
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని, వచ్చే మూడు, నాలుగు రోజులు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నమోదు కావచ్చని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే, 2 నుంచి 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో ఎండ వేడిమి బారిన పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎండ తీవ్రత వల్ల ఇళ్లలో ఉక్కబోతతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.
ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురవవచ్చని హెచ్చరించారు. వారాంతం వచ్చే సరికి వాతావరణం సాధారణ స్థాయికి చేరుతుందని అంచనా వేశారు.
ఇప్పటికే అకాల వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నెల 9వ తేదీన కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా జిల్లాలో వేటకు వెళ్లిన మత్యకారులు ఇద్దరు మృతి చెందగా, నెల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి.