
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అంతేకాకుండా చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరు ఈ సినిమాలో గురు శిష్యులుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో దేశంలో కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ టైటిల్ ‘ఆచార్య’గా చిరంజీవి అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ‘ఆచార్య’ సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. కరోనా తగ్గిన అనంతరం శరవేగంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. అలాగే 2021జనవరి 8న సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో ఈ చిత్రం అనుకున్న టైంకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మెగాస్టార్ ఈ డేట్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కరోనా అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైన నెలరోజుల తర్వాతే షూటింగ్లో పాల్గొనున్నాడు. ఈమేరకు నెలరోజులపాటు రాంచరణ్ కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలరోజుల సమయాన్ని రాంచరణ్ ‘ఆచార్య’ కోసం కేటాయించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగో అనుకున్న సమయానికి వచ్చే అవకాశం లేనందున ఆ తేదికి ‘ఆచార్య’ తీసుకొచ్చేందుకు నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగే ఈ సంక్రాంతికి ‘మెగా’ పండుగ రావడం ఖాయంగా కన్పిస్తుంది.