
“చినిగిన చొక్కైనా తొడుక్కో గాని ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటకు కరోనా కష్ట కాలంలో విలువ చేకూరింది. ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రముఖ ఇంగ్లీష్ రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా “వరల్డ్ బుక్ డే”ను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ప్రపంచమంతా కరోనా భయంతో అల్లకల్లోలం అవుతున్న సమయంలో పుస్తకాలు చేసే మ్యాజిక్ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో… సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్ లో బుక్స్ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్ బుక్ డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం’’ అని ట్వీట్ చేశారు.
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
పుస్తక పఠన గొప్పతనాన్ని గుర్తించిన కేరళ!
అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్ డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్ షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.