పరిస్థితుల్లోనన్నా రాష్ట్ర స్థాయి వ్యవసాయ మిషన్‌ భేటీ నిర్వహించి, ఆచరణాత్మక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ ఆలోచన చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు.

మిషన్‌ను నెలకొల్పిన తొలినాళ్లల్లో సిఎం అధ్యక్షతన ప్రతి నెలా సమావేశాలు జరిగాయి. ఆ భేటీలో ప్రకటించిన కొన్ని నిర్ణయాలు అమలు కాకపోతుండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఉదాహరణకు విపత్తుల వలన నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు రూ.2,000 కోట్లు తక్షణం చెల్లించాలని స్వయంగా ముఖ్యమంత్రి తొలి రెండు మూడు మిషన్‌ భేటీల్లో ఆదేశించినా అమలుకు నోచుకోలేదు.

రాజధానిలో సంపూర్ణ లాక్ డౌన్


గుంటూరు జిల్లాలో రోజూ కరోనా కొత్త కేసులు వస్తున్న వేళ, కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై గుంటూరులో రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుందని, ఒక్క షాపు కూడా తీసేది లేదని తెలిపారు. రెడ్ జోన్ల పరిధిలో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేందుకు అంగీకరించబోమని, ప్రస్తుతం అనుమతిస్తున్న ఉదయం 6 నుంచి 9 వరకూ నిత్యావసరాల కొనుగోలు, ఇకపై రోజు విడిచి రోజు మాత్రమే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. జిల్లాలో ఎప్పటి వరకూ 58 కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులున్న జిల్లాల వరుసలో రెండవ స్థానంలో నిలిచింది.

ప్రతి ఆదివారం లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతుందని, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు తమ అవసరాలకు తగినట్టుగా 15 రోజులకు సరిపడా, మందులు, చిన్నారులకు పాల డబ్బాలు, నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించిన కలెక్టర్, కూరగాయలు రోజు మార్చి రోజు ఉదయం పూట కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నదే తమ ఉద్దేశమని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఒకే కుటుంబంలో 23 మందికి సోకిన మహమ్మారి!

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి  పెరుగుతుంది. ఈ క్రమంలో బీహార్ లో మొత్తం 63 కేసులు నమోదు కాగా అందులో 23మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే..పాట్నా నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 23 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారించబడింది. గత నెలలో ఒమన్ నుండి తిరిగి వచ్చిన ఒక మహిళ ఈ ఘటనకు కారణం. మార్చి 16 న, సివాన్ జిల్లాలోని బంజార్ గ్రామానికి తిరిగి వచ్చిన ఒక మహిళ ఏప్రిల్ 4 న కరోనా లక్షణాలు భయపడ్డాయి. దీంతో ఆమెకు పరిక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అని తేలింది. అంతకంటే ముందు, ఆమె సివాన్ జిల్లాలోని బంధువుల ఇళ్లను సందర్శించింది.

కరోనా తన సొంత గ్రామమైన బంజార్ నుండి 22 మంది బంధువులు మరియు మరో ఇద్దరికి వ్యాపించిందని కనుగొనబడింది.

ఇదిలా ఉంటే.. ఒక్క శివన్ జిల్లాలోనే 31 మందికి కరోనా నిర్ధారించింది. 23 మందిలో నలుగురు కోలుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, మరో 2 వారాల పాటు ఒంటరిగా ఉండాలని వారికి సూచించారు. దీనిని అనుసరించి సివాన్ జిల్లా సరిహద్దులను అధికారులు మూసివేశారు.

ఒక మతంపై వివక్ష తగదు..!

ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మార్చి, 13, 14 15 తేదీలలో జరిగిన తబ్లిగి జమాత్‌ ప్రార్థనలు భారత్‌ లో కరోనా వ్యాప్తి ఉధృతికి కారణమై వేలాది మంది వైరస్‌ బారిన పడేలా చేశాయి. మర్కజ్‌ మసీదులో ఈ ప్రార్థనలు జరగ్గా.. వేలమంది ముస్లింలు మనదేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈనేపథ్యంలో ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ (డీఎంసీ) రాష్ట్ర ఆరోగ్యకు శాఖకు ఓ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ రోజూవారీ హెల్త్‌ బులెటిన్‌లో ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’ అని ప్రత్యేకంగా పేర్కొంటూ కేసుల వివరాలు ఇవ్వకూడదని విన్నవించింది. ఈమేరకు డీఎంసీ చైర్మన్‌ జఫారుల్‌ ఇస్లాం ఖాన్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి శుక్రవారం లేఖ రాశారు. వైరస్‌ సోకినవారి వివరాలు ఇస్తున్న క్రమంలో తబ్లిగి జమాత్‌ లేదా మర్కజ్‌ నుంచి వచ్చినవారు ఇంతమంది.. అంటూ ప్రత్యేకంగా చూపెట్టడం ఒక మతాన్ని తక్కువ చేసినట్టేనని అన్నారు.

ఉద్యేశపూర్వకంగా, దురాలోచనతోనే ఇలాంటి వర్గీకరణ వార్తలతో మా మతంపై పలు మీడియా సంస్థలు, హిందుత్వ శక్తులు ద్వేషం పెంచుతున్నాయి. వాటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. ముస్లిం వ్యక్తులను సోషల్‌ బాయ్‌ కాట్‌ చేస్తున్నారు. మొన్న ఈశాన్య ఢిల్లీలో ఓ యువకుడిని కొట్టి చంపారు. ఇప్పటికైనా నిజాముద్దీన్‌ మర్కజ్‌ పేరును వార్తలు, బులెటిన్లలో పేర్కొనవద్దు’ అని ఇస్లాం ఖాన్‌ ఢిల్లీ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక వర్గం, మతం ఆధారంగా కరోనా కేసులు వివరాలు ప్రకటించొద్దని చెప్పింది. వైరస్‌కు గురికావడమనేది ఎవరి తప్పిదం కాదని, బాధితుల వివరాలు వార్తల్లో ప్రచురించొద్దని కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది’అని ఆయన తెలిపారు.

Mannara Chopra Latest Photos

కరోనా పోరాటంలో ముందు వరసలో ఈటెల, కనిపించని కేటీఆర్

TRS


టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉంటూ, ఆయనతో కలసి పనిచేస్తున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు కరొనపై పోరాటంలో సహితం ముందుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.

సంక్షోభ సమయంలోనే నాయకత్వ లక్షణాలు వెల్లడి అవుతాయి అన్నట్లు అప్పటి వరకు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా అంతా తానే అయి నడిపిస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు జనంలో ఎక్కడ కనిపించడం లేదు.

నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన రాజేంద్ర కేసీఆర్ మంత్రివర్గంలో తొలి ఐదేళ్లు ఆర్ధిక మంత్రిగా సమర్ధవంతంగా పనిచేశారు. అదే సమయంలో నీటిపారుదల మంత్రిగా అంతే సమర్థతతో పనిచేసిన కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావు, రాజేందర్ తొలినుండి సన్నిహితులు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు రాష్ట్ర పాలనా బాధ్యతలు అప్పచెప్పడం కోసం రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు సమర్థులుగా పేరొందిన హరీష్ రావు, రాజేందర్ లకు మంత్రి పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచారు.

కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వక పోయినా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చి, తెర వెనుక నుండి మొత్తం ప్రభుత్వాన్ని నడిపించే సౌలభ్యం కల్పించారు. అయితే నరేంద్ర మోదీ అద్భుతమైన ఆధిక్యతతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల కలలు చెదిరిపోయాయి.

మరోవంక కేటీఆర్ సామర్ధ్యం పట్ల పార్టీ వర్గాలలోని పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి. దానితో విధి లేక కేటీఆర్ తో పాటు వీరిద్దరిని కూడా తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతగా ప్రాధాన్యత లేదని భావించే ఆరోగ్య శాఖను రాజేందర్ కు అప్పచెప్పారు.

అయితే కరోనా సంక్షోభంలో ఇదే కీలకమైన మంత్రిత్వ శాఖ కావడం, సహజంగానే అందరిని కలుపుకుపోగల సామర్ధ్యం ఉండడం, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు పరిమితమై ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి రాజేందర్ నడిపిస్తున్నారు.

పొరుగున ఉన్న ఏపీలో ఆరోగ్య మంత్రి పేరు కూడా అక్కడి ప్రజలకు తెలియదు. కానీ ఇక్కడ రాజేందర్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపలేని విధంగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

కేటీఆర్ తన ఉనికి చాటుకోవడం కోసం ట్విట్టర్ సందేశాలను, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాలను కేసీఆర్ బదులు స్వీకరించడం వంటి పనులకు పరిమి తమవుతున్నారు. కేటీఆర్ ఎన్నడూ క్షేత్రస్థాయిలో పనిచేసినవారు కాకపోవడం, పైగా ఆయన వ్యవహరించే తీరు కొంచెం ఆధిపత్య ధోరణిలో ఉంటూ ఉండడంతో ఉన్నతాధికారులు, మంత్రులు సహితం అసంతృప్తితో ఉంటారు.

ఏపీ గవర్నర్ పై బిజెపి వర్గాల్లో నిరాశ!


ఒడిశాలో మూడు సార్లు బిజెపి ఎమ్యెల్యేగా, ఒక సారి మంత్రిగా కూడా పనిచేసిన తమ పార్టీకి చెందిన సీనియర్ నేత విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా వస్తున్నారంటే సహజంగానే స్థానిక బీజేపీ నేతలు సంబరపడ్డారు.

అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాష్ట్రలో ఇక్కడ జగన్ తో, తెలంగాణలో కేసీఆర్ లకు అనుకూలంగా వ్యవహరించేవారు. బిజెపి వారిని లెక్కచేసే వారు కాదు.

ఇప్పుడు హరిచందన్ సహితం జగన్ చెప్పిన్నట్లు చేస్తుండడం, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి గౌరవాన్ని కాపాడటం పట్ల ఆసక్తి ప్రదర్శించక పోవడంతో బిజెపి నేతలు ఖంగు తింటున్నారు.

ముఖ్యంగా పంచాయత్ ఎన్నికల పక్రియ మధ్యలో జగన్ కక్షపూరితంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ పదవీకాలాన్ని ఆర్డినెన్సు ద్వారా కుదించి, తొలగించి, ఆ ఆస్థానంలో మరొకరిని నియమించడం అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది.

ఈ సందర్భంగా ఆన్ లైన్ లో మంత్రుల ఆమోదంతో ఆర్డినెన్సు కు ప్రతిపాదన రాగానే దానిని న్యాయబద్ధత వంటి అంశాలను పరిశీలించకుండానే, తక్షణం సంతకం చేసి గవర్నర్ పంపడం బిజెపి నేతలకు విస్మయం కలిగిస్తున్నది.

దేశం మొత్తం కరోనా వైరస్ కట్టడికోసం పోరాటం చేస్తున్న తరుణంలో అంత ఆఘమేఘాలపై ఆర్డినెన్సు తీసుకు రావలసిన అవసరం గిరినుంచి కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం న్యాయసంబంధ అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు.

ఆర్డినెన్సు జారీ అయిన కొద్దీ గంటలకే ఆ స్థానంలో మరొకరిని నియమించడం చూస్తుంటే ఏమాత్రం పారదర్శకత లేకుండా ఈ పక్రియ జరిగిన్నట్లు వెల్లడి అవుతుంది. అందుకు గవర్నర్ ప్రధాన సూత్రధారి కావడం అనేకమందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది.

ఇప్పటికే రమేష్ కుమార్ పట్ల జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురవుతున్నది. కులం పేరుతో నిందించి, ముఖ్యమంత్రి హోదాను కించపరిచే విధంగా వ్యవహరించారు. అటువంటి సమయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రిని మందలించే ప్రయత్నం చేయలేదు.

మరోవంక, కరోనా కట్టడికోసం పనిచేస్తున్న వైద్యులు, అధికారులకు కనీసం మాస్క్ లను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఒక ప్రభుత్వ డాక్టర్, మరో మునిసిపల్ కమీషనర్ లను ప్రభుత్వం అర్ధాంతరంగా సస్పెండ్ చేసిన గవర్నర్ పట్టించుకోలేదు. ఇటివంటి కీలక సమయంలో గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తూ అధికార పార్టీ కుయుక్తులలో పాత్రధారి కావడం చాలామందికి విచారం కలిగిస్తున్నది.

లాక్ డౌన్ రూల్స్ భారతీయులకు, బీజేపీ ఎమ్మెల్యేలకు కాదు?

“నీతులు ఎదుటివారికే ఆచరించడానికి కాదు” అనేది తెలుగులో ఒక నానుడి. ప్రస్తుతం బీజేపీ నేతల పరిస్థితి అలానే ఉంది.”యావత్ భారతావనికి చెబుతున్నా.. మీ ఇంటి చుట్టూ లక్ష్మణ్ రేఖ గీసుకోండి, ఇంటిలో నుండి బయటకు రావొద్దు, సామాజిక దూరమే శ్రీరామరక్ష..! కోవిడ్ నుంచి బయటపడాలంటే లాక్‌ డౌన్ ఒక్కటే మనముందున్నమార్గం..!” భారత్ ప్రధాని గట్టిగా చెప్పిన మాటలు ఇవి. కొందరు మాత్రం ఇప్పటికీ లైట్‌ గా తీసుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు పలువురు రాజకీయ నేతలు సైతం లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘిస్తున్నారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి హడావిడి చేస్తున్నారు.తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించారు. గుంపులుగా ఉండకూడదని చెబుతున్నా.. వందల మంది సమక్షంలో ఆయన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. సామాజిక దూరం పాటించకుండానే స్థానికులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివరాల్లోకి వెళ్తే… కర్ణాటక లోని తమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. జయరామ్ శుక్రవారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. గుబ్బి తాలుకాలోని స్వగ్రామంలో ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యే బర్త్ డే సంబరాలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అక్కడ చాలా మంది కనీసం మాస్క్ ధరించలేదు. సామాజిక దూరం అస్సలు పాటించలేదు. ఆ జనం మధ్యే ఎమ్మెల్యే బర్త్ డే కేక్ కట్ చేశారు. అనంతరం వారందరికీ విందు ఏర్పాటు చేశారు. వందలాది మంది గ్రామస్తులు విందు కార్యక్రమానికి హాజరయ్యారు. జనం గుంపులు గుంపులుగా కనిపించడంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకొని.. సామాజిక దూరం పాటిస్తూ.. పేదలకు అన్నదానం, నిత్యావసర సరుకులు పంచితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలా గుంపుల మధ్య కేక్ కట్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని విమర్శిస్తున్నారు.

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు పని చేసిన అనుభవం ఉంది. స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016లో నియమితులైన రమేష్ కుమార్ పదవి కాలం ఐదేళ్లు ఉండగా ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఆర్డినెన్స్ ద్వారా మూడేళ్ళ కాలానికి తగ్గించింది. ఇప్పటిదాకా రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు అప్పగిస్తున్న ఆ పదవిలో.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను నియమించేలా మరో మార్పు తీసుకొచ్చింది.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులతో కేబినెట్‌ సమావేశం నిర్వహించిన ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమోదం పొందింది. ఆ వెంటనే దీనిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. గవర్నర్‌ కూడా దీనిని ఆమోదించారు. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆమోద ముద్ర పడగానే.. చకచకా మూడు జీవోలు వెలువడ్డాయి. పంచాయతీరాజ్‌ శాఖ, న్యాయశాఖల్లో గ్రామీణ ఎన్నికలకు సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్డినెన్స్‌ను అమలులోకి తెస్తూ ఒక జీవో జారీ చేశారు. ఆ తర్వాత… ఆర్డినెన్స్‌కు అనుగుణంగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జీవో నెంబరు 617 జారీ చేయడం జరిగింది.

మానవత్వం చూపించిన పశుపతి


కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి చాలా మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించడం జరిగింది. అక్షయ్ కుమార్ వంటి హీరో అయితే ఏకంగా పాతిక కోట్లు విరాళం ప్రధానికి అందించి
తన లోని దేశభక్తిని , సేవాగుణాన్ని గొప్పగా చాటుకున్నాడు ఆ సంఘటన బాలీవుడ్ లోఎందరికో ఆదర్శమయ్యింది. ఆ క్రమంలో కొందరు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం.. ఇంకొందరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేస్తున్నారు.

అలాంటి తరుణంలో ప్రముఖ నటుడు సోనూసూద్ హెల్త్ వర్కర్స్ కోసం ఓ మంచి పనిచేసి నేను సినిమాల్లో మాత్రమే విలన్ ని , రియల్ లైఫ్ లో హీరో ని అని నిరూపించుకున్నాడు. అంతే కాదు నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు ఇలా అందరిచేత శభాష్ సోనూసూద్ అనిపించు కొన్నాడు . ఇంతకీ సోనూసూద్ ఏం చేసాడో తెలుసా ? కరోనాపై పోరాడుతున్న హెల్త్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా ముంబైలోని జుహు ప్రాంతంలో ఏకంగా ఓ హోటల్ ని ఓపెన్ చేసేసాడు. ఇందులో విశేషం ఏమిటంటే హెల్త్ వర్కర్స్ వచ్చి ఉచితంగా భోజనాలు చేసి వెళ్లొచ్చు.. ఒక్క పైసా కూడా బిల్ కట్టక్కర్లేదు సోనూసూద్ చేసిన ఈ మంచి పనికి మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపిస్తోంది .

రోజు రోజుకి అమీబా లా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, హెల్త్ వర్కర్స్ నిరంతరాయంగా పనిచేస్తున్న తీరు చూసి తాను కూడా ఏదో ఒక మంచి పనిచేయాలని భావించిన సోనూసూద్ ఇలా ఉచిత హోటల్ ప్రారంభించి సేవ చేస్తున్నాడట ….

ఏ.ఆర్ రెహమాన్ కి గుస్సా ఆగాయా…. !


దక్షిణాది సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహమాన్ శైలి విభిన్నం ,విఖ్యాతం. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ సృష్టించిన మేధావి.భారతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాలకు కూడా తన స్వరాల్ని అందించిన ఘనాపాటి .అలాంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమే తన ప్రపంచంగా ఉంటారు. వేరే విషయాల్లో జోక్యం తక్కువ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందర్భానుసారం మేటర్ పోస్ట్ చేస్తుంటారు. తన పనేదో తనది అన్నట్లుండే రెహమాన్ కి సడన్ గా కోపమొచ్చింది.

సాధారణంగా ఏ.ఆర్ రెహమాన్ కి తాను స్వరపరిచిన పాటలను రీమేక్స్ చేయడమంటే మా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తాజాగా తన పాటను ఓ మ్యూజిక్ కంపెనీ రీమిక్స్ చేయడంతో రెహమాన్ కోపం ఆకాశాన్ని తాకింది. ఇంతకీ అసలీ విషయం ఏమిటంటే గతంలో అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ కలిసి నటించిన ` ఢిల్లీ 6 ‘ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడం జరిగింది ..కాగా ఆ సినిమాలో “మసక్కలి మసక్కలి ” పాట సెన్సేషన్ అయ్యింది. కాగా ఇప్పుడు ఆ పాటని `మసక్కలి 2.0 ‘ అనే పేరుతో రీమిక్స్ చేశారట… దాంతో చిర్రెత్తుకొచ్చిన రెహమాన్ ‘‘మసక్కలి పాట కొందరి కష్టం, క్రియేటివిటీ వల్ల పుట్టింది. దాన్ని ఇలా ఖూనీ చేస్తారా?’’ అంటూ ఒరిజినల్ పాటని , రీమిక్స్ సాంగ్ ని కలిపి పోస్ట్ చేశారు. దాంతో ఏ ఆర్ రెహమాన్కు మ్యూజిక్ లవర్స్, నెటిజన్స్ , సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి భారీ మద్దతు వస్తోంది.

మొత్తానికి విరాళం ఇచ్చారు


కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ పరిస్థితులు దేశం లోని అన్ని ఆర్ధిక రంగాలను ఒక కుదుపు కుదిపేసింది. మనీ ట్రాన్సాక్షన్ లేకపోవడం తో దేశమంతా అల్లకల్లోలం అయ్యింది. దినసరి వేతనాలపై బతికే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. అలాంటి సమయంలో పనిలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభం అయ్యింది సీసీసీకి ఇప్పటికే చిరంజీవి ,నాగార్జున,వెంకటేష్ ,బాలకృష్ణ , ఎన్ టి ఆర్ ,ప్రభాస్ , మహేష్ బాబు ,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్, శర్వానంద్ , నాని, రవి తేజ వంటి స్టార్స్ కోటితో మొదలుకొని ,50 లక్షలు ,25 లక్షలు అలా తమకు తోచిన రీతిలో విరాళాలు ఇచ్చారు. వీరిలోతక్కువ మొత్తం అంటే 10 లక్షలు ఇచ్చిన నటుడు సాయి ధరమ్ తేజ్ కావడం విశేషం ఇక వీరేగాక త్రివిక్రమ్ శ్రీనివాస్ , వి. వి. వినాయక్ ,కొరటాల శివ , సంపత్ నంది ,సుకుమార్ వంటి దర్శకులు దిల్ రాజు , యు వి క్రెయేషన్స్ వంటి నిర్మాతలు కూడా లక్షల్లో విరాళం ఇచ్చారు.

ఇంతమంది సి సి సి కి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గరనుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అలాంటి టైములో తాజాగా ఎస్ఎస్ రాజమౌళి మరియు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ` కరోనా క్రైసిస్ చారిటీ ‘(సీసీసీ) కి 10 లక్షల రూపాయిలు విరాళంగా ఇచ్చారు.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల్లోని నిరు పేదలకు ` సి సి సి` వారు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఉన్న ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం-పప్పు ఉప్పు వంటి నిత్యావసరాలు అందిస్తున్నారు. దర్శక , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ , దర్శక సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్ బృందం కార్మికులకు నిత్యావసరాల పంపిణీ వ్యవహారం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఏమైనా కష్ట సమయంలో ఇలా తెలుగు చిత్ర సీమకు కార్మికులను ఆదుకుంటున్నందుకు మన సినీ పెద్దలను అభినందించాలి.

శాండల్ వుడ్ లో అడుగు పెడ్తున్న తెలుగు చిత్రం


2019 లోచిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం `ఎవరు`. అడివి శేష్ , రెజీనా ప్రధాన పాత్రలను పోషించిన ‘ఎవరు’ చిత్రం తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సస్పెన్సు తో పాటు ఆసక్తికరంగా సాగే కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దర్శకుడు వెంకట్ రాంజీ విభిన్నమైన కోణాల్లో కథను ఆవిష్కరించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు లభించాయి.ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. కేవలం ఏడుకోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం 35 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. అలాంటి సంచలన సినిమా ఇప్పుడు కన్నడలో రీమేక్ కాబోతుంది .

తెలుగులో అడివి శేష్ పోషించిన హీరో పాత్రను కన్నడలో ‘దిగంత్’ పోషించనున్నాడు. ఇక కీలక మైన రెజీనా పాత్రకి ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఇంకా తెలీలేదు. ఇంకో విశేషం ఏమిటంటే తెలుగు సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే కన్నడ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జెనరల్ గా కన్నడ ప్రేక్షకులు సస్పెన్సు సినిమాలను విపరీతంగా లైక్ చేస్తారు . తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం కన్నడలో కూడా తప్పక విజయం సాదిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు . ఇక అడివి శేష్ విషయానికొస్తే, మహేశ్ బాబు నిర్మాణంలో ‘మేజర్’ అనే బయోపిక్ సినిమాలో నటిస్తున్నాడు ఇంకో విశేషం ఏమిటంటే ఆ చిత్రం తరవాత అడవి శేష్ ఎవరు సీక్వెల్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది .