
కరోనా వైరస్ వ్యాప్తి చేయకుండా కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా దేశంలో చాల వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు రావడాన్ని నిషేధించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉల్లిపాయల దిగుమతులను సోమవారం నుండి నిషేధించడం విస్మయం కలిగిస్తున్నది.
లాక్ డౌన్ కేవలం ప్రజల రాకపోకలను కట్టడి చేయడం కోసమే ఉద్దేశించినది, వస్తువులు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన కొద్దీ రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
పైగా రెండు రోజుల క్రితమే వస్తువుల రవాణా వాహనాలను ఎక్కడ ఆపవద్దని, వారిని ఎటువంటి పాస్ లను అడగవద్దని అన్ని టోల్ గేట్ లకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు పంపడం గమనార్హం.
పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల నుండి ఉల్లిపాయల దిగుమతలు నిషేధిస్తూ ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ఉల్లిపాయలను అనుమతిప వద్దని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖా ఆదేశాలు ఇచ్చింది. టోకు వ్యాపారుల అంగీకారంతోనే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా పేర్కొనడం గమనార్హం.
ఈ మూడు రాష్ట్రాలలో కరోనా బాగా వ్యాపిస్తూ ఈ నిషేధానికి కారణమైతే మహారాష్ట్ర మినహా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో తెలంగాణతో పోల్చుకొంటే కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. పైగా ఈ ఆంక్షలు కేవలం ఉల్లిపాయల పైననే అమలు పరుస్తూ, ఇతర వస్తువుల రవాణాను అనుమతిస్తూ ఉంటె కరోనా కట్టడి సాధ్యం కాగలదా?
తెలంగాణలో ఏడాదికి 3.21 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం ఉండగా, ప్రతి ఏడు ఇతర రాష్ట్రాల నుండి 25,000 టన్నులు దిగుమతి చేసుకొంటుంటాము. ఈ సంవత్సరం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో ఉల్లి సాగైందని రాష్త్ర ప్రభుత్వం చెబుతున్నది.
అయితే రాష్ట్రంలోని పంట రాష్ట్ర అవసరాలకు సరిపోతుందా? లేదా కుత్రిమంగా ధరలు పెంచి లాభాలు గడించాలనుకొనే టోకు వ్యాపారుల మాయలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుందా అన్న విషయం తెలవలసి ఉంది.