Home Blog Page 8515

అందుకే ఒక్కరోజు దీక్ష:బీజేపీ

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రోజువారి కూలీలు,వివిధ పంటలు పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఒక రోజు ఉపవాస దీక్ష చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు, నిరసనగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతుల విషయం, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై కనీసం కేబినెట్‌లో చర్చించకపోవడం దారుణమన్నారు.

లాక్‌ డౌన్‌ కాలంలో ఐకేపీకి తెచ్చిన ధాన్యం తిరిగి తీసుకెళ్లాలంటే రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.ఎక్కడా ఎలక్ట్రానిక్‌ కాంటాలు లేవన్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభించనే లేదన్నారు. ఈ పరిస్థితులతో రైతులు లాభాలు ఆశించడం లేదని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అంటున్నారని, గిట్టుబాటు లేక వారు కన్నీరు పెడుతున్నారన్నారు. రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్న ప్రభుత్వం ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితులు,అధికారులు, మిల్లర్లకు కొమ్ము కాస్తున్నారని, బ్రోకరిజం చేస్తున్నారని ఆరోపించారు.

అందుకే అన్ని జిల్లాల్లో బీజేపీ నేతలు ఒక్క రోజు ఉప వాస దీక్షలో పాల్గొన్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు.

మతసామరస్యం-ఘర్షణలకు మూలాలు ఎక్కడ? (భాగం1)

కరోనా మహమ్మారి మనల్ని విషయాల్ని లోతుగా అధ్యయనం చేయటానికి అవకాశం కల్పించింది. సామాజికపరంగా భారతదేశం ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాలు మత సామరస్యం. 130 కోట్ల ప్రజానీకం కలిగిన మనదేశం అనేక మతాలూ, కులాలు, జాతులు, సంస్కృతులు కలిగిన వైవిధ్యభరిత దేశం. ఇదే మన బలం, బలహీనం కూడా. ఇందులో ఒక్కోసారి ఒక్కో అంశం దేశాన్ని అల్లకల్లోలం లోకి నెట్టుతుంది. కొన్నాళ్ళు కుల ఘర్షణలు, మరి కొన్నాళ్ళు సంస్కృతుల ( ద్రావిడ ) అశ్తిత్వపోరాటాలు, ఇంకొన్నాళ్ళు జాతుల ( ఈశాన్య భారతం) సంఘర్షణలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మత అస్థిత్వ ఆందోళనలు అధికమయ్యాయి. ఇవి ఎన్నాళ్ళు కొనసాగుతాయో, ఎలా ముగింపు జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి  ఏర్పడింది. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాజిక అశాంతి తో దేశం బలహీనపడే అవకాశాలున్నాయి. దీనికి పరిష్కారం సాధ్యం కాదా? ప్రతి సమస్యకు వెదికితే పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మనకున్న పరిమిత అవగాహనతో  ఈ సమస్యను అవగతం చేసుకొని ఎలా పరిష్కరించుకోవాలో జరిపే మేదోమధనమే ఈ చిన్ని ప్రయత్నం. ఇదేమీ సమగ్రమూ కాదు, ఖచ్చితమూ కాదు. దయచేసి దీన్ని ప్రశాంతంగా , విశాల దృక్పధంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.

మతపరంగా దేశ జనాభా 

2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8 శాతం, ముస్లింలు 14.2 శాతం, క్రైస్తవులు 2.3 శాతం , సిక్కులు 1.7 శాతం , బుద్ధులు 0 .7  శాతం, జైనులు 0 .37 శాతంగా వున్నారు. ఇవి అధికారిక లెక్కలు. కానీ అనధికారికంగా ఈ లెక్కల్లో వాస్తవం లేదు. హిందువులు, క్రైస్తవులు లెక్కల్లో చాలా తేడా వుంది. క్రైస్తవులు వాస్తవానికి ఈ లెక్కల కన్నా చాలా ఎక్కువగానే వున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో  దాదాపు 15 నుంచి 20 శాతం దాకా ఉండొచ్చని ఓ అంచనా. కానీ లెక్కల్లో మాత్రం అక్కడా దేశ సగటుకి దగ్గరగానే చూపిస్తున్నారు. కాబట్టి దేశం మొత్తం మీద చూస్తే క్రైస్తవులు షుమారు 7 నుంచి 8 శాతం దాకా ఉండొచ్చని ఓ అంచనా. ఇంకా ఎక్కువకూడా వున్నా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఆ మేరకు హిందువుల జనాభా శాతం తక్కువవుంటుంది. వీటితో పాటు పార్సీలు వాళ్లమతమైన జొరాస్ట్రియన్ , అలాగే బహాయ్ మతస్తులు కూడా వున్నారు. ఈ రెండు మతాలూ పర్షియా ( ప్రస్తుత ఇరాన్ ) కి సంబంధించినవే. అలాగే యూదులు కూడా పురాతనకాలం నుంచీ ఇక్కడ ఉంటూ వచ్చారు.వీళ్ళందరూ వేధింపులు తట్టుకోలేక భారత్ కు వలస వచ్చారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే  భారత్ మొదట్నుంచీ మత సహనాన్ని , ఇతర మతస్తుల్ని గౌరవిస్తూనే వచ్చింది.

సమస్యకు మూలాలు 

సమస్య కొన్ని శతాబ్దాలనుండి కొనసాగుతున్నా ఆధునిక బ్రిటిష్ భారతం లో 1857 ప్రధమ స్వాతంత్ర సంగ్రామంలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడటం తో కొత్త కోణం ఆవిష్కరించబడింది. అప్పటివరకు విడిపోయిన హిందూ ముస్లిం సమాజాలు ఒక్కటికావటం తో బ్రిటిష్ వారు ఖంగు తిన్నారు. వాళ్ళ ఆధిపత్యం కొనసాగాలంటే సామాజిక విభజన జరగాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1858 లో బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోకి వచ్చినతర్వాత ప్రభుత్వ విధానంగా దీన్ని అమలు చేయటం మొదలుపెట్టారు.  గాంధీజీ స్వాతంత్రోద్యమంలోకి వచ్చి నాయకత్వం వహించిన తర్వాత బ్రిటిష్ వాడిని ఎదురించాలంటే హిందూ ముస్లిం ప్రజల మధ్య ఇక్యతా భావం పెరగాలని భావించాడు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రద్దయిన ఖలీఫా ని పునరుద్ధరించాలని జరిగిన ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్ధించాడు. ఆయనకు చేదోడువాదోడుగా మౌలానా కలాం ఆజాద్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి ముస్లిం నాయకులు అదే ఇక్యతా స్పూర్తిని కొనసాగించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం సమయం కోసం ఎదురుచూస్తూనే వుంది. అదీగాక కాంగ్రెస్ రాను రాను బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని ముమ్మరం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒకరోజు భారత్ విడిచి వెళ్ళక తప్పదని అంచనా వేసింది. అదేసమయం లో వాళ్ళకో సురక్షిత స్థావరం భారత ఉపఖండం లో కావాలని భావించింది. అప్పటికే ‘గ్రేట్ గేమ్’  నడుస్తూవుంది. రష్యా సేనలు భారత సరిహద్దులవరకు విస్తరించటం, పర్షియా జలసంధి లో వారి వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం లాంటి వారి ప్రయోజనాలకోసం సురక్షిత స్థావరం అవసరం ఏర్పడింది. ఆ ఆలోచనే పాకిస్తాన్ ఆవిర్భావానికి పునాదివేసింది. ఆ సూత్రధారి కి పాత్రధారిగా మహమ్మదాలీ జిన్నా ని ముందుకు తీసుకొచ్చారు. నిజానికి పశ్చిమాన ముస్లింలు మెజారిటీ గా వున్న పంజాబ్ , వాయవ్య సరిహద్దు ప్రాంతం లో ముస్లిం లీగ్ కి ప్రజాదరణ లేదు. పంజాబ్ లో అన్ని మతాలతో కూడిన యూనియనిస్టు పార్టీ విభజనకు ముందు అధికారం లో వుంది. వాయవ్య సరిహద్దు ప్రాంతం కాంగ్రెస్ కి కంచుకోట. అంటే ఈ రెండు ప్రధాన ప్రావిన్సుల్లో దేశ విభజన కావాలని ముస్లిం ప్రజానీకం కోరుకోలేదు. పాకిస్తాన్ కావాలని కోరే జిన్నాకు మద్దతిచ్చిన వారు యూనియన్ ప్రావిన్సెస్ ( ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) , బీహార్ తదితర హిందీ ప్రాంతాల్లోనే ఎక్కువగా వుండేవారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మనం ఎదుర్కుంటున్న పశ్చిమ సరిహద్దు సంఘర్షణ మొదట్నుంచీ లేదు. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వటానికి జరిపిన సంప్రదింపుల్లో వ్యూహాత్మకంగా ముస్లింల తరఫున కేవలం జిన్నానే ఎంచుకున్నారు. అప్పటికి తనకు ముస్లింల మద్దత్తు లేదు. చివరకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ని కూడా ముస్లిం ల తరఫున మాట్లాడకుండా జిన్నా విధించిన షరతులకు బ్రిటిష్ ప్రభుత్వం తలాడించింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితులు సృష్టించి విభజన చేయటం లో బ్రిటిష్ సూత్రధారి అనేది నిర్వివాదాంశం. అలాగే కాశ్మీర్ కూడా పాకిస్తాన్ లో కలవాలనే బ్రిటిష్ కోరుకుంది. అందుకనే మౌంట్ బాటన్ స్వయంగా శ్రీనగర్ వెళ్లి మహారాజు కి సలహా కూడా ఇచ్చాడు. కాశ్మీర్ ఉత్తర ప్రాంతాలైన గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని బ్రిటిష్ అధికార్ల సాయం తోనే ముందుగానే పాకిస్తాన్ లో కలిపేశారు. కాబట్టి ఈ సమస్యకు మూలాలు విభజన లోనే వున్నాయి. బ్రిటిష్ వాడు రగిలించిన అగ్గి ఇంకా రాజుకుంటూనే వుంది.

మరి ఇప్పుడు సమస్య ఎందుకొచ్చింది?

స్వాతంత్రానంతర భారతం లో అందరూ కలిసి పోయే వాతావరణాన్ని రాజకీయనాయకత్వం కలిగించలేకపోవటం పెద్ద వైఫల్యం గా చెప్పొచ్చు. ప్రభుత్వ చట్టాలు తరతమ భేదం లేకుండా అందరికీ వర్తించాల్సిందిపోయి ప్రతిదీ రాజకీయం చేయటం కూడా ఒక కారణం. ఎక్కువకాలం అధికారం లో వున్న పార్టీ ఈ గుర్తింపు రాజకీయాలకు ఆదిలోనే ముగింపు పలకాల్సింది పోయి గుర్తింపు రాజకీయాల్ని మరింత ప్రోత్సహించటం తో మెజారిటీ హిందువుల్లో క్రమ క్రమేణా తమకు అన్యాయం జరుగుతుందనే భావన పెంపొందటం చివరకు హిందువులు కూడా ప్రత్యేకంగా సమీకరించబడటం జరిగింది. అవి పెరిగి పెద్దవై ఇరువైపులా గుర్తింపు సమీకరణలు జరగటం ఈ ఘర్షణ వాతావరణానికి కారణమయ్యింది. దీనికి కొన్ని ఘటనలు ఆజ్యం పోశాయి.

1984 లో జరిగిన ఇందిరా గాంధీ హత్య తర్వాత భావోద్రేకంతో మైనారిటీ సిక్కులను ఊచకోత కోయటం ప్రధాన మత ఘర్షణగా చెప్పొచ్చు. ఇందులో చనిపోయిన వేలాదిమంది సిక్కులకు హత్యతో సంబంధం లేకపోయినా వాళ్ళు ఆ మతం లో పుట్టటమే వాళ్ళు చేసిన శాపం. రెండోది, 1989 – 90 లలో జరిగిన కాశ్మీరీ పండిట్ల ఊచకోత, బలవంతపు గెంటివేత. దీనికి కారణం పాకిస్తానీ ప్రేరేపిత కాశ్మీర్ ఉద్యమం, 1988 రాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి రిగ్గింగ్ చేయటం . ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడినట్లు ప్రకటించటంతో అప్పటికే పాకిస్తాన్ అనుకూల ప్రభావం లో వున్న అనేకమంది తీవ్రవాదం వైపు మొగ్గు చూపటం జరిగింది. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, హరియత్ లాంటి సంస్థలు స్థాపించినవారిలో ఎక్కువమంది ఆ ఎన్నికల్లో పోటీ చేసి మోసగించబడ్డ వారే. ఆ కోపం మత ప్రక్షాళన పేరుతో కాశ్మీరీ హిందువులపైకి మళ్ళింది. దాని ఫలితమే హిందువులను చంపటం, ఏరివేయటం. ఈ రెండు సంఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖాత్ కావటం మత సమీకరణలు పెరగటానికి దోహదం చేశాయి. హిందువులు క్రమ క్రమేణా తమ అస్తిత్వం పేరుతో బిజెపి గొడుగున సమీకరించ బడ్డారు. హిందువులకు అత్యంత పవిత్రమైన రామ జన్మభూమి ని తిరిగి ఇచ్చివేయాలనే ఆందోళన ఇరుసుగా ఈ సమీకరణ జరిగింది. చివరకు స్వాతంత్రానంతర అతి పెద్ద మత ఘర్షణ గా మారి బాబ్రి మసీదు కూల్చివేతకు దారితీసింది. 2001 లో జరిగిన ఘటనలు ఈ ఘర్షణలను శాశ్వతం చేశాయి. అయోధ్యను దర్శించి తిరిగివస్తున్న కరసేవకులను గోధ్రా లో రైల్ బోగీకి తాళం వేసి సజీవ దహనం చేయటం తో గుజరాత్ లో భావోద్రేకాలు పెచ్చరిల్లి వేలమంది ముస్లింలు ఊచకోత కు గురికాబడ్డారు. తిరిగి ప్రతీకారం తో కొంతమంది హిందువులు కూడా హత్య కావించబడ్డారు. ఇది అన్ని సంఘటనల్లో అతి పెద్దది, ఘోరమైనది. అక్కడనుండి ఈ మత సమీకరణ నిత్య యవ్వనంగా కొనసాగుతూనేవుంది. మధ్య మధ్య లో ఆటవిడుపులు వున్నా కరోనా మహమ్మారి లాగా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తూనే వుంది.

సమీకరణలో రాజకీయ పార్టీల పాత్ర 

ఈ సమీకరణల్లో మత ఛాందసవాసులు పైచేయి సాధించారు. ఉదాహరణకు ముస్లిం మహిళల విడాకుల భరణం విషయం లో  షాబాను వేసిన కేసులో సుప్రీం కోర్టు తీర్పుపెద్ద వివాదాన్ని సృష్టించింది. ముస్లిం మత పెద్దలందరూ కలిసి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో తీర్పుని కాలరాయటానికి కొత్త చట్టాన్నే తీసుకురాగలిగారు. దీనితో విభేదించిన మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తన మంత్రి పదవి కి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. దురదృష్టవశాత్తూ ఇటువంటి సంతుష్టీకరణ చర్యలు అనేకం కాంగ్రెస్ హయాం లో జరిగాయి. ఈ  సంఘటనలు ముస్లిం సమాజం లో సంస్కరణలు కాక్షించే వర్గాలను నీరుకార్చి మత చాందసవాదులకు ఊతమిచ్చింది.

ఓ విధంగా ఈ సంతుష్టీకరణ చర్యలే హిందువుల్లో నానాటికీ బిజెపి బలపడటానికి కారణమయ్యింది. బిజెపి ప్రధానంగా హిందువుల పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే బిజెపి జన సంఘ్ లాగా కేవలం అగ్రవర్ణాల పార్టీగా కాకుండా హిందువుల్లోని అన్ని వర్ణాలను ఆకర్షించ గలిగింది. జనతా పార్టీ నుంచి విడిపోయిన తర్వాత తన స్వరూపాన్ని మార్చుకొని అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. ముస్లిం లలో కూడా ఒకవర్గాన్ని, ముఖ్యంగా మహిళలను తనలో చేర్చుకోవటానికి ప్రయత్నం చేసింది. అదేసమయం లో హిందూ సమీకరణ నే తన ఇరుసుగా ఉంచుకుంది. ఆ విధంగా పశ్చిమ, ఉత్తర భారతం లో హిందువుల్లో స్థానం సంపాదించి హిందూ సమీకరణ వేదిక గా ఎదిగింది. అధికారం లోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించటానికి ప్రయత్నం చేస్తూ వుంది.

అదేసమయంలో ముస్లిం లు ఒక పార్టీగా ఎదగకపోయినా ముస్లిం అనుకూల , బిజెపి వ్యతిరేక దృక్పధం ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ వైపు రాష్ట్రం ప్రాతిపదికగా సమీకరించబడ్డారు. కాబట్టి సమాజం రాను రాను మత సమీకరణ దిశగా మార్పు చెందింది. సమాజం ఈ విధంగా తయారు కావటానికి రాజకీయ పార్టీల అవకాశవాదం, వైఫల్యం కారణంగా చెప్పొచ్చు. మరి ఇది ఇలా కొనసాగవలసిందేనా ? దీనికి పరిష్కారం లేదా? మత సామరస్యం నీటి మూటేనా? మతం గుర్తింపుతో కాకుండా మానవత్వంతో సంబంధాలు అభివృద్ధి అయ్యే అవకాశాలు లేవా? 21 వ శతాబ్దం లోనూ , కరోనా మహమ్మారి మానవ వినాశనాన్ని చూసిన  తర్వాత కూడా ఈ గుర్తింపు సమీకరణాల కోరలనుంచి బయటపడలేమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే భాగం లో పరిశీలిద్దాం.

( సశేషం)
Also Read:  మత సామరస్యం సాధ్యమేనా? (Part 2)

మనవరాలితో టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కడివారక్కడే గప్ చుప్ అయ్యారు. రాజు, పేద తేడా లేకుండా ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితయ్యారు. కొందరు సెలబ్రెటీలు రకరకాల ఛాలెంజ్ లతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరమే తమకు దొరికిన ఈ సమయానికి ఫ్యామిలీకి కేటాయిస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వారికి దొరికిన కొద్దిపాటి సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుకు మెగ్గుచూపుతున్నారు.

నిత్యం ప్రజా సేవలో బీజీగా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మనువరాలు తన్వీతో టెబుల్ టెన్నీస్ ఆడి సేదతీరారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ సాధారణంగా తనకు ఫ్యామిలీతో గడిపేందుకు తీరిక దొరకదని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తనకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని తన మనువరాలతో కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు తన మనవరాలు తన్వీతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ సడలించే వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరూ బయటి రావొద్దని కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. కాగా మంత్రి తన మనవరాలితో టెబుల్ టెన్నిస్ ఆడుతున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆరంజ్ జోన్లలో కూడా ర్యాపిడ్ టెస్టులు!

Telangana


తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతలల్లోనే కాకుండా తక్కువగా ఉన్న ఆరెంజ్ జోన్ జిల్లాల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించే విధంగా కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు తెలంగాణలోని నల్గొండ, జనగామ, వికారాబాద్‌ ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఐసీఎంఆర్ అధికారులు నేడు రాష్ట్రానికి వచ్చారు.

నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 549 మందిని పరీక్షించగా 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ పరిణామాల మధ్య జిల్లాలో మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ ర్యాపిడ్ టెస్టులో భాగంగా ఒక్కో క్లస్టర్ నుంచి 400ల నమూనాలను సేకరిస్తారు. అనంతరం 3 నెలల పాటు ప్రతి నెల 400 మంది నమూనాలను పరీక్షిస్తారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఎప్పటికప్పుడు టెస్టులు చేయడం ఒక్కటే ఏకైన మార్గమని కేంద్రం భావిస్తోంది.

జర్నలిస్టులారా.. ఇకనైనా మారండి..


‘ఎలా బతుకుడు.. ఎక్కడ బతుకుడు తెలంగాణ జిల్లాల్లోనా?’ అంటూ తెలంగాణలోని వలసల తీవ్రతను కళ్లకు కట్టేలా అప్పట్లో ఓ సినీ కవి నుంచి వచ్చిన గీతం అందరినీ కంటతడిపెట్టించింది. కానీ దేవుడి దయ.. పాలకుల మంచి పాలనతో ప్రస్తుతానికి తెలంగాణలో వలసలు తగ్గి స్వావలంభన వచ్చేసింది. కానీ కరోనా కాటుతో ఇప్పుడు మళ్లీ మునుపటి పరిస్థితి దాపురిస్తోంది. అందరిలోనూ ధీమా ఉంది. కానీ సమాజానికి పత్రికల ద్వారా దిశానిర్ధేశం చేసే జర్నలిస్టుల పరిస్థితే అగమ్య గోచరంగా తయారైంది.

*యాజమాన్యాల కుట్రలకు బలైపోవాల్సిందేనా?
ఎప్పటి నుంచో కాలదన్నడానికి రెడీ అయిన మీడియా యాజమాన్యాలకు ఇప్పుడు సందు దొరికింది. ఏడాది కిందటే సార్వత్రిక ఎన్నికలు.. మొన్నటికి మొన్న జరిగిన పంచాయితీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో గల్లాపెట్టే నింపుకున్న పత్రికా యజమాన్యాలు.. కరోనా లాక్ డౌన్ వచ్చి పట్టుమని పదిరోజులు కాకముందే నష్టాల పేరుతో జర్నలిస్టును సాగనంపాయి. అందరి గురించి ఆలోచించే జర్నలిస్టులనే రోడ్డున పడేశాయి. సమాజంలోని అన్ని వర్గాల గురించి ప్రభుత్వాలు, ప్రజలు, సంఘాలు ఆలోచిస్తాయి. కానీ ఉద్యోగాలు కోల్పోయి బతుకుజీవుడా అని అర్థాకలితో చస్తున్న జర్నలిస్టులను అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు.. చివరకు జర్నలిస్టులతో పుట్టిన జర్నలిస్టు సంఘాలు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

*నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?
కరోనాతో వచ్చిన లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఉద్యోగ ఉపాధి పోయింది. కానీ ఇన్నేళ్లుగా కోట్లు మింగిన పత్రికలు, మీడియాలు కనీసం ఒక్క నెల కూడా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో జీతం ఇవ్వలేని స్థితికి దిగజారాయా అన్నది ఇక్కడ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కరోనా ఊడిపడ్డది.. అదో ప్రకృతి విపత్తు. నేరం ఎవరిదో.. కానీ ఇప్పుడు శిక్ష మాత్రం జర్నలిస్టులకు పడింది. పనిచేస్తున్న వారి జీతాలకు కోత పడింది.. రోడ్డునపడ్డ ఎందరో జీవితాలకు కోతపడింది.

*ఎన్నాళ్లీ బానిస బతుకులు?
పేరుకే జర్నలిస్టు.. బయట ఎంతో పేరు. కానీ ఒక ఉపాధి కూలీ సంపాదించినంత కూడా సంపాదన లేని దైన్యం. పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉంది నేటి జర్నలిస్టు పరిస్థితి. బయటకు సమాజంలో గుర్తింపు ఉన్న కుటుంబంలో అతడు తెచ్చే సంపాదన చూసిన వారికి ఖచ్చితంగా చులకనే.. 20 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న వాళ్లకు కూడా నేడు 20వేల రూపాయల జీతం అందుకోని పరిస్థితి. కరోనాలాంటి ఏ విపత్తు వచ్చినా చివరకు రోడ్డున పడేది వారే.. మరి ఎన్నాళ్లీ బానిస బతుకులు.. ఎన్నాళ్లీ ఆకలి చావులు? దీనికి అంతం లేదా? జర్నలిస్టుల జీవితాలను ఎవరు ఉద్దరిస్తారు? ఎవరూ ఉద్దరించన్న వాస్తవాన్ని జర్నలిస్టులు మిత్రులు తెలుసుకోవాలి? ఎవరికి వారు ఈ బానిసవృత్తిని వదిలి కొంత కాంతిరేఖలపై పయణించాల్సిన అవసరం ఉంది.

*మేలుకోండి జర్నలిస్టులారా?
జర్నలిస్టులు రోడ్డున పడ్డ ప్రతీసారి అందరూ సోషల్ మీడియాలో.. వెబ్ సైట్లలో వారి ఆవేదనను అక్షరబద్దం చేస్తున్నారు. శ్రీశ్రీని మించి కలం రచనలతో కరిగిస్తున్నారు. కానీ పత్రికా యాజమాన్యాలు కానీ.. ప్రభుత్వాలు కానీ జర్నలిస్టుల విషయంలో కరిగిన పాపాన పోవడం లేదు. మరి ఏం చేయాలి? అంటే మేలుకోవాలి? కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. కుటుంబాలను కాపాడుకోవాలని.. ఆత్మస్థైర్యంతో ఈ పత్రిక యాజమాన్యాల కుల్లు కుతంత్రాలకు బలికాకుండా ఇప్పటికైనా తమలోని సృజనాత్మకథను జర్నలిజం టాలెంట్ ను ఉపయోగించుకొని పైకి రావాల్సిన అవసరం ఉంది. పత్రికలు, న్యూస్ చానెల్స్ కంటే డిజిటల్ రంగంవైపు అడుగులు వేస్తే వారి జీవితాలు కొత్త ఉపాధిని వెతుక్కున్నట్టవుతుంది. కరోనాతో పత్రికలు, న్యూస్ చానెల్స్ కు ఆదరణ తగ్గింది. అందరూ వాటిని మరిచిపోయి డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని సంపాదించిన జర్నలిస్టులు మిత్రులు.. బాగా రాయగలిగే వాళ్లు ఈ కొత్త ఉపాధి వైపు మళ్లండి.. యూట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్ రాయడం మొదలుపెట్టండి. ఇక ఈ డిజిటల్ ప్రపంచంలో రిలయన్స్ నుంచి మొదలుపెడితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్నో దిగ్గజ సంస్థలు కూడా తెలుగులో వెబ్ సైట్స్ డిజిటిల్ ఫ్లాట్ ఫామ్స్ ఓపెన్ చేశాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి.. పేరుకు పేరు.. గౌరవానికి గౌరవం. శ్రమకు తగిన వేతనం… మీకు మీరే రాజులు.. ఇలా పత్రికలు, చానెల్స్ కుట్రలకు కుతంత్రాలకు మీడియా మిత్రులు తెరదించాల్సిన అవసరం ఉంది.

*ఏకం కాలేరా?
తెలంగాణలోని ప్రధాన రెండు పత్రికల్లో నంబర్ 1 పత్రిక అందరికీ లీవుల పేరిట ఇంటికి పంపింది. రెండో ప్రధాన పత్రిక మాత్రం హోల్డ్ పేరిట అందరినీ ఇంట్లో కూర్చండబెట్టింది. జీతం కూడా సరిగా ఇవ్వలేదు. దాదాపు 150 మంది జర్నలిస్టులను ఆ దమ్మున్న పత్రిక నిర్ధాక్షిణ్యంగా తీసేసిందని మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి ప్రజల ఆందోళనలు, ఆవేశాలను, ప్రభుత్వాలను పత్రికల్లో రాతల ద్వారా నిలదీసే మీరే ఏకం కాలేరా? మీ సమస్యలపై మీరు పోరాడలేరా? అందుకే తీసేసిన జర్నలిస్టులందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలపై చర్చించాలి.? కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపుగా మారాలి. ఇంతమంది జర్నలిస్టులకు ప్రపంచం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఐకమత్యంతో ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఎన్నో సంస్థలు జర్నలిస్టుల కొరతతో ఉంటున్నాయి. ఇలాంటి గ్రూపు ఒకటి ఉంటే వారే సంప్రదిస్తారు. వారి అనుభవానికి పెద్ద పీట వేస్తారు.. తగిన ఉపాధి.. జీతం.. జీవితం కల్పిస్తారు.. మరి ఇప్పటికైనా జర్నలిస్టుల మేల్కోండి.. అందరూ ఏకమై మీ సమస్యలను తరిమికొట్టండి.. గుర్తుంచుకోండి.. టాలెంట్ ఉన్నోడిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు.. ఆల్ ది బెస్ట్..

— నరేష్ ఎన్నం

Riya Suman Latest Photo Stills

ఆకలేస్తే.. అన్నం పెడతాం: కవిత


హైదరబాద్ నగరంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈమేరకు ఎవరైనా ఆకలి ఉంటే 040- 21111111 ఫోన్‌ నెంబరును సంప్రదించాలని సూచించారు. అన్నార్థుల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు. హ్యాష్‌ ట్యాగ్‌తో #040-21111111 ఫోన్ నెంబర్ ను తన ట్వీటర్లో షేర్ చేశారు. ఈ నెంబరును వీలైనంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆమె కోరారు.

హైదరాబాద్ నగరంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ లాక్డౌన్ సమయంలో జీహెచ్‌ఎంసీతోపాటు తొమ్మిది కార్పొరేషన్లలో 300అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజు రెండు లక్షల మందికి భోజనం పెడుతున్నట్లు ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. వీటి ద్వారా అన్నార్థులకు రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల కూడా ఇంకో 50 అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతం ఈ కేంద్రాలు మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేసేవని తెలిపారు. ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాలు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5గంటలకు భోజనం అందించేలా వేళలు మార్చినట్లు తెలిపారు. ఇది చాలా మంచి కార్యక్రమని నటి మంచు లక్ష్మీతో పాటు పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కవితను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు.

సీఎం సహాయనిధికి మరికొన్ని విరాళాలు!

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం పలువురు విరాళాలు అందించారు.

మధుకాన్‌ షుగర్‌ అండ్‌ పవర్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.1.50కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్క్‌లను అందించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు కూడా తమవంతు సహాయం అందించారు. టీఎస్‌పీఎస్పీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు కలిసి సీఎం సహాయనిధికి రూ.1.25లక్షల విరాళం చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పలు సంస్థల ప్రతినిధులు కూడా కేటీఆర్‌ను కలిసి విరాళం చెక్కులను అందించారు.  హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ సంస్థ రూ.48లక్షల విలువగల 200 హోండా హై ప్రెషర్‌ బ్యాక్‌ప్యాక్‌ స్ప్రేయర్స్‌ను విరాళంగా అందజేసింది. వీటి సాయంతో బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయొచ్చు. రూ.73లక్షల విలువైన 5000 శానిటైజర్లు, నాలుగు లక్షల మాస్క్‌లను ఈస్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వానికి అందించినందుకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

మహారాష్ట్రలో జూన్ వరకు లాక్ డౌన్


దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో దాదాపు నాలుగోవంతు గల మహారాష్ట్రలో జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి బాగా ఉంది.

దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపు పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ మహారాష్ట్ర మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ ఉదృతి ఇలా కొన‌సాగితే లాక్ డౌన్ ను జూన్ చివరి నాటికి పొడగించే అవ‌కాశ‌మున్న‌ద‌ని అధికార వర్గాలు సంకేతం ఇస్తున్నాయి.

ఇందుకుగాను మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లాక్‌డౌన్ పొడ‌గించ‌కుంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ అమలులోనూ మరింత కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి రోజు సగటున 200 కేసులు ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో మహారాష్ట్రలో 394 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 18మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817కు చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 301కి చేరింది.

ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముంబయిలో ఏకంగా 4,447 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు ముంబయిలోనే ఉన్నాయి.

స్పీకర్ వ్యాఖ్యలపై సీఎం సమాధానం చెప్పాలి..!


స్పీక‌ర్ వ్యాఖ్యల‌పై ముఖ్యమంత్రి స‌మాధానం చెప్పాలని టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. సాక్షాత్తు స్పీక‌ర్ ఇంతటి వ్యాఖ్యలు చేశారంటే ప‌రిస్థితి ఎంత ఘోరంగో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చన్నారు. అక్రమ మ‌ద్యం అమ్మకాలు జ‌రిపిన వైకాపా నాయ‌కుల‌పై చ‌ర్యలు తీసుకోవాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి నైతిక బాధ్యత వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు క్షమాప‌ణ‌లు చెప్పి రాజీనామా చేయాలన్నారు. ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన పాలు, నీళ్లు దిర‌క‌డం క‌ష్టమైంది గాని మ‌ద్యం మాత్రం వాలెంటీర్ల ద్వారా డోర్ డెలివ‌రీ చేస్తున్నారని విమర్శించారు.

మ‌ద్యం దుకాణాలు ఖాళీ అవుతుంటే కేసులు పెట్టకుండా జ‌రిమానాల‌తో స‌రిపెడుతున్నారని, మ‌ద్యం అమ్మకాలు వైకాపా నాయ‌కుల ప్రధాన ఆదాయ వ‌న‌రుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దుశ్చర్యలకు అత్యవసర సేవలు అంధించే వారు బలవుతున్నారని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు క‌రోనాను ఏ విధంగా త‌గ్గించి త‌మ ప్రజ‌ల‌ను ఎలా కాపాడుకోవాల‌ని చూస్తుంటే ఏపీలో జ‌గ‌న్ మాత్రం తుగ్లక్ చర్యలతో రాజ‌కీయం, దోచుకోవ‌డం, దాచుకోవ‌డం వంటి వాటి కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులు త‌మ ప్రజ‌ల కోసం గ్రౌండ్ లెవ‌ల్ లో ప‌ని చేస్తూ తమ ప్రజ‌ల‌కు ధైర్యాన్ని అందిస్తుంటే జ‌గ‌న్ మాత్రం తాడేప‌ల్లికే ప‌రిమితం అయ్యి ప‌బ్జి ఆడుకోవ‌డం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బాధితుల్లో 30 శాతం మంది అధికారులు, డాక్టర్లల‌తో పాటు అత్యవ‌స‌ర సేవ‌లు అందిస్తున్న వారే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమని అన్నారు. స‌దుపాయాలు క‌ల్పించ‌మ‌ని ప్రశ్నిస్తున్న డాక్టర్లను, అధికారుల‌ను స‌స్పెండ్ చేశారు. నేడు స‌దుపాయాలు లేక వైర‌స్ బారిన ప‌డుతున్నందుకు జ‌గ‌న్ ప్రభుత్వాన్ని స‌స్పెండ్ చేయాలా అని ప్రశ్నించారు.

డాక్టర్లు, పోలీసులు, అధికారులు, పార‌శుద్ధ్య కార్మికుల‌కు క‌నీస స‌దుపాయాలు క‌ల్పించ‌క వారి ప్రాణాల‌తో వైకాపా ప్రభుత్వం ఆట‌లాడుతూ రాజ‌కీయం చేయ‌డం దౌర్బాగ్యమన్నారు.

లాక్ డౌన్ కారణంగా విపత్కర పరిస్తితులు ఎదోర్కొంటూ కూటికోసం, కూలికోసం రోడ్డున పడినవారి కష్టాలు తీర్చేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖ‌ర్చు చేయ‌లేదన్నారు. పట్టింపులు, పంతాలను ప‌క్కన పెట్టి అన్యా క్యాంటీన్లను తెరిచి అభాగ్యుల ఆకలి తీర్చే భాద్యత ప్రభుత్వం చేపట్టాలని కోరారు. జ‌గ‌న్ కు ముందు చూపు లేక‌పోవ‌డంతో ప్రజ‌లు అష్టక‌ష్టాలు ప‌డుతున్నారని చెప్పారు. ప్రతి శుక్రవారం తన అక్రమాస్తుల పై సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్తున్న జగన్ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులపై బులిటెన్ లో ఒకలా, రిపోర్ట్ లో మరొకలా తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయ‌కులకు మితిమీరిన‌ ప్రచార పిచ్చి వ‌ల‌న నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయని, జగన్ కి, వైసీపీ నేతలకు అబద్ధాలు, అవాస్తవాలు చెప్పటం తప్ప నిజాలు చెప్పటం తెలీదన్నారు.

4 వారాల వరకు రాష్ట్రం లోకి కరోనా వైరస్ రాదని ఎన్నికలు నిర్వహించమని జగన్ సీఎస్ చేత లేఖ రాయించారని, కానీ లేఖ రాసి 4 వారాలు కూడా గడవక ముందే రాష్ట్రంలో 8 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సిఎస్ లేఖ ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే పరిస్థితి ఏంటిని ప్రశ్నించారు. రాష్ట్రం మారో ఇటలీ అయ్యేదన్నారు. దీనికి బాధ్యత ఎవరిది.. లేఖ రాయించిన జగన్ దా లేక రాసిన సీఎస్ దా అనేది చెప్పాలని కోరారు. జగన్ కి ఎన్నికల మీదే దృష్టి తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదన్నారు.

వాలంటీర్లపై వేధింపులు ఎందుకు: బాబు


ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికి అని చెప్పి వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం వాలంటీర్లను వైసీపీ, ఆ పార్టీ నాయకులు కోసం నియమించిందా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజాధనంతో వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ‘కరోనా’ ప్రత్యేక సాయం కింద ఇచ్చే రూ.1000 రూపాయలను వైసీపీ నాయకులు అందజేయడమేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ శనివారం ట్విట్ చేశారు.

సాయం పంపిణీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటవినని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీకోసమా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారని తెలిపారు. ఇటువంటి చర్యలు తగవన్నారు.
గ్రామ వాలంటీరు గోపిశెట్టి ఝాన్సీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వాలంటీర్లపై ఇటువంటి వేధింపులు ఎందుకన్నారు. ప్రజల డబ్బుతో వాలంటీర్లను పెట్టుకుంది వైసీపీ నాయకులకు వంగి వంగి దండాలు పెట్టడానికా అని ప్రశ్నించారు.

మహానాడుకు ముందే టీడీపీకి షాక్..!


తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమానికి ముందు ఊహించని షాక్ తగిలింది. ఈ షాక్ నుంచి ఆ పార్టీ కోలుకోవడం కష్టమే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇస్తే, ఏడాది అనంతరం ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావులు వైసీపీలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది.

కోస్తా జిల్లాల్లో ముఖ్యమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం నాలుగురు ఎమ్మెల్యేలు టిడిపి నుంచి గెలవగా వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడంతో టిడిపి నేతల్లో గందరగోళం మొదలయ్యింది. గతంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అధికారికంగా చేరక పోయినా వైసీపీ అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని వైసీపీ చేరడంతో గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీకి టీడీపీ తరుపున ప్రాతినిధ్యం వహించే వారే కరువయ్యారు. కృష్ణా నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాత్రం పార్టీ మారే అవకాశాలు లేవని సమాచారం.

ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా పార్టీ వారిని నిలబెట్టుకోలేక పోయింది. టీడీపీ సీనియర్ నేతగా పేరున్న కారణం బలరామకృష్ణ మూర్తి టీడీపీని వదలి రెండు నెలల కిందట వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి కుమార్ లు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బె తగిలింది. జిల్లాలో ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.

వైసీపీ అధికారం చేపట్టిన అనంతరం తొలి శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, తనకు నిబద్ధత ఉంది గనుక రాజీనామా చేసి రావాలని సూచించానని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అందుకే టిటీడీపీకి దేవుడు 23 సీట్లే ఇచ్చాడని సభలో జరిగిన చర్చలో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సీఎం చెప్పిన విధంగానే ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఒక్కొక్కరిగా క్యూ కట్టారు.

హీరో సూర్య ను బ్యాన్ చేస్తామని వార్నింగ్!


కరోనా ఎంట్రీతో దేశంలో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగులు వాయిదాపడగా థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటు కార్మికులంతా ఇళ్లకే పరిమితయ్యారు. థియేటర్లు మూతపడినప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాంలో సినిమాలు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. దీంతో తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతిక నటించిన ‘పోంమగళ్ వందాల’ చిత్రాన్ని డిజిటల్ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్, థియేటర్ నిర్వహాకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం అన్నారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. లాక్డౌన్ వల్ల థియేటర్స్ మూసివెయ్య‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య్య‌ర్స్, థియేట‌ర్స్ నిర్వాహ‌కులు తీవ్ర గ‌డ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సూర్య నిర్మించిన చిత్రం ‘పోంమగళ్ వందాల’ డైరెక్టుగా ఓటీటీలో విడుదల కావడాన్ని తమంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

ఇలా చేయడం వల్ల థియేటర్లు మూసివేసే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హీరో సూర్య తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలన్నీ థియేటర్లలో బ్యాన్ చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఓటీటీలో సినిమాల విడుదల విషయం ప్రస్తుతం తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టిస్తుంది.

స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..!


శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం విశేషం. రాష్ట్రంలో మద్యం, నాటు సారా విక్రయాలపై ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు

మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ శాఖ విఫలం అయ్యిందన్నారు. ఈ అంశాన్ని సీఎంతో స్వయంగా చెప్పాలనుకున్నానని, కుదరక పోవడంతో మీడియా ద్వారా చెబుతున్నానని తెలిపారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ఎం చేస్తోంది.. నిద్రపోతుందా అంటూ విరుచుకుపడ్డారు. గతంతో తనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు.

అక్రమంగా మద్యం, నాటు సారా విక్రయాలు చేస్తూ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు, లక్షాధికారులు అయిపోతున్నారని చెప్పారు. గంజాయి, గుట్కాల విక్రయాలు ఎక్కడపడితే అక్కడ జోరుగా సాగుతున్నాయన్నారు. ఇటీవల ఆముదాలవలసలో ఒక గది నిండా గుట్కా లు, గంజాయి లభించిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ మాఫియాను ఇదే విధంగా వదిలేస్తే ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి చేరుకుంటాయని తెలిపారు. ఎప్పటికైనా అక్రమ మద్యం, గంజాయి, గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఎమ్మెల్యే హరిప్రియ కాన్వాయ్ కు ప్రమాదం


ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హరిప్రియ శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపేట గ్రామంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే కాన్వాయ్ లో బయలుదేరారు. అయితే ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు బైక్ లో వెళుతున్న పోలీసులను ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బయ్యారం సీఐ రమేష్ తోపాటు గన్మెన్ రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మిర్యాలపెంట గ్రామం ఏజెన్సీ కావడంతో బందోబస్తులో భాగంగా బయ్యారం సీఐ రమేష్, మరికొందరు ఎమ్మెల్యే వెంట వెళ్లారు. అయితే కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు ద్విచక్రవాహనంపై సీఐ రమేష్, గన్ మెన్ వెళుతున్నారు. ఈక్రమంలోనే ఇసుకమేది మూలమలుపు వద్ద అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంసీఐ రమేష్, గన్ మెన్ రామకృష్ణలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే అత్యవసర చికిత్స కోసం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల జడ్పీచైర్మన్లు కోరం కనకయ్య, అంగోతు బిందు, ఇల్లందు డీఎస్పీలు రామకోటి, రవీందర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేసీఆర్ కు చురకలంటించిన విజయశాంతి


తెలంగాణలోని గాంధీ ఆస్పత్రి కంటే జైలే బెటరని అంటున్న ఎంఐఏ నేత అక్బరుద్దీన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి శాపనార్థాలు పెడుతాడో వేచిచూడాల్సిందేనని కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి అన్నారు. ఈమేరకు విజయశాంతి తనదైన శైలిలో కేసీఆర్ కు ఫేసు బుక్కులో చురకలాంటించారు. గతంలో ‘వైద్యుల రక్షణేది.. అందని పీపీఈ కిట్లు’ అంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ఓ ప్రతిక యజమానికి కరోనా సోకాలని కేసీఆర్ శాపనార్థాలు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే తాజాగా టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ గాంధీ ఆస్పత్రిలోని సదుపాయాలను సంచనల వ్యాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీకి కరోనా సోకాలని శాపనార్థాలు పెడుతారా? అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ గారి శాపనార్థాలు తెలియకపోవడంతో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక తాము, కేసీఆర్ గారు ఒకటే గానుకు తమకు ముఖ్యమంత్రి శాపనార్థాలు పెట్టబోరనే ధీమాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఆమె అన్నారు. లేదా తాము శాపనార్థాలు అతీతులం కాబట్టి అక్బరుద్దీన్ తెలంగాణలోని ఆస్పత్రుల గురించి మాట్లాడి ఉండొచ్చని ఆమె అన్నారు. అయితే కేసీఆర్ శాపనార్థాలు గురించి తెలిసిన ప్రజలు మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలాంటి శాపనార్థాలు పెడుతారోనని భయపడిపోతున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరోనా శాపం పెడుతారా? లేక మిత్రపక్షం నేత కాబట్టి సర్దుకుపోతారా? అని భవిష్యత్ తేలనుందని ఆమె విమర్శించారు.

విదేశంలో వలస కూలీల వేదన వర్ణనాతీతం!

ఉపాధి కోసం సొంత ఊరు వదిలి విదేశం వెళ్లిన వలస కార్మికుల వేదన ఇప్పుడు వర్ణనాతీతం. దేశం కాని దేశంలో పనిలేక పరాయి పంచన ఉండలేక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.

తాజాగా దుబాయి నుండి వలస కార్మికులు పంపిన ఒక వీడియో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అంజుమాన్ క్యాంపులో ఉన్న తెలంగాణ వారికి కరోనా సోకిందని ఆ వీడియోలో తెలిపారు. బెల్ హసా కంపెనీలో వలస కార్మికులుగా తెలంగాణ, కేరళ, పాకిస్తాన్‌ కు చెందినవారు పని చేస్తున్నారు.

రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందినవారు 80 మంది అక్కడ పని చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేరళలోని మలబార్ కు చెందిన వారితో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 10 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వారిని అంజుమాన్ ప్రాంతంలోని కార్మికుల క్యాంప్‌ లో రెండు గదులకు (హోం క్వారంటైన్) పరిమితి చేసింది యజమాన్యం. వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత వారిని ఇతర కార్మికులు ఉపయోగించే కిచెన్, బాత్రూమ్‌లను వాడుకునేలా చేసింది. అయితే, మిగిలినవారికి కరోనా పరీక్షలు నిర్వహించలేదని వారు వాట్సప్‌ ద్వారా సమాచారాన్ని పంపారు.

పనులు చేస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని కంపెనీ పేచీ పెట్టిందని బాధితులు వీడియోలో వాపోతున్నారు. క్యాంప్‌ లో ఇరుకు గదుల్లో ఉన్న మిగిలినవారి పరిస్థితి దారుణంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశాంగ శాఖ ద్వారా తమను అదుకోవాలని కోరుతూ బాధితులు అక్కడ నెలకొన్న పరిస్థితిని వీడియో తీసి పంపించారు.