
కరోనా సంక్షోభ సమయంలో ఈ రోజు (ఏప్రిల్ 24) నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని పలువురు ముస్లిం పెద్దలు సలహాలిస్తున్నారు. “ముస్లిం సోదరులంతా ఈ ఏడాది ప్రార్థనలను, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని” కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ప్రతిఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఆయన కోరినట్లు చెప్పారు. వారితో తాను స్వయంగా మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు.
సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మసీదులు మరియు మతానికి సంబంధించిన ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను కూడా నిషేధించాయని నఖ్వీ ఈ సందర్భంగా తెలిపారు.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు.