Home Blog Page 8536

తెలుగు రాష్ట్రాల్లో భగభగలు!


నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని, వచ్చే మూడు, నాలుగు రోజులు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నమోదు కావచ్చని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే, 2 నుంచి 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ఎండ వేడిమి బారిన పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎండ తీవ్రత వల్ల ఇళ్లలో ఉక్కబోతతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.

ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురవవచ్చని హెచ్చరించారు. వారాంతం వచ్చే సరికి వాతావరణం సాధారణ స్థాయికి చేరుతుందని అంచనా వేశారు.

ఇప్పటికే అకాల వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నెల 9వ తేదీన కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లాలో వేటకు వెళ్లిన మత్యకారులు ఇద్దరు మృతి చెందగా, నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

అక్కడ డ్యూయెట్ సాంగ్ ఇక్కడ స్పెషల్ సాంగ్


చిత్రసీమలో విచిత్రాలకు కొదవుండదు. కొందరికి స్టార్ డం వచ్చాక కూడా ప్రత్యేక పాత్రల్లో అతిధిగా నటించాల్సి రావచ్చు. అలాంటి సందర్భం ఈ మధ్య ఇద్దరి హీరోయిన్ లకు వచ్చింది. కాగా వాళ్లిద్దరూ స్టార్ హీరోయిన్ లు కావడం విశేషం. ఇక్కడున్నఇంకో ట్విస్ట్ ఏమిటంటే వాళ్లిద్దరూ మెగా హీరోల చిత్రాల్లో అలా నటించారు. ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ మరో చిత్రం లో స్పెషల్ సాంగ్ లో నటించింది .

2017 జూన్ 23 వ తారీఖున విడుదలైన ” డీజే ” (దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో బన్నీ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తరవాత మార్చ్ 30 , 2018 లో విడుదలైన “రంగస్థలం” చిత్రం లో రామ్ చరణ్ పక్కన ` జిగేల్ రాణి ` అనే ప్రత్యేక గీతంలో నర్తించింది. అలా పూజా హెగ్డే అల్లు అర్జున్ సరసన `డీజే `చిత్రం లో హీరోయిన్ గా నటించి చెర్రీ సరసన `రంగస్థలం` చిత్రం లో ప్రత్యేక గీతం లో ఆడి పాడింది
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. త్వరలో సెట్స్ మీదకి వెళ్లే బన్నీ , సుకుమార్ కాంబో సినిమా” పుష్ప” లో ఓ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ హీరోయిన్ , ముంబై బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలి అనుకొంటున్నారు. కియారా అద్వానీ అంతకు ముందు 2019 లో రామ్ చరణ్ సరసన ” వినయ విధేయ రామ ” చిత్రం లో హీరోయిన్ గా నటించింది. “పుష్ప” పాన్ ఇండియా చిత్రం కాబట్టి కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

ఆ లెక్కన ” రంగస్థలం ” చిత్రం లో బన్నీ హీరోయిన్ పూజాహెగ్డే డాన్స్ చేస్తే , ఇపుడు ” పుష్ప ” చిత్రం లో రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయబోతోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ రకమైన ప్రయోగాలు రెండూ సుకుమార్ దర్శకత్వంలోనే సంభవించాయి .

ఆర్య సిరీస్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మూడోచిత్రం గా వస్తున్న ” పుష్ప” మూవీ శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.

ఐశ్వర్య పాటకు జాన్వీ డాన్స్.. వైరల్


కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో సినీ సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. రకరకాలుగా సెలబ్రెటీలు కాలక్షేపం చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమాలకు దూరమైన ప్రేక్షకులు సోషల్ మీడియాలో సెలబ్రెటీలను ఫాలోవుతూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. పలువురు హీరోయిన్లు తమలోని కొత్త కళను బయటికి తెస్తున్నారు. మరికొందరేమో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ వేసవి మరింత హీటెక్కించే పనిలో పడ్డాయి. తాజాగా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసిన డాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు సినిమా విషయాల్లో కంటే ఎక్కువగా జిమ్ కు సంబంధించిన పిక్స్, వీడియోలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అడపదడగా డాన్స్ ఫార్మమెన్స్ చేస్తున్న వీడియోలతో అలరించేది. తాజాగా కరోనా ఎఫెక్ట్ తో బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇంట్లోనే తన ట్రైనర్ తో కలిసి చేసిన డాన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

https://www.instagram.com/p/B-4oZX4AWgE/

ఐశ్వ‌ర్య రాయ్ న‌టించిన ‘ఉమ్ర‌వ్ జాన్’ చిత్రంలోని ‘స‌లామ్’ ట్రాక్ కు జాన్వీ క‌పూర్ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అంద‌రి చూపులు త‌న‌వైపు తిప్పుకునేలా ఆమె ఫార్మమెన్స్ ఉండటం విశేషం. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కరోనాతో బయటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఇంట్లోనే డాన్స్ శిక్షణ తీసుకుంటుంద. ప్రస్తుతం జాన్వీకపూర్ ‘కార్గిల్‌ గాళ్‌’, ‘రూహ్ అఫ్జా’, ‘తక్త్‌’ సినిమాల్లో నటిస్తూ బీజీగా మారింది.

ఈ సంక్రాంతికి ‘మెగా’ పండుగ..


మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అంతేకాకుండా చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరు ఈ సినిమాలో గురు శిష్యులుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో దేశంలో కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

ఈ మూవీ టైటిల్ ‘ఆచార్య’గా చిరంజీవి అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ‘ఆచార్య’ సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. కరోనా తగ్గిన అనంతరం శరవేగంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. అలాగే 2021జనవరి 8న సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో ఈ చిత్రం అనుకున్న టైంకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మెగాస్టార్ ఈ డేట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కరోనా అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైన నెలరోజుల తర్వాతే షూటింగ్లో పాల్గొనున్నాడు. ఈమేరకు నెలరోజులపాటు రాంచరణ్ కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలరోజుల సమయాన్ని రాంచరణ్ ‘ఆచార్య’ కోసం కేటాయించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగో అనుకున్న సమయానికి వచ్చే అవకాశం లేనందున ఆ తేదికి ‘ఆచార్య’ తీసుకొచ్చేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగే ఈ సంక్రాంతికి ‘మెగా’ పండుగ రావడం ఖాయంగా కన్పిస్తుంది.

జాతీయ రహదారులపై లారీల ట్రాఫిక్ జామ్?

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం పుట్టిస్తున్న కారణంగా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్ ‌లు చేసుకోవటానికి ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మెరుగుపడి పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి.

పాస్‌ ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్ ‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్ ‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు.

ప్రస్తుతం అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి ల‌భించింది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. అయితే ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.

రాజధాని రైతులకు నోటీసులు


అమరావతిని రాజధాని కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం కరోనా దెబ్బతో తెరమరుగు అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలోను సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమం కొనసాగిన అనంతరం రైతులు, ఆ ప్రాంత వాసులు ఇళ్ల నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో వీరిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి లాక్ డౌన్ అమలులో ఉన్నా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు ఈ నోటీసులు పోలీసులు రైతులకు తెలిపారు.

ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు యూనియన్ బ్యాంక్ సమీపంలో ఎవరి ఇళ్లలో వారు అమరావతి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, ఇతరులను కలవడం జరిగిందని నోటీసులో తెలిపారు. జిల్లాలో సెక్షన్ 144 సి‌ఆర్‌పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం అంటూ మహిళా రైతులకు, రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కారణాల మూలంగా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాలడుతుందని రైతులు ఆరోపించారు.

పుకార్లను నమ్మొద్దు అంటున్న యంగ్ హీరోలు


మెగా మేనల్లడు సాయి (ధరమ్)తేజ్ `ప్రతిరోజూ పండగే ` వంటి సూపర్ హిట్ సినిమా చేసాక తన తదుపరి సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్న ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. గత నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపు కొంది ..కాగా ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి షెడ్యూల్ వేశారు ..కాగా లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడం లేదనీ, పరిస్థితులు చక్కబడిన తరువాత షూటింగు తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు అంటున్నారు. ఇక తమ సినిమా గురించి అనవసరమైన పుకార్లు వస్తున్నాయని , తమ సినిమాకి సంబంధించిన అసలు విషయాలను తామే అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు .

అదలా ఉంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్, తాను నటించిన కొత్త చిత్రం ‘రెడ్’ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల కాబోతుందని వచ్చిన వార్తని ఖండించారు .తన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనని , అభిమానులు కోరుకున్నట్టే థియేటర్ లో మాత్రమే విడుదల చేస్తామని అభిమానులకు భరోసా ఇచ్చాడు ఇంకా వారికి “.రామ్ పోతినేని ఎలాంటి డైలమాలో లేడు. తన అభిమానులతో కలిసి బిగ్ స్క్రీన్ పై ‘రెడ్’ చిత్రం చూసేందుకు రామ్ కూడా ఎదురు చూస్తున్నాడు” అని ట్విట్టర్ ఖాతాలో బదులిచ్చాడు .

ఏప్రిల్‌ 15 నుంచి మూడు జోన్లు?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది.నమోదైన కేసుల ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. రెడ్ జోన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ఆరెంజ్, గ్రీన్ జోనుల్లో పారదర్శిక లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్‌ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్‌-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

రెడ్ జోన్లుగా ప్రకటిచింన ప్రాంతాలలో ఏప్రిల్‌ 14 తరవాత కూడా పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అన్ని రకాల కార్యకలాపాలపైనా నిషేధం ఉంటుంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాల్సి ఉంటుంది.ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కొన్ని సర్వీసులు నడపడం, వ్యవసాయ పనులకు అనుమతులు ఉంటాయి.

లాక్ ‌డౌన్‌ అమలులో ఉంటే ఆంక్షల నుంచి ఏయే రంగాలను మినహాయించాలన్నదానిపై కేంద్ర హోంశాఖ ఒక జాబితా రూపొందిస్తోంది. వ్యక్తిగత దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధనతో వ్యవసాయం, చిన్న-మధ్య తరహా, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి కొన్ని ఆంక్షలను మినహాయించే అవకాశం ఉందని సమాచారం. విమానయాన రంగానికి కూడా మినహాయింపు లభించవచ్చని తెలుస్తోంది.

ఉల్లిపాయల దిగుమతిపై తెలంగాణ ఆంక్షలు


కరోనా వైరస్ వ్యాప్తి చేయకుండా కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా దేశంలో చాల వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు రావడాన్ని నిషేధించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉల్లిపాయల దిగుమతులను సోమవారం నుండి నిషేధించడం విస్మయం కలిగిస్తున్నది.

లాక్ డౌన్ కేవలం ప్రజల రాకపోకలను కట్టడి చేయడం కోసమే ఉద్దేశించినది, వస్తువులు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన కొద్దీ రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

పైగా రెండు రోజుల క్రితమే వస్తువుల రవాణా వాహనాలను ఎక్కడ ఆపవద్దని, వారిని ఎటువంటి పాస్ లను అడగవద్దని అన్ని టోల్ గేట్ లకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు పంపడం గమనార్హం.

పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల నుండి ఉల్లిపాయల దిగుమతలు నిషేధిస్తూ ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ఉల్లిపాయలను అనుమతిప వద్దని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖా ఆదేశాలు ఇచ్చింది. టోకు వ్యాపారుల అంగీకారంతోనే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా పేర్కొనడం గమనార్హం.

ఈ మూడు రాష్ట్రాలలో కరోనా బాగా వ్యాపిస్తూ ఈ నిషేధానికి కారణమైతే మహారాష్ట్ర మినహా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో తెలంగాణతో పోల్చుకొంటే కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. పైగా ఈ ఆంక్షలు కేవలం ఉల్లిపాయల పైననే అమలు పరుస్తూ, ఇతర వస్తువుల రవాణాను అనుమతిస్తూ ఉంటె కరోనా కట్టడి సాధ్యం కాగలదా?

తెలంగాణలో ఏడాదికి 3.21 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం ఉండగా, ప్రతి ఏడు ఇతర రాష్ట్రాల నుండి 25,000 టన్నులు దిగుమతి చేసుకొంటుంటాము. ఈ సంవత్సరం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో ఉల్లి సాగైందని రాష్త్ర ప్రభుత్వం చెబుతున్నది.

అయితే రాష్ట్రంలోని పంట రాష్ట్ర అవసరాలకు సరిపోతుందా? లేదా కుత్రిమంగా ధరలు పెంచి లాభాలు గడించాలనుకొనే టోకు వ్యాపారుల మాయలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుందా అన్న విషయం తెలవలసి ఉంది.

ప్రభాస్ సినిమా కి మరో పెద్ద దర్శకుడు


బాహుబలి , సాహో వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు చేసాక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ముందు `జాన్ ` అని టైటిల్ పెట్టాలనుకొన్నారు . ఆల్రెడీ సమంత మూవీ అదే టైటిల్ తో రావడం తో ఇపుడు ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రేంజ్ కి తగ్గ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట .ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ నటన కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. ఇక .ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో పెద్ద దర్శకుడితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు

‘కేజీఎఫ్’ మూవీ తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన తరవాతి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ బాబు తో గాని సినిమా చేయాలను కొన్నాడు. కానీ కుదరలేదు. దాంతో ప్రశాంత్ నీల్ .. ‘కేజీఎఫ్ 2’ తరువాత చేయబోయే సినిమాను పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో చేయాలనే దృఢ సంకల్పం తో ఉన్నాడని తెలిసింది .

ఈ విషయం ఫై ఆరాతీయగా ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందని, దాంతో వాళ్ళు ప్రభాస్ ని తమ బ్యానర్లో సినిమా చేయించ డానికి ప్రయత్నిస్తు న్నారని రూఢీగా తెలిసింది కరోనా గొడవ సద్దుమణి గాక ఈ ప్రాజెక్ట్ వివరాలు పూర్తి గా బయటికి వస్తాయి .

ఒక్క ఆర్డినెన్స్ తో విమర్శల పాలైన బిశ్వ భూషణ్!


ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడ లాడిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రాజకీయ వేడి రగిలింది. ఇందుకు కారణం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ తొలగింపు, ఆయన స్థానంలో కె.కనగరాజ్ ను నియమించడమే. ఆ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం పాత్రతో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ పాత్ర కీలకంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదింపు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్ అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీల విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సొంత పార్టీ బీజేపీ నాయకులు సైతం గవర్నర్ తీరును తప్పు పట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బిశ్వ భూషణ్ తీరుపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. గవర్నర్ గా బీజేపీ సీనియర్ నాయకుణ్ని కేంద్రం నియమిచడంతో తొలుత ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సంతోషించారు. రాష్ట్రంలో తమకు అండగా ఉంటాడని భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదించి పంపడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ అంశాన్ని పార్టీ జాతీయ నాయకుల దృష్టిలో పెట్టునున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇది సరైన చర్య కాదంటుంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా గవర్నర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం పొరపాటు చేసినా ఉన్నత స్థానంలో ఉన్న గవర్నర్ దానిని సరిదిద్దాలే తప్ప ఇటువంటి నిర్ణయాలను వెంటనే ఆమోదించడం తగదంటున్నారు. సీపీఐ ఈ విషయంలో గవర్నర్ తీరును తప్పు పట్టింది.

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ నిస్పాక్షికంగా వ్యవహరించ కుండా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం చుక్కల భూముల ఆర్డినెన్స్ పంపగా ఇది ప్రజల సమస్య పరిష్కారించే విధంగా లేదని తిరస్కరించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎసైన్మెంట్ కమిటీల మార్పులను, ఇతర పలు అంశాలను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం పంపే అన్ని ఆర్డినెన్స్ లు గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదని, దాని వల్ల ప్రజలకు ఈమేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాన్ని పశీలించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎస్.ఈ. సీ ఆర్డినెన్స్ విషయంలో అలా జరగలేదని ఆరోపిస్తున్నాయి.

జగన్ దృష్టి అంతా స్థానిక ఎన్నికల పైనే!


మొత్తం ప్రపంచం అంతా కరోనా మహమ్మారిని కట్టడం చేయడంపై దృష్టి సారిస్తూ ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన దృష్టి మొత్తాన్ని ఈ వైరస్ కారణంగా గత నెలలో రాష్త్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఆరు నెలలపాటు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా పూర్తి చేయడం పైననే దృష్టి సారిస్తున్నట్లు కనబడుతున్నది.

కరోనా పేరుతో ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఒక వంక రాష్ట్రంలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నదని లేదా తగ్గుముఖం పట్టినదనే అభిప్రాయం కలిగించడం ద్వారా ఎన్నికలకు సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవంక ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న రమేష్ కుమార్ ను ఆ పదవి నుండి తొలగించారు. వాస్తవానికి ఆయన స్థానంలో ఎన్నికల కమీషనర్ గా నియమించిన జస్టిస్ కనగరాజ్ ను ఆర్డినెన్సు జారీ చేయడానికి నాలుగు రోజుల ముందే చెన్నై నుండి విజయవాడకు ఒక కారులో తీసుకు వచ్చారు. ఆయనను విజయవాడలో ఒక స్టార్ హోటల్ లో ఉంచి, ముందుగానే గవర్నర్ ను కూడా సంప్రదించి పగడ్బందీగా వ్యూహం రూపొందించారు.

ఆఘమేఘాల మేడం మొత్తం వ్యవహారం కొద్దీ గంటలలో పూర్తయ్యే విధంగా చేయడం ద్వారా ముందే రమేష్ కుమార్ కోర్ట్ ను ఆశ్రయించి స్టే తీసుకు రాకుండా చేయగలిగారు. ఇప్పుడు కూడా ఆర్డినెన్సు పై కోర్ట్ నుండి స్టే తీసుకు వచ్చే లోగానే ఎన్నికల పక్రియ పూర్తిచేసే ఆలోచనలు చేస్తున్నారు.

వైసిపి అభ్యర్థుల ద్వారా ఇంటింటికి నగదు, బియ్యం పంపిణి చేయించడం గాని, ఇప్పుడు ఇంటికి మూడు మాస్క్ ల పంపిణి గాని అన్నిన్నిట్నీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తున్నారు.

గత ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేయడమే గాని రద్దు చేయక పోవడంతో ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో మొత్తం పక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. అయితే అందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న లాక్ డౌన్ సడలింపుకు జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువగా అధికార పక్షాలకే అనుకూలంగా ఉంటుంది. జగన్ ఎందుకని ఇంతగా ఖంగారు పడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పుడు కమీషనర్ మార్పుపై హై కోర్ట్ జోక్యం చేసుకొంటే తప్పా పది రోజులలో ఎన్నికల పక్రియను పూర్తి చేయడానికి నూతన కమీషనర్ కార్యాచరణకు దిగే అవకాశం ఉంది.

కథ రాంచరణ్ కి డైరెక్షన్ చిరంజీవికి


మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అంటే దాదాపు అందరి దర్శకులకు పండగే. నిజానికి చిరంజీవి గారికి కథ చెప్పి వప్పించడం అంత తేలికైన విషయం కాదు. కథాకథనాలపై 150 సినిమాల అనుభవం ఆయనది . దాంతో కథ ఫై ఆయన అనేక సందేహాలను వ్యక్తం చేస్తారు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఒప్పించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు .చాలా ఓర్పు , నేర్పు కావాలి .మరి అలాంటి మెగా స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని కొంతమంది యువ దర్శకులు చాలా లక్కీగా సొంతం చేసుకున్నారు.

సురేందర్ రెడ్డి .. రామ్ చరణ్ తో ధృవ సినిమా చేయాలని వస్తే, చెర్రీ ఆయనకి చిరంజీవితో ‘సైరా’ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. సురేందర్ రెడ్డి విషయంలో చిరంజీవిని రామ్ చరణ్ గట్టిగానే పట్టుబట్టి ఒప్పించాడు. అలాగే కొరటాల శివ కూడా రామ్ చరణ్ కి ఒక కథ చెప్పడానికి వస్తే తను `ఆర్ ఆర్ ఆర్` సినిమా నుంచి రిలాక్స్ కావడానికి సమయం పడుతుందంటూ తండ్రి దగ్గరికి పంపించాడట. అలా ‘ఆచార్య’ సినిమా కొరటాల ఖాతాలో పడింది .ఇక రీసెంట్ గా `సాహో` ఫేమ్ సుజీత్ కూడా చెర్రీకి కథ చెప్పడానికే వెళ్లాడట. తమ కాంబినేషన్లో సినిమా తరవాత ముందు ఈ ‘లూసిఫర్’ సినిమా రీమేక్ చేయమని అన్నాడట. అలా చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ ను సుజీత్ కి అప్పగించాడట .మొత్తం ఈ వ్యవహారం లో .విశేషం ఏమిటంటే ఫై మూడు సినిమాలకు రామ్ చరణ్ నిర్మాత కావడం ..

నాగ్ జడ్జిమెంట్ ఈసారి అఖిల్ ని గట్టెక్కిస్తుందా!


అక్కినేని నాగార్జున ఈ సారి టెన్షన్ పడటం లేదట …కొడుకు అఖిల్ ఇంతవరకూ చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నాడు. అందుకే అఖిల్ నాలుగో చిత్ర విషయంలో అఖిల్ ఎక్కువ గ్యాప్ తీసుకుని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో సినిమా చేయడం జరిగింది. కాగా యూత్ ని టార్గెట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమా కి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ‘ అనే క్యాచీ టైటిల్ పెట్టడం జరిగింది .

నిజానికి అఖిల్ సినిమాల రఫ్ ఎడిటింగ్ పూర్తయ్యాక ,ఒకసారి రష్ చూసి సూచనలు చేయడం నాగార్జున అలవాటు. అలాగే ఈ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ` సినిమా రఫ్ ఎడిటింగ్ పూర్తయ్యాక నాగ్ సార్ చూశాడట. ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన రెండు సీన్స్ విషయంలో కొద్దిపాటి మార్పులు చెప్పారని యూనిట్ అంటున్నారు. అది తప్పితే టోటల్ అవుట్ పుట్ పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారని చెబుతున్నారు. ప్రాజెక్టు కొంత లేట్ అయినప్పటికీ అఖిల్ కి సరైన సినిమా రాబోతుందని నాగ్ సార్ హర్షం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. కాగా పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను లాక్ డౌన్ గొడవ సద్దుమణి గాక విడుదల చేయాలనే ఆలోచనలో గీతా ఆర్ట్స్ యూనిట్ ఉంది.

లాక్‌డౌన్‌ ఉల్లంఘిసస్తే కఠిన శిక్షలే!


కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు జరపడమే మార్గంగా భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లంఘనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకనే 2005లో యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ చట్టమాలోని నిబంధనల అమలును మొదటిసారిగా చేయనున్నది. ఈ విషయమై ఇప్పటికే రాష్త్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది.

ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు వివిధ నేరాలు, వాటి శిక్షలను నిర్వచించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్న నేపథ్యంలో ఈ చట్టంలోని సెక్షన్లు, శిక్షల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.

సెక్షన్‌ 51: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమించేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, ఆపద వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనా సదరు వ్యక్తికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నది.

సెక్షన్‌ 52: ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారుల నుంచి ఏదైనా సాయం పొందినా, ఏవైనా పనులు చేయించుకున్నా వారికి రెండేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జరిమానా, జైలుశిక్ష రెండూ విధించవచ్చు.

సెక్షన్‌ 53: విపత్తును అరికట్టేందుకు ఉపయోగించే వస్తువులు లేదా నగదును ఎవరైనా దుర్వినియోగం చేసినా, లేదా పారబోసినా అలాంటి వ్యక్తులకు రెండేండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.

సెక్షన్‌ 54: ప్రజలను గందరగోళపరిచేలా, ఆందోళన కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారికి గరిష్ఠంగా రెండేండ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ శిక్షలు విధిస్తారు.

సెక్షన్‌ 56: విధినిర్వహణలో విఫలమైనా, అనుమతి లేకుం డా విధుల నుంచి తప్పుకొ న్నా, ఈ చట్టం కింద ప్రభు త్వం అప్పగించిన బాధ్యతల అమలులో విఫలమైనా, లేదా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల నుంచి వైదొలగినా గరిష్ఠంగా ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది.

సెక్షన్‌ 55: ప్రభుత్వ అధికారి/ ఏదైనా విభాగం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలకు ఆదేశించవచ్చు. తనకు తెలియకుండానే ఆ తప్పు జరిగినట్టు నిరూపించే ఆధారాలు సమర్పిస్తే విచారణ నుంచి మినహాయింపు ఉంటుంది.

సెక్షన్‌ 57, 58: విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఏదైనా కంపెనీ లేదా కార్పొరేట్‌ బాడీ ఉల్లంఘించినట్టు నిరూపితమైతే ఆ కంపెనీ డైరెక్టర్‌, మేనేజర్‌, ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

సెక్షన్‌ 59: సెక్షన్‌ 55, 56ల కింద నమోదైన కేసుల ప్రాసిక్యూషన్‌కు వినియోగిస్తారు.

సెక్షన్‌ 60: ఈ చట్టం పరిధిలోని అంశాల్లో కోర్టులు నేరుగా కలుగజేసుకునే అవకాశం ఉండదు.

మోదీ ప్రభుత్వం వద్ద కరోనా ఎదుర్కొనే ప్రణాళిక లేదా!


మూడు వారల పాటు విధించిన లాక్ డౌన్ సమయం ముగిసి, కొన్ని మార్పులతో ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న మోదీ ప్రభుత్వం నిర్దుష్టమైన ప్రణాళిక లేక సతమత మవుతున్నదా? ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలకు ఇబ్బంది పడుతున్నదా?

ముందస్తు సంసిద్ధత లేకుండా అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో కోట్లాది మంది పేదలు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి లేక రోజువారీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి, ఆశ్రయం లేక రోడ్డున పడ్డారు.

ఈ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు గ్రామీణ భారతం తీవ్ర కష్టాలు పడుతోంది. నగరాలు, పట్టణాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆంక్షలు, నిర్బంధంతో వేలాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్రప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో నిరుద్యోగిత రేటు 23 శాతం తాకిందని సిఎంఐఇ డేటా పేర్కొనడం ఆందోళన కలిగిస్తున్నది.

ఇటువంటి పరిణామాలను ఈ ప్రభుత్వం వద్ద సమాధానాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నా, ఇప్పటికీ వైద్య సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు లేవు. భారత్‌లో కరోనా టెస్టింగ్‌ కిట్ల కొరత తీవ్రస్థాయిలో ఉండటంతో ఈ వైరస్ తీవ్రతపై పూర్తి అంచనాకు రాలేక పోతున్నాము. ఉదాహరణకు బీహార్‌లో 10 వేల కిట్లు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం 250 మాత్రమే కల్పించింది.

భారత్‌లో పేలవంగా ఉన్న వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించడం లేదు. ఉన్న ఆసుపత్రుల్లో కొన్నింటికి కోవిడ్‌ ఆసుపత్రులుగా మార్చిందే తప్ప చైనా, యుకెల మాదిరిగా ప్రత్యేకంగా ఆసుపత్రులను నిర్మించే ప్రయత్నం చేయడం లేదు.

భారత్‌లో భారీ సంఖ్యలో ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాటిల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనాభాతో పోల్చుకుంటే బెడ్‌ల సంఖ్యగా తక్కువగా ఉంది.

49 వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ పెట్టామని చెబుతున్న కేంద్రం అవి ఎప్పుడు అందుతాయో చెప్పలేకపోతోంది. కరోనాపై యుద్దంలో ముందు వరుస లో నిలబడిన వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ)ల ఉత్పత్తికి సమయం పడుతుందని తయారీదారులు పేర్కొంటున్నారు. దాదాపు రూ.1.7 కోట్ల పిపిఇల కోసం ఆర్డర్‌ పెట్టామని ఈనెల 9న చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటివరకూ ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందన్న దానిపై మరోసారి స్పష్టత ఇవ్వలేదు.

హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఎగుమతిపై ఈ నెల 4న నిషేధం విధించిన కేంద్రం అమెరికా కోరడంతో రెండు రోజుల వ్యవధిలోనే 6న సడలింపులిచ్చింది. అయితే భారత్‌లో కొరతగా ఉన్న పిపిఇలు, ఇతర వస్తువులపై అమెరికా విధించిన నిషేధంపై ఈ దేశం నుండి ఎటువంటి హామీలు పొందలేక పోయింది.

కరోనా మృతుల అంత్యక్రియలకి కొత్త రూల్స్!

తెలంగాణ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంత్యక్రియలకి సంబంధించి కొత్త రూల్స్ ను కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది.

కరోనా అనుమానిత/నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబసభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం లభించనుంది. ఆస్పత్రిలో అయితే సురక్షితమైన గ్లాసు కిటికీ నుంచి మృతదేహాన్ని చూసేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తారు.

కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కానీ మృతదేహాన్ని ముట్టుకోవ డానికిగానీ అనుమతి ఉండదు. ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి, లీక్‌ ప్రూఫ్‌ జిప్‌ బ్యాగులో ప్యాక్‌ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు వస్తే ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు.

వారందరూ తమ సొంత రవాణా సదు పాయం ఏర్పాట్లు చేసుకోవాలి. ఆస్పత్రి కోవిడ్‌ లైసన్‌ అధికారి అందించిన మాస్కులు, గ్లౌజులు ధరించాలి. 4 మీటర్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ హిందూ/ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రదక్షిణ/ నమాజ్‌–ఏ–జనాజ నిర్వహించేందుకు అనుమతిస్తారు. హిందువులైతే 3 మీటర్ల పొడవైన కట్టెతో కాష్టానికి నిప్పుపెట్టాలి. మృతదేహానికి చుట్టూ 4 మీటర్ల దూరం వరకు రోప్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తారు. మిగిలిన అన్ని పనులను ప్రభుత్వం నియమించిన బాడీ హ్యాండ్లర్లు పూర్తి చేయనున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

అంత్యక్రియల కోసం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి కోవిడ్‌ లైసన్‌ ఆఫీసర్‌ను నియమించు కోవాలి.

అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బాడీ హ్యాండ్లర్లు తమ శరీరాన్ని లిక్విడ్‌ సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. డ్రైవర్‌తో సహా అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తులం దరూ తమ పీపీఈలను ప్రత్యేక కవర్‌లో ప్యాక్‌ చేయాలి. బాడీ హ్యాండ్లర్లు పీపీఈతో పాటు వాహనంపై సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి.

హిందువులైతే…!

కరోనా మృతుడి దేహాన్ని హిందూ సాంప్ర దాయం ప్రకారం అంత్యక్రియలకు సిద్ధం చేయాలి. మృతదేహాన్ని శుభ్రపరచడం, వస్త్రం చుట్టడం వంటివి చేయాలి.

అంత్యక్రియలు నిర్వహించే సంస్థలు/ బాడీ హ్యాండ్లర్ల కోసం రవాణా ఏర్పాట్లతో పాటు ఆ వాహనంలో పీపీఈ/కోవిడ్‌ రక్షణ పరికరాలు/పవర్‌ స్ప్రేయింగ్‌ క్యాన్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది అందుబాటులో ఉంచుతారు.

ఆస్పత్రి స్థాయిలో రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్, స్థానిక పోలీసు అదనపు కమిషనర్, ఆస్పత్రి కోవిడ్‌ లైసన్‌ అధికారితో కూడిన కమిటీ రోజూ సమావేశమై మృతదేహాలకు సాఫీగా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

శ్మశానవాటికకు మృతదేహం చేరడానికి ముందే కుటుంబ సభ్యులు అక్కడ ఎలక్ట్రిక్‌/ కట్టెలతో దహనసంస్కారం నిర్వహించడానికి అవసరమైన కర్రలు, ఇతర అంత్యక్రియల సామాగ్రిని సమకుర్చాలి. శ్మశానవాటికలో అంత్యక్రియలకు సంబందించిన టైం స్లాట్‌ను కుటుంబ సభ్యులు ముందే తీసుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఆస్పత్రి సీఎల్‌ఓ నిర్ధారించుకున్నాకే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బయటకి పంపాలి. మృత దేహాన్ని ఆస్పత్రి నుంచి పంపినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తి చేసే వరకు మొత్తం ప్రక్రియను పోలీసులు వీడియో తీయాలి.

క్రైస్తవులకు ఇలా…!

కుటుంబ సభ్యులు సూచించిన స్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహించాలి. ఆయా స్మశాన వాటికలో స్థలం లభించని పక్షంలో అందుబాటులో ఉన్న స్థలాల్లో మృతదేహాలకు జీహెచ్‌ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాలి.

మృతుడి కుటుంబసభ్యులే కఫిన్‌ (మృతదేహాన్ని ఉంచే పెట్టె)ను సమకూర్చాలి. కఫిన్‌ను తయారీదారు నుంచి ఆస్పత్రికి పోలీసులు, పురపాలక అధికారులు తరలించాలి. కఫిన్‌లో మృతదేహాన్ని ఉంచి కరోనా ప్రత్యేక అంబులెన్స్‌లో స్మశానవాటికకు తరలించాలి.

కఫిన్‌ బాక్సు మూతను కొద్దిగా జరిపి కేవలం ఐదు మంది కుటుంబ సభ్యులకు మాత్రమే కడచూపు అవకాశం కల్పించాలి.

ముస్లింలైతే…!

మృతుడి ముక్కు రంధ్రాలని దూదితో మూసివేయడంతో పాటు నోరు తెరుచుకొని ఉండకుండా మూసివేస్తారు. ప్లాస్టిక్‌ షీట్‌లో మృతదేహాన్ని చుట్టడానికి ముందు రసాయన, క్రిమిసంహరక మందులు కలిగిన నీటి మిశ్రమాన్ని మృతదేహంపై చల్లుతారు. అనంతరం శరీరాన్ని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి ఆపై తెల్లటి కాటన్‌ వస్త్రంతో చుడతారు.