
అమరావతిని రాజధాని కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం కరోనా దెబ్బతో తెరమరుగు అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలోను సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమం కొనసాగిన అనంతరం రైతులు, ఆ ప్రాంత వాసులు ఇళ్ల నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో వీరిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న వెంకటపాలెం గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి లాక్ డౌన్ అమలులో ఉన్నా అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నందుకు ఈ నోటీసులు పోలీసులు రైతులకు తెలిపారు.
ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు యూనియన్ బ్యాంక్ సమీపంలో ఎవరి ఇళ్లలో వారు అమరావతి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, ఇతరులను కలవడం జరిగిందని నోటీసులో తెలిపారు. జిల్లాలో సెక్షన్ 144 సిఆర్‌పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం అంటూ మహిళా రైతులకు, రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కారణాల మూలంగా మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణాలు తెలియజేయాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాలడుతుందని రైతులు ఆరోపించారు.