
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హరిప్రియ శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపేట గ్రామంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే కాన్వాయ్ లో బయలుదేరారు. అయితే ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు బైక్ లో వెళుతున్న పోలీసులను ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బయ్యారం సీఐ రమేష్ తోపాటు గన్మెన్ రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మిర్యాలపెంట గ్రామం ఏజెన్సీ కావడంతో బందోబస్తులో భాగంగా బయ్యారం సీఐ రమేష్, మరికొందరు ఎమ్మెల్యే వెంట వెళ్లారు. అయితే కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు ద్విచక్రవాహనంపై సీఐ రమేష్, గన్ మెన్ వెళుతున్నారు. ఈక్రమంలోనే ఇసుకమేది మూలమలుపు వద్ద అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంసీఐ రమేష్, గన్ మెన్ రామకృష్ణలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే అత్యవసర చికిత్స కోసం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల జడ్పీచైర్మన్లు కోరం కనకయ్య, అంగోతు బిందు, ఇల్లందు డీఎస్పీలు రామకోటి, రవీందర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.