
ఒడిశాలో మూడు సార్లు బిజెపి ఎమ్యెల్యేగా, ఒక సారి మంత్రిగా కూడా పనిచేసిన తమ పార్టీకి చెందిన సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా వస్తున్నారంటే సహజంగానే స్థానిక బీజేపీ నేతలు సంబరపడ్డారు.
అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ రాష్ట్రలో ఇక్కడ జగన్ తో, తెలంగాణలో కేసీఆర్ లకు అనుకూలంగా వ్యవహరించేవారు. బిజెపి వారిని లెక్కచేసే వారు కాదు.
ఇప్పుడు హరిచందన్ సహితం జగన్ చెప్పిన్నట్లు చేస్తుండడం, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నప్పుడు ఆ పదవి గౌరవాన్ని కాపాడటం పట్ల ఆసక్తి ప్రదర్శించక పోవడంతో బిజెపి నేతలు ఖంగు తింటున్నారు.
ముఖ్యంగా పంచాయత్ ఎన్నికల పక్రియ మధ్యలో జగన్ కక్షపూరితంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ పదవీకాలాన్ని ఆర్డినెన్సు ద్వారా కుదించి, తొలగించి, ఆ ఆస్థానంలో మరొకరిని నియమించడం అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది.
ఈ సందర్భంగా ఆన్ లైన్ లో మంత్రుల ఆమోదంతో ఆర్డినెన్సు కు ప్రతిపాదన రాగానే దానిని న్యాయబద్ధత వంటి అంశాలను పరిశీలించకుండానే, తక్షణం సంతకం చేసి గవర్నర్ పంపడం బిజెపి నేతలకు విస్మయం కలిగిస్తున్నది.
దేశం మొత్తం కరోనా వైరస్ కట్టడికోసం పోరాటం చేస్తున్న తరుణంలో అంత ఆఘమేఘాలపై ఆర్డినెన్సు తీసుకు రావలసిన అవసరం గిరినుంచి కనీసం ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం న్యాయసంబంధ అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు.
ఆర్డినెన్సు జారీ అయిన కొద్దీ గంటలకే ఆ స్థానంలో మరొకరిని నియమించడం చూస్తుంటే ఏమాత్రం పారదర్శకత లేకుండా ఈ పక్రియ జరిగిన్నట్లు వెల్లడి అవుతుంది. అందుకు గవర్నర్ ప్రధాన సూత్రధారి కావడం అనేకమందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఇప్పటికే రమేష్ కుమార్ పట్ల జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురవుతున్నది. కులం పేరుతో నిందించి, ముఖ్యమంత్రి హోదాను కించపరిచే విధంగా వ్యవహరించారు. అటువంటి సమయంలో కూడా గవర్నర్ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రిని మందలించే ప్రయత్నం చేయలేదు.
మరోవంక, కరోనా కట్టడికోసం పనిచేస్తున్న వైద్యులు, అధికారులకు కనీసం మాస్క్ లను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఒక ప్రభుత్వ డాక్టర్, మరో మునిసిపల్ కమీషనర్ లను ప్రభుత్వం అర్ధాంతరంగా సస్పెండ్ చేసిన గవర్నర్ పట్టించుకోలేదు. ఇటివంటి కీలక సమయంలో గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తూ అధికార పార్టీ కుయుక్తులలో పాత్రధారి కావడం చాలామందికి విచారం కలిగిస్తున్నది.