Home Blog Page 8519

హైదరాబాద్ లో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లాబొరేటరీ (ఎంవిఆర్డిఎల్)ని ప్రారంభించింది. దీన్ని రక్షణమంత్రి వీడియో కాన్ఫరన్స్ ద్వారా ప్రారంభించారు. కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు వాక్సీన్ తయారీ పరిశోధనల ఇక్కడ జరుగుతాయి. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో ఈ ల్యాబ్ ‌ని రూపొందించింది.

ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో తెలంగాణలో కరోనా పరీక్షలు మరింత వేగవంతం కానున్నాయి. ఈ ల్యాబ్‌ లో ప్రతి రోజు వెయ్యికి పైగా నమూనాలను పరీక్షించవచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హైదరాబాద్‌ లో ఈల్యాబ్ రూపొందించినందుకు డీఆర్‌డీవోకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ విభాగం, సాయుధ బలగాలు సైతం అహర్నిశలు పనిచేస్తున్నాయని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

తెలంగాణలో ఇప్పటి వరకు 943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 194 మంది కోలుకున్నారు. మరో 24 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నా పాజిటివ్ సంఖ్యలు పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో కరోనా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుతం ప్రభావం చూపుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడి చేయాల్సిన సమయంలో మీనమేషాలు లెక్కించి ప్రస్తుతం కరోనా కట్టడిపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని పలువర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు వెయ్యికి చేరువలో ఉండటం గమనార్హం.

హైదరాబాద్, నిజామాబాద్, సూర్యపేట, ఆదిలాబాద్, నల్లొండ జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కేసులను పరిశీలిస్తే ఇక్కడ కరోనా మూడోదశకు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఇక్కడ కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లుగా కన్పిస్తోంది. తెలంగాణ ఒకటి, రెండు దశల్లో ఉన్నప్పుడు తేలికగా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేసినందునే ఇక్కడి కేసుల సంఖ్య పెరగటానికి దోహదపడినట్లుగా కన్పిస్తోందని యువ తెలంగాణ పార్టీ నాయకులు రాణి రుద్రమదేవి అన్నారు.

కరోనాకు మతం, కులం లేదని అయితే ఢిల్లీలోని మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి కరోనా టెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మన పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం మర్కజ్ వెళ్లిన వివరాలను ఫొటోలతో సహా విడుదల చేస్తే తెలంగాణలో మాత్రం ఢిల్లీకి వెళ్లొచ్చిన వివరాలను విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోణంలో చూసి కరోనాను తేలికగా తీసుకోవడం వల్లనే నేడు కరోనా కేసులు పెరిగిపోవడం కారణమని ఆమె ఆరోపించారు.

మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వివరాలను తెలంగాణ ప్రభుత్వం నెలరోజులైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నారు. తెలంగాణలో పెద్ద ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉన్నా వారి వివరాలను సేకరించకపోవడం శోచనీయమన్నారు. దేశంలో నెంబర్ సీఎం అని చెప్పుకునే సీఎం.. దేశంలో నెంబర్ పరిపాలన చేస్తున్నామని చెప్పుకునే నాయకులు కనీసం మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వివరాలను ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో ముస్లిం జనాభా 14శాతమేనని కేరళలో ముస్లిం జనాభా 27శాతమని రాణి రుద్రమ పేర్కొన్నారు. కేరళను చూసి కేసీఆర్ గురించి చాలా నేర్చుకోవాలని హితవు పలికారు.

అక్కడి తెలంగాణ ముందే కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ముస్లిం మతపెద్దలతో మాట్లాడి ఢిల్లీ వెళ్లొచ్చిన వారు కరోనా టెస్టు చేసుకోవాలని పిలుపునిచ్చింది. కానీ తెలంగాణలో అలాంటి ప్రయత్నం జరుగలేదన్నారు. ఎవరైనా విమర్శిస్తే వారిని దుర్భాషలాడం ఒక్కేటే కేసీఆర్ కు తెలుసని ఆమె విమర్శించింది. ఇక పోలీసులు రోడ్లపైకి వస్తే సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా సామాన్యులపై ప్రతాపం చూపడం ఏంటని ప్రశ్నించారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్లో సూర్యపేటలో కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లు తెలుస్తోందని ఆమె అన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన ఓ వ్యాపారి వల్ల కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లు తేలింది. ప్రభుత్వం తొలినాళ్లలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని పూర్తిగా కట్టడి చేసినట్లయితే ఈ కేసుల సంఖ్య ఇంతలా పెరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందువులైనా, ముస్లింలైనా ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు కరోనా టెస్టు చేయించుకోవాలని యువ తెలంగాణ పార్టీ తరుపున ఆమె కోరారు.

ఇక తెలంగాణలో కరోనా పరీక్షలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని ఆమె అన్నారు. కేంద్రం చేస్తున్న టెస్టుల సంఖ్యతో తెలంగాణలో రోజువారీ టెస్టులు ఎక్కువ చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ పీరియడ్ 14రోజుల నుంచి 28రోజులకు పెంచడంపై కూడా పలు అనుమానాలున్నాయని అన్నారు. తెలంగాణలో కరోనా కట్టడిలో లేనందునే క్వారంటైన్ పీరియాడ్ పెంచారా? లేక ముందస్తు చర్యల్లో భాగంగా పెంచరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా తొలినాళ్లలో చేసిన నిర్లక్ష్యమే కొన్ని జిల్లాల్లో నేడు కేసులు సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

https://www.youtube.com/watch?v=8sq985QIQz4

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ కోత


కరోనా మహమ్మారిని చూపి అన్ని వర్గాలపై పెద్ద ఎత్తున ఆర్ధిక చెల్లింపులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ కోతలు విధిస్తున్నాయి.

ప్రజాప్రతినిధుల జీత, భత్యాలపై కొత్త విధించిన కేంద్రం తాజాగా ఉద్యోగులకు చెల్లించే డిఎ పెంపుదలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలతో 50 శాతం మేరకు కోతలు విధించడం తెలిసిందే.

ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను కేంద్రం వాయిదా వేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి 13 నాటి కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అమలును వాయిదా వేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ 27,000 కోట్ల భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వంప్రకటించింది.

ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది.పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష జూలైలో ఉండనుంది

కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది.

దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్‌ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.

ఎన్టీఆర్ ఛాలెంజ్ పూర్తి చేసిన మెగాస్టార్, వెంకీ మామ


‘అర్జున్ రెడ్డి’ మూవీ దర్శకుడు సందీప్ వంగా మొదలెట్టిన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ హుషారుగా కొనసాగుతోంది. సందీప్ వంగా తొలుత ఈ ఛాలెంజ్ ను దర్శకదిగ్గజం రాజమౌళికి ఈ సవాల్ విసిరారు. ఆయన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్లో భాగంగా ఇంటి పనులను చకచక పూర్తిచేసి ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, దర్శకుడు సుకుమార్, కొరటాల శివలను నామినేట్ చేశాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించి ఇంటి పనులు చేసిన వీడియోను ట్వీటర్లో పోస్టు చేసి టాలీవుడ్ అగ్రనటులను నామినేట్ చేశాడు. వీరిలో ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లు ఉన్నారు.

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

ఎన్టీఆర్ ఛాలెంజ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ లు పూర్తి చేసి వీడియోలను ట్వీటర్లో పోస్టు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఉదయాన్ని ఇంటిని శుభ్రం చేశారు. ఆ తర్వాత దోశవేసి తన అమ్మకు దగ్గరుండి సర్వ్ చేశారు. అయితే ఆమె తొలుత తన కుమారుడి దోశను తినిపించి ఆ తర్వాత ఆనందాన్ని తిన్నారు. ఈ వీడియోను పోస్టు చిరు పోస్టు చేస్తూ ‘నేను రోజు చేసే పనులే.. ఈరోజు మీకోసం..’ ఈ వీడియోను సాక్ష్యం అంటూ ట్వీట్ చేశాడు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ దర్శకుడు మణిరత్నంలకు ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ విసిరారు.

అదేవిధంగా విక్టరి వెంకటేశ్ కూడా ఎన్టీఆర్ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. చిరంజీవి దోశ వేస్తే.. వెంకటేష్ కలర్ ఫుల్ కాయగాయలతో అద్భుతమైన కర్రీ చేశారు. ఇల్లు క్లీనింగ్ చేసి, గార్డెనింగ్ పనులు చేశారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి చకచక క్యారట్ ముక్కలు కట్ చేసి.. అందులో పన్నీర్ వేసి నోరూరించే విజిటేబుల్ కర్రీని వెంకీమామ తయారు చేసి వీడియోను పోస్టు చేశారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ పూర్తయిందన్న వెంకీమామ ముగ్గురిని నామినేట్ చేశారు. హీరో వరుణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడిలకు ఛాలెంజ్ విసిరారు. ఇందులో అనిల్ రావుపూడి వెంటనే వెంకీమామ ఛాలెంజ్ యాక్సప్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో ‘బీ ద రియల్ మేన్’ ఛాలంజ్ హుషారుగా సాగుతోంది.

వైసీపీ మరోసారి రంగుల మాయ!


ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రంగుల వివాదం తెరపైకి వచ్చింది. గతంలో గ్రామా సచివాలయ కార్యాలయాలకు వైసీపీ రంగు తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంతో వైసీపీ జెండా కలర్ వచ్చే విధంగా ఆకుపచ్చ,తెలుపు,నీలం రంగులు వేశారు. ఇప్పుడు దానికి అదనంగా కాషాయ రంగు వేయడంతో మరోకొత్త వివాదానికి వైసీపీ తెరలేపాయినట్లయింది.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం హనుమాన్ ‌పాలెంలో ఓ పంచాయతీ ఆఫీస్ ‌కు కొత్తగా రంగులు వేశారు. రంగులు వేసిన ఆఫీస్‌ ను వీడియో తీసి ఆయన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేశారు. తెలుపు రంగు-క్షీర విప్లవం, నీలం రంగు – చేపల పెంపకం, ఆకుపచ్చ రంగు – వ్యవసాయానికి ప్రతీక అంటూ చెప్పారని, కానీ వైసీపీ రంగులను ప్రతిబింబించేలా ఆ రంగులు ఉన్నాయని, అదనంగా కాషాయ రంగును వేశారని ఆయన అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కేవలం కాషాయ రంగును మాత్రమే వేశారని దీనికి డబ్బుల వృథా తప్ప ఏం లేదని ఆయన అన్నారు. దీంతో ఏపీలో మళ్లీ రంగుల పై వివాదం రాజుకుంటుంది.

మిస్టరీగా మారిన 52 కేసులు!


రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ సామాజిక సంక్రమణ దశకి చేరుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813 కి చేరింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుమానితులకు పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. గతంలో రోజుకు 2 వేల పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం 5,700 వరకూ నిర్వహిస్తున్నారు.

తాజాగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులకు మూలాలు ఎక్కడ అనేది కనుక్కోంవడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఇటువంటి కేసులు రాష్ట్రంలో 52 వరకూ వున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల విజయవాడ నగరం మాచవరం ప్రాంతంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ ఆమెకు ఎలా వచ్చిందనే అంశంపై అధికారుల ఆరా తీయగా తాను బయటకు ఎక్కడికి వెళ్లలేదని తేల్చి చెప్పింది ఆ మహిళ. ఈ కేసుకు లింక్ ఎలా అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మిస్టరీ నడుస్తోంది. ఈ మిస్టరీ ఛేదించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుల మిస్టరీని త్వరలోనే చేదిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ఈ కేసుల మిస్టరీ వీడకపోతే అనేక అనుమానాలు తావిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో కరోనా సామాజిక సంక్రమణ వ్యాప్తి దశకు చేరుకుందనే భావించాల్సి వస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వం ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేయడం, వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. అప్పుడే రాష్ట్రంలో కరోనా కు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

కన్నా దూకుడుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?


ఆంద్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో ప్రారంభమైన ఈ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత రచ్చ చేశారు. వాస్తవానికి కన్నా కిట్ లపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ రూ.337 కొనుగోలు చేసిన విషయం ప్రస్తావిస్తూ, వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నారనడంతో వివాదం చెలరేగింది. అనంతరం బీజేపీ నాయకుల ఖండనలు, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ ల కారణంగా ఈ వ్యవహారం మరింత ముదురింది.

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేధికను తెప్పించుకున్న జాతీయ నాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు ఇతర నాయకులు బాసటగా నిలవడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ అంతర్గత వ్యవహారాలను విజయ సాయిరెడ్డి జోక్యం చేసుకోవడాన్ని తప్పు బట్టింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని నిరూపించేందుకు పార్టీ లోని ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని సూచించారు.

మరోవైపు వైసీపీ, టీడీపీతో సదూరం పాటించాలన్న జాతీయ నాయకత్వం పార్టీ నాయకులకు సూచించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉంటూ బీజేపీని పటిష్ట పరచాలనే వ్యూహంలో ఉందనేది స్పష్టం అవుతోంది. వైసీపీ నేతలు ఎదురుదాడి తీవ్రత పెంచిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం కన్నాకు బాసటగా నిలవడంతో పార్టీ నాయకులకు ఊరటనిచ్చింది. దీంతో ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల వ్యవహారంలో బీజేపీ మరింత లోతుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

వలస కూలీల పెద్ద మనసుకి హాట్సాప్!

“ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు” కరోనా రక్కసి విజృంభన తో దేశంలో ఒక్కసారిగా మార్చి 24 నుండి లాక్ డౌన్ విధించడం జరిగింది. దింతో నష్టపోయినవారి జాబితాలో వలస కూలీలు కూడా ఉన్నారు. హఠాత్పరిణామంతో వలస కూలీలు వారి ఉపాధికోల్పోయారు. పని లేక, పరాయి పంచన ఉండలేక, పెట్ట బేడ సర్దుకొని కాలినడకన వారి స్వస్థలాలకు బయల్దేరారు. మార్గం మద్యలో ఉండగా.. మరో వార్తాతో ఉలిక్కి పడ్డారు. “వలస కూలీలను ఆపేసి, ఎక్కడి వారిని అక్కడే నిలిపివేసి షెల్టర్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కదలనివ్వకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఆ విధంగా వారి కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ప్రాంతాలలో ఉంటూ కొన్ని సామాజిక సేవలు చేస్తున్నారు. మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. అన్నం పెట్టిన గ్రామస్థులను ఆప్తులనుకున్నారు. ఆ గ్రామ‌స్థుల్లో సేవ చేస్తున్నారు. త‌మ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు వలస కూలీలు. లాక్‌ డౌన్‌ లో త‌మ‌కు త‌ల‌దాచుకోవ‌డానికి నీడ‌నిచ్చి ఆశ్రయమిచ్చిన పాఠ‌శాల‌లను వారి గృహాలుగా చూసుకున్నారు.
పాఠ‌శాల‌‌ను శుభ్రం చేయ‌డ‌మే కాదు చిన్న చిన్న రిపేర్లు చేసి సున్నంతో పాటు రంగులు కూడా వేస్తున్నారు. ”సార్‌! పాఠ‌శాల‌ గోడలకు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్‌ ఇప్పించండి చాలు. రంగులేస్తాం” అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. హరియానా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు… రాజస్థాన్‌ లోని సికార్‌ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్‌ సీతారాం కుమ్వాత్‌, సేథ్‌ కె.ఎల్‌.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్‌సింగ్‌ షెకావత్‌ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు.

వ‌ల‌స కార్మికులంతా కలిసి ఆ ప్రాంతంలోని పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్‌ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా… కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి. చిన్న బతుకులు పెద్ద మనసుతో వ్య‌వ‌హ‌రించార‌ని నెటిజ‌నులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి’!


అధికార పక్షం వైసిపి పాలనపై చేస్తున్న విమర్శలకు గాని, అధికార పక్షానికి చెందిన విజయసాయిరెడ్డి వంటి నాయకులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో గాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సొంత పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలి పోవడానికి ఆయన పార్టీలో చేరినప్పటి నుండి అనుసరిస్తున్న కాంగ్రెస్ తరహా రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో విమర్శల దాడులు జరుగుతున్నా కేంద్ర నాయకత్వం పట్టించుకొనక పోవడం, పైగా ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో రాజకీయ వివాదాలపై దృష్టి సారింపవద్దని హితవు చెప్పడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని గ్రహించి, బేరమాడి వైసిపిలో చేరడానికి సిద్దమైన సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ రాగానే ఆగిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆయన పట్ల పార్టీ వర్గాలలో ఒక విధమైన ఏహ్యభావంకు దారితీసింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సహితం పార్టీలో దీర్ఘకాలంగా నెలకొన్న పద్ధతులకు తొలిదకాలిచ్చి, కాంగ్రెస్ తరహాలో తన చుట్టూ కొందరు భజనపరుల బృందంను ఏర్పరచుకొని, వారి చెప్పుచేతలలో వ్యవహరిస్తూ వచ్చారు. బీజేపీలో ఎవ్వరు అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, పార్టీ పెద్దలతో ఉండే కోర్ కమిటీలో చర్చించి, ఏ విషయంపై అయినా ఒక నిర్ణయానికి వచ్చే వరవడి నెలకొంది.

అయితే పలువురు కోరే కమిటీ సభ్యులను అసలు ఏ విషయంలో కూడా సంప్రదించకుండా పట్టించుకొనేవారు కాదు. ఈ విషయమై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు కూడా వ్రాసారు. నిర్ణయాలు తీసుకొకునే సమయంలో తమను ఎందుకు సంప్రదింపలేదని కూడా నిలదీశారు.

అవినీతి అంశాలలో ప్రశ్నించిన నేతలను పక్కన పెట్టి, భజనపరులకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పేవారు.

కాంగ్రెస్ నుండి వచ్చిన కొందరు, బీజేపీలో ఉన్న ఒకరిద్దరు అవకాశవాదులు ఆయన చుట్టూ ఒక బృందంగా చేరింది. వారంతా ఆయనకు `దళారుల’వలే వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పార్టీలో పదవులకు, గత ఏడాది ఎన్నికల సమయంలో పార్ట్ సీట్లకు వీరే బేరాలు ఆడి నిర్ణయించేవారనే ప్రతీతి నెలకొంది. ఆ పేరుతో వీరు భారీగా డబ్బు వసూలు చేసిన్నట్లు పార్టీ అధిష్టానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.

గుంటూరులో పోటీ చేసిన ఒక నటి తన వద్ద నుండి పార్టీ సీట్ కోసం రూ 15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులకు పార్టీ నుండి అందజేసిన నిధులలో వీరు కొంత మొత్తం కమీషన్ గా వసూలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా పార్టీ అధిష్టానం ఇటువంటి ఆరోపణలపై మౌనం వహిస్తూ వచ్చింది.

కీలకమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ఏమాత్రం పట్టు లేని పురందేశ్వరి, సోము వీరాజు, జివిఎల్ నరసింహారావు వంటి వారినే సంప్రదిస్తూ ఉండేవారు. పార్టీ వ్యవహారాల విషయంలో తమను ఎప్పుడు సంప్రదించని కారణంగా ఇప్పుడు ఆయ్నపై ఆరోపణలు వస్తుంటే తాము మౌనంగా ఉంటూ ఉండవలసి వస్తున్నదని చలామంది బిజెపి సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు.

ప్రతి జిల్లాలో ఆ విధంగా ఒకరిద్దరు `దళారులు’ను ఏర్పాటు చేసుకొని, వారు చెప్పిన్నట్లే నడుచుకొనేవారని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకొనేవారు కాదని విమర్శలు నెలకొన్నాయి.

కన్నాను బిజెపిలోకి తీసుకు రావడంలో, ఆయనను రాష్ట్ర అద్యక్షుడైనా చేయడంలో అండగా ఉంటూ వచ్చిన ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం సహితం ఆయన వ్యవహరించిన తీరు చూసి అసంతృప్తితో ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

దొడ్డిదోవన భారత్ మార్కెట్ లోకి ఫేస్‌బుక్‌!


రిలయన్స్, ఫేస్‌బుక్‌ల మధ్య కుదిరిన భారీ డీల్ భారత దేశంలో సంచలనం కలిగిస్తున్నది. ఈ డీల్ విలువ దాదాపు రూ 43,000 కోట్లు అని చెబుతున్నారు. రిలయన్స్ ఆధ్యర్యంలోని జియో మార్ట్, ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్స‌ాప్ కలసి పనిచేసేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.

2014 తరువాత ఫేస్‌బుక్ కుదుర్చుకున్న అతి పెద్ద ఒప్పందం ఇదే. దీన్ని బట్టి సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ పెట్టుబడికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో ఇట్టే అర్థం చేసుకుకోవచ్చు. దీని వల్ల ఫేస్‌బుక్ భారత ఈ-మార్కెట్లో మరింత విస్తరించేందుకు అవకాశం లభిస్తున్నది.

ప్రపంచంలోనే చైనా తరువాత భారతే అతి పెద్ద మార్కెట్. యువ జనభా అధికంగా ఉన్న భారత్‌లో ఆన్‌లైన్‌లో జరిగే కొనుగోళ్లు, చెల్లింపులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. భారత మార్కెట్లో వేళ్లునుకునేందుకు ఫేస్‌బుక్‌కు తాజాగా ఈ ఒప్పందం రూపంలో మంచి అవకాశం లభించినట్లయింది.

భారత్ లో అత్యంత ధనవంతుడి కాకుండా రాజకీయంగా విశేషమైన పలుకుబడి గల రిలయన్స్ తో ఒప్పందం ద్వారా, వారి సహకారంతో వాట్సాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఫేస్‌బుక్ భారత్‌లో ఇప్పుడు ప్రవేశ పెట్టె ప్రయత్నం చేయనున్నది.

ఇప్పటి వరకు సమాచార భద్రత దృష్ట్యా ప్రభుత్వం అనుమతులు పొందటం ఫేస్‌బుక్‌కు సాధ్యం కావడం లేదు. పైగా, వాట్స్ అప్ వ్యవహార శైలి పట్ల భారత్ లోని భద్రతా వర్గాలు పలు సందర్భాలలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. పైగా విదేశీ ఆధారిత సోషల్ మీడియా సంస్థలు భారత్ వ్యతిరేక ప్రచారాలకు కేంద్రంగా ఉండడం కూడా భారత దేశంలో కలకలం రేపుతున్నది.

వాట్స్ ఆప్ వ్యవహారాలలో కొన్ని నియంత్రణలు తీసుకు రావడం కోసం భారత్ ప్రయత్నం చేస్తున్నది. అటువంటి ప్రయత్నాలను ఫేస్‌బుక్ ప్రతిఘటిస్తూ వస్తున్నది.

ఇప్పుడు రిలయన్స్ సహాయంతో భారత ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులను తేలికంగా పొందవచ్చని ఫేస్‌బుక్ భావిస్తున్నట్లు వెల్లడి వాడుతున్నది. ఒక విధంగా నేరుగా భారత్ మార్కెట్ లో ఆధిపత్యంకోసం ప్రభుత్వ పరంగా ఎదురవవుతున్న ఆటంకాలను అధిగమించడం కోసం రిలయన్స్ ద్వారా దొడ్డిదోవన ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పవచ్చు.

మరోవంక, వాట్సాప్, జియోమార్ట్‌ల కలయిక ద్వారా ఖాతాదారులు, వ్యాపారులను అనుసంధానం చేయడం సులభం కానుంది. ఇది ఇరు కంపెనీలకు భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువుగా ఉండే అవకాశం రాగలదని భావిస్తున్నారు.

టెక్నాలజీ రంగంలో మేటి అయిన ఫేస్‌బుక్‌తో ఒప్పందం రిలయన్స్‌కు కూడా కొత్త అవకాశాల్ని తెచ్చిపెట్టగలదని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అల్లాడిపోతున్న రిలయన్స్ సంస్థ‌లకు ఈ డీల్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సంస్థ నికర అప్పులను తగ్గిస్తానంటూ మదుపర్లకు హామీ ఇచ్చిన ముఖేశ్ అంబానీకి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.

విజయకాంత్ సార్ కి వణక్కం అంటున్న పవన్ కళ్యాణ్


కరోనా వైరస్ ఒక పక్క మనుషులను హడలెత్తిస్తున్నప్పటికీ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తోంది . మనిషిలో దాగిన మానవత్వాన్ని తట్టి లేపుతోంది. ప్రాణం పోయే వేళ ఈ ఐశ్వర్యం , సంపద అంతా వృధా, ఎందుకూ కోరగాదన్న సత్యాన్ని గుర్తు చేసింది.

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే కోలీవుడ్ స్టార్ హీరో , డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కరోనా బాధితుల కోసం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది . కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేసేందుకు ఎపుడూ ముందుకు వచ్చే విజయకాంత్ . ఇప్పుడు కరోనా ఆపత్కాలం లో కూడా ఒక అడుగు ముందుకేశాడు. కరోనా వైరస్ తో చనిపోయిన వారికి తనకు సంబంధించిన సొంత కాలేజీ స్థలాన్ని ఖనానికి ఇస్తున్నట్టు ప్రకటించాడు . ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణముంది. ఈ మధ్య కరోనాపై పోరాడిన డాక్టర్ అదే కరోనాతో చనిపోతే గ్రామస్థులు అడ్డుకుని అంబులెన్స్ పై దాడి కూడా చేశారు. ఆ దుస్థితి గమనించిన విజయ్ కాంత్ తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాలలో కరోనా శవాలను ఖననం చేసుకోవచ్చని. అభయమిచ్చాడు .దాంతో కోలీవుడ్ మొదలుకుని.. టాలీవుడ్ వరకూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వలస కూలీల పెద్ద మనసుకి హాట్సాప్!

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్పందనని తెలియ జేస్తూ ‘ విజయ్ కాంత్ గారూ.. మీరు చేసిన మంచిపనిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు వణక్కం .’ అని పొగడ్డం జరిగింది.

అర్నాబ్‌ గోస్వామి దంపతులపై భౌతిక దాడి


సంచలన టివి యాంకర్ గా పేరొందిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, ఆయన భార్యపై గత అర్ధరాత్రి ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెడుతుండగా, రాత్రి 12.15 గంటల ప్రాంతంలో, ఆయన ఇంటికి సుమారు 500 మీటర్ల ముందు ఈ దాడి జరిగింది.

గోస్వామి దంపతులకు గాయాలు కాలేదు. అర్నాబ్‌ గోస్వామి, ఆయన భార్య, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ సమియా రాయ్ గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా అర్నాబ్ విడుదల చేసిన వీడియోలో తనపై దాడి జరిపిన వారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలని అక్కడున్న భద్రతా సిబ్బంది తెలిపినట్లు ఆరోపించారు.

తనపై దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత వహించాలి అంటూ ఆ వీడియోలో ఆమెపై తీవ్రమైన విమర్శలు జరిపారు. తనను నేరుగా ఎదుర్కోలేక ఇటువంటి పిరికి చర్యలకు ఆమె పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. తనకు ఏమి జరిగినా ఆమె బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

బైక్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తమ పైకి ఏదో రసాయనాలు చల్లినట్టు ఆర్నాబ్ వాపోయాడు. గోస్వామి నిన్న ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ టివి లైవ్ డిబేట్ లో తన రాజీనామాప్రకటించి సంచలనం కలిగించారు.

మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి జరిపి హత్యా కావించిన సంఘటనపై జరిగిన టీవీ లైవ్‌ చర్చ సందర్భంగా మౌనంగా ఉన్న సోనియా గాంధీని ఆయన ప్రశ్నించారు.

“బహుశా మీరిప్పుడు సంతోషంగా ఉండి ఉండాలి. అదే మైనారిటీలకు చెందిన స్వాములపై, బిజెపి పాలిత రాష్ట్రాలలో దాడులు జరిగితే మీరు మౌనంగా ఉండేవారా?” అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

ఈ వాఖ్యలు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇటువంటి వాఖ్యలు చేయడం అమర్యాదకరమని అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, ఇతర నేతలు అర్నాబ్ పై విమర్శల వర్షం కురిపించారు.

కాగా, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని చెబుతూ దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్‌ నిజం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఈ దాడిని ఖండిస్తూ, ఈ విషయంలో అర్నాబ్ కు సంఘీభావం ప్రకటించారు.

తప్పుల తడకలో కరోనా పడగ!

Telangana

తెలంగాణలో కోవిద్19 పాజిటివ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కో రోజు 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ సర్కార్ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు, జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు అసలు సంబంధం లేకుండా ఉంటుంది.

ఇటీవల సూర్యాపేటలో ఒకేరోజు 16కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ హెల్త్ బులెటిన్ ను అదే రరోజు విడుదల చేశారు. కానీ దానిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొనలేదు. తర్వాతి రోజు ఆ కేసుల వివరాలు వెల్లడించారు. అదేవిధంగా గతంలో వరంగల్ అర్బన్ జిల్లాలో కేసులు నమోదయ్యాయని హెల్త్ బులెటిన్ లో సర్కార్ పేర్కొంది. తర్వాతి రోజు అసలు వరంగల్ అర్బన్ ను మీడియా బులెటిన్ లో చేర్చలేదు. ఇలా జిల్లాల వారీగా చాలా తప్పుల తడకగా కేసుల వివరాల వెల్లడి ఉంది. దీని పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జిల్లాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి కో ఆర్డినేషన్ లేదా అనే అనుమానం తలెత్తుంది. అదే విధంగా కేసుల వివరాలు రోజు వారీగానే వెల్లడిస్తున్నారా లేక ఏమైనా దాస్తున్నారా అనే సందేహాలను విపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు. అంటే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సర్కార్ ప్రజలు ఆందోళన చెందకుండా వివరాలు వెల్లడిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటివరకకు తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరింది. వీరిలో 194 మంది కోలుకోగా 23 మంది మరణించారు. ప్రస్తుతం 711 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అయితే కేవలం హైదరాబాద్ మహానగరంలోనే 400కు పైగా కేసులు నమోదయ్యాయి. నేడో రేపో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000ని దాటనుంది. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారందరిని ఇప్పటికి కూడా ట్రేస్ చేయలేదని సాక్షాత్తు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఎవరికి వారుగా వచ్చి పరీక్షలు చేయించుకొని సహకరించాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదు కాబట్టి కరోనా దెబ్బ పెద్దగా తెలియడం లేదు. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య కుప్పలు కుప్పలుగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాప్తికి సంబంధించి ఇంకా లోతుగా ప్రజలన చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెను ప్రమాదం తప్పదు. ప్రజలు, ప్రభుత్వం యంత్రాంగం సమన్వయంతో ముందుకు పోతేకానీ ఈ మహమ్మారిని తరిమి కొట్టలేం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మేలో కరోనా ఉగ్రరూపం ధరించే అవకాశం!


భారత్‌లో కరోనా వైరస్‌ ప్రతాపం ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. మే నెల రెండో వారంలో తీవ్ర స్థాయిలో ఉంటుందని, పాజిటివ్‌ కేసుల సంఖ్య 75 వేల వరకూ ఉంటుందని ఒక ప్రముఖ మీడియా సంస్థ, ప్రొటివిటి అనే అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సంస్థ సంయుక్త అధ్యయనంలో అంచనా వేసింది. దానితో మే చివరి వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మే నెల మధ్యలో కరోనా బాధితుల సంఖ్య పీక్‌ స్టేజీకి చేరుకొంటుందని ఈ అధ్యయనం సూచించింది. ఆ తర్వాత క్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందని చెప్పింది. దీని ప్రకారం మే 22 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 75వేల వరకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉన్నది?, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది?, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా అధ్యయన బృందం మూడు నమూనాలను రూపొందించింది.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు కొనసాగించాలని అధ్యయనం సూచించింది. దేశంలో లాక్‌డౌన్‌ మే 3వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుతం వైరస్‌ పునరుత్పత్తి రేటు 0.8గా ఉన్నది. అంటే ఒక కరోనా రోగి నుంచి 0.8 మందికి వ్యాధి వ్యాపిస్తున్నది. దీని ఆధారంగా రెండు అంచనాలను విడుదల చేశారు.

లాక్‌డౌన్‌ను మే 15వరకు పొడిగిస్తే సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు రోగుల సంఖ్య సున్నాకు తగ్గుతుంది. ఒకవేళ లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించగలిగితే.. జూన్‌నెల మధ్యలోనే కేసులు సున్నాకు పడిపోతాయని పరిశోధకులు తేల్చారు. ఈ క్రింది మూడు పద్దతులలో ఈ అంచనాలకు వచ్చారు.

పర్సంటేజ్‌ మోడల్‌: ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందో అధ్యయనం చేసి, వీటి ఆధారంగా భారత్‌లో వైరస్‌ ఎలా విస్తరిస్తుందో అంచనా వేస్తారు.

ద టైమ్‌ సిరీస్‌: చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ప్రారంభం, పీక్‌స్టేజ్‌, కేసుల సంఖ్య తగ్గుదలకు ఎంత సమయం పట్టిందో విశ్లేషిస్తారు. వాటిని భారత్‌కు అన్వయిస్తారు.

ససెప్టబుల్‌ ఎక్స్‌పోజ్డ్‌ ఇన్ఫెక్టెడ్‌ రికవర్డ్‌: వైరస్‌ పునరుత్పత్తి రేటు, ఒక్కో కరోనా రోగి సగటున ఎంత మందికి వైరస్‌ను వ్యాప్తి చేయగలడు? వంటివి సేకరిస్తారు.

ఇలా ఉండగా, భారత్ లో కరోనా కేసుల సంఖ్య 20,000 మార్క్ దాటగా, ఎనిమిది రోజులలో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మరోవంక, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిన జిల్లాల సంఖ్య గత ఇరవై రోజుల్లో రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసులు నమోదైన జిల్లాలు ఏప్రిల్ 2 వ తేదీ నాటికి 211 ఉండగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 430కి చేరుకుంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి సీక్వెల్


2019 జూన్ 21 న విడుదలైన ” ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” .చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రం లో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. విభిన్న కథ , కధనం తో రూపొందిన ఈ చిన్న చిత్రం ప్రేక్షకులకి బాగా నచ్చింది. కేవలం 1 కోటి 50 లక్షలు బడ్జట్ తో తయారైన ఈ చిత్రం 17 కోట్ల 50 లక్షలు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది . కాగా ఇపుడా చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.

తాజా గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ” ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” కి సీక్వెల్ రాబోతుందని ధ్రువీకరించాడు . ఇక ఆ సినిమా తరవాత మరో తెలుగు సినిమాలో కనపడక పోవడానికి కారణం చెబుతూ . కథలు నచ్చకపోవడమే ఇలా గ్యాప్ రావడానికి కారణం అన్నాడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకులకు నచ్చడానికి కారణం, ఆ కథపై నేను చాలా కసరత్తు చేసాను. దాంతో కథలోని కొత్తదనాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనిపించింది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం . అయితే సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. నా తాజా చిత్రంగా ‘జాతి రత్నాలు’ రూపొందుతోంది. నాన్ స్టాప్ గా నవ్వించే ఈ సినిమా, నాకు మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో వున్నా,… అన్నాడు .కాగా ఈ ` జాతి రత్నాలు’ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ లో నిర్మించ బోతున్నారు గత సంవత్సరం ” ఛిచ్చోరె ” హిందీ చిత్రం తో బాలీవుడ్ లోకి కూడా ఎంటరై సూపర్ సక్సెస్ అందుకొన్న నవీన్ పోలిశెట్టి సినిమాల విషయం లో చాలా సెలెక్టివ్ గా వెళుతున్నాడని తెలుస్తోంది .

బాలయ్య కాశీ ప్రయాణం మానుకొంటున్నాడు


పైసా వసూల్ సినిమా నుంచి వరుసగా అయిదు ప్లాప్ చిత్రాలను చవి చూసిన నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న ఉద్దేశం తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణం గా ఆగింది. కాగా ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర అఘోరా గెటప్ లో ఉంటుందట .. దరిమిలా ఆ పాత్ర కోసం కొన్ని సన్నివేశాలను వారణాసి (కాశీ ) లో చిత్రీకరించాలనుకున్నారు.

వలస కూలీల పెద్ద మనసుకి హాట్సాప్!

కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా కాశీ ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టారు. బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ని మార్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేయాలనుకుంటున్నాడు. `సింహా, లెజెండ్ ` చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్నహ్యాట్రిక్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని` జయ జానకి నాయక ` ఫేమ్ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

లూసిఫెర్ లో చిరుకి జోడి ఉంటుందట


రాను రాను చిత్ర నిర్మాణం నిర్మాతలకు గుదిబండగా మారుతోంది. సరైన ప్లానింగ్ లేక పోవడం తో నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ విషయం మెగా స్టార్ చిరంజీవి గమనించి ఇక మీదట సినిమాల్లో నటించే విషయం లో వేగం పెంచబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన .ఈ చిత్రం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదట… వెంటనే తన 153వ సినిమా గా మళయాళ చిత్రం ‘లూసిఫర్` రీమేక్ స్టార్ట్ చేయాలను కుంటున్నాడట … దరిమిలా సాహో చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమా స్క్రిప్ట్ ని తయారు చేసే పనిలో బిజీ గా ఉన్నాడట…. .ఆ క్రమంలో చిరంజీవికి ఉన్న స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సుజిత్ కథలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది .

కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి’!

వాటిలో మొదటగా మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలో జోడి ఉండేలా సుజిత్ స్క్రిప్ట్ ని మార్చాడట… . నిజానికి మళయాళ లూసిఫర్ చిత్రం లో హీరో మోహన్ లాల్ కి జోడీ ఉండదు. ఇక ఈ చిత్రం తో పాటు కజిన్ అయిన దర్శకుడు మెహర్ రమేష్ తో, జై లవకుశ ఫేమ్ దర్శకుడు బాబీలతో కూడా చిరంజీవి కథా చర్చలు చేసినట్టు తెలుస్తోంది.

కాగా వీరిలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీతో చేసే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి..దర్శకుడు బాబీ ఇప్పటికే తన సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించగా ఆయన ఓకె చేశారని తెలుస్తోంది .