
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ మాత్రమే మార్గం అంటూ దాదాపు ఎవ్వరిని సంప్రదించకుండా ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు దాని మూడు వారాల గడువు పూర్తవుతూ ఉండడంతో కొంచెం అయోమయానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. దానిని పొడిగించాలా, సడలించాలా లేదా తొలగించాలా; ఏమి చేసినా ఆ తర్వాత ఏమి చేయాలో సలహాలు చెప్పండి అంటూ గత వారం రోజులుగా అందరిని కోరుతున్నారు.
గతంలో ఎప్పుడు ఏ విషయమైన కూడా ఎవ్వరిని ప్రధాని మోదీ సంప్రదించిన దాఖలాలే లేవు. ప్రతిపక్షాలను మాత్రమే కాదు సొంత పార్టీ వారిని, చివరికి మంత్రివర్గ సహచరులను సహితం విశ్వాసంలోకి తీసుకున్న దుష్ట్రాంతరాలు లేనే లేవు.
ఆయన మంత్రివర్గంలో ఎంతో బలవంతుడుగా భావించే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సంప్రదించకుండానే నోట్ల రద్దు తీసుకొచ్చారు. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ప్రమేయం లేకుండానే ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపారు.
చివరకు సైద్ధాంతికంగా బిజేపికి ఎంతో ముఖ్యమైన ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి విషయాలలో సహితం సొంత మంత్రులతో కూడా తగు రీతిలో సంప్రదింపులు జరపలేదు.
ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించే విషయమే రెండు సార్లు ముఖ్యమంత్రులతో, ఒక సారి ప్రతిపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, వివిధ పార్టీల అధ్యక్షులతో స్వయంగా టెలిఫోన్ చేసి మాట్లాడారు.
ఇదంతా ఆయనెందుకు చేస్తున్నారు? ఇక్కడి నుండి ముందుకు వెళ్లడం అర్ధం కావడం లేదా? ఒక వంక తబ్లిగ్ జమాత్ సదస్సు ఉనికిని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కనిపెట్టలేక పోవడంతో భారీ మూల్యం చెల్లింపవలసి వచ్చింది. ఆరేళ్ళ పాలనలో కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు చతికలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రధాని ఉపదేశాలు తప్ప నిధులు రాల్చడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వాలలో వెల్లడి అవుతున్నది. లాక్ డౌన్ కొనసాగితే ఆర్ధిక కార్యక్రమాలు స్తంభించిపోయి రోజువారీ ఖర్చులకు సహితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
లాక్ డౌన్ లోనే పలు రేట్లు పెరిగిన కరోనా వైరస్ సడలిస్తే ఏమౌవుతుందనే భయం ఉంది. అందుకనే ఆయన ఇప్పుడు కనిపించిన ప్రతి వారిని సలహాలు అడుగుతున్నట్లు భావించవలసి వస్తున్నది.
కరోనా కట్టడికి ఔషధం లేక పోవడంతో ఖంగారు పడుతున్న దేశాలకు మలేరియా బిళ్ళలు పంపుతూ ఉండడంతో బ్రెజిల్ ప్రధాని మోదీని హనుమంతుడితో పోల్చారు. స్పృహ కోల్పోయిన లక్ష్మణుడి కోసం ఔషధంగా మూలికలు తెమ్మని పంపితే, దాని పేరు మరచిపోయిన హనుమంతుడు మొత్తం సంజీవని పర్వతమునే తీసుకు రావడం చూసాము. ఇప్పుడు మోదీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
ప్రస్తుత ఉపద్రవం నుండి బైట పడే మార్గం తోచక అందరిని సలహాలు అడుగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు అందరం కలసి, ఒకబాటలో నడుద్దామని, మీరెప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను అంటూ ముఖ్యమంత్రులకు చెబుతున్నారు.
గతంలో ప్రధానిని కలవడం కోసం సంవత్సరంకు పైగా తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేచి ఉండడం గమనార్హం. చివరకు కేంద్ర మంత్రులకు సహితం ఆయనతో లోతైన చర్చలకు అవకాశం సాధారణంగా లభించదు.