Home Blog Page 8490

లాక్‌డౌన్ వ్యవహారం ఇక రాష్ట్రాలదే…

కేంద్రం ప్రకటించిన దేశ వ్యపేత లాక్‌డౌన్ మూడవ దశ ఆదివారంతో ముగియనున్నది. దీనిని మరింకా కొనసాగించడం అవసరం అంటూనే ఈ సారి వినూత్న రీతీలో అమలు ఉండగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొనడం గమనార్హం. ఈ పర్యాయం దేశ్ ఆవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించకుండా, ఒకొక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులోను బట్టి ప్రకటించి, అమలు పరచే స్వేచ్ఛను రాష్ట్రాలకే కేంద్రం వదిలివేయనున్నట్లు తెలుస్తున్నది.

ఈ విషయమై హోమ్ మంత్రి అమిత్ షా హోమ్ శాఖ అధికారులతో శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా సమాలోచనలు జరుపుతున్నారు. కేంద్రం స్వయంగా లాక్ డౌన్ ప్రకటించాక పోయినా మొత్తం మీద కరోనా కట్టడిని పర్యవేక్షించడంతో పాటు, రాష్ట్రాలకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నది.

తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల సిఎంలు ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపారు. జోన్లను గుర్తించే విషయంలో తమకు అధికారాలు ఉండాలని, వైరస్ పరిస్థితిని బట్టి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ఖరారు చేసుకుంటామని తెలిపారు. ఇక ఉన్నట్లుండి రైళ్లను, అంతరాష్ట్ర బస్సులను నడిపిస్తే వచ్చే సమస్యను తట్టుకోవడం కష్టమని కూడా స్పష్టం చేశారు.

పరిస్థితులను బట్టి , కరోనా వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు ఎటువంటి ఆంక్షలను అమలు చేయాలనేది నిర్ణయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం రైళ్లు, దేశీయ విమానాల రాకపోకలనుపరిమితంగా పునరుద్ధరించడానికి సహితం సిద్దపడుతున్నది.

దేశవ్యాప్తంగా రెడ్‌జోన్లతో సహా సెలూన్లు, క్షౌరశాలలు, ఆప్టికల్ షాపులను తిరిగి తెరిచేందుకు వీలుంది. అయితే స్కూళ్లు, కాలేజీలు, సిన్మాహాళ్లు మూసే ఉంటాయి. కంటైన్మెంట్ ప్రాంతాలలో మాత్రం ఈ మినహాయింపు ఉండదు. పత్యేకించి గ్రీన్‌జోన్లలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ వెసులుబాట్లు ఉంటుంది. పరిమిత స్థాయిలో ఆరేంజ్ జోన్లలో ఆంక్షలు ఎత్తివేస్తారు.

రెడ్‌జోన్లలోని కంటైన్మెంట్ ప్రాంతాలలో ఖచ్చితమైన లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. రాష్ట్రాల విజ్ఞప్తులను తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుని ఆమోదించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నియంత్రణలు, ప్రజలు ప్రజా రవాణా కదలికలు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభంపై రాష్ట్రాలు క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితిని ప్రాతిపదికగా చేసుకుని నిర్ణయం తీసుకునే వీలుందని కేంద్రం చెపుతోంది.

వచ్చే సోమవారం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిమిత సంఖ్యలో స్థానిక మెట్రో రైళ్లు, సబర్బన్ ట్రైన్లు, బస్సులు, తక్కువ సంఖ్యలో, తక్కువ మందితో రెడ్‌జోన్లలో కూడా నడిచే వీలుంది. అయితే కంటైన్మెంట్ ప్రాంతాలలో వీటిని అనుమతించరు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లను తక్కువ మందితో అనుమతిస్తారు. రెడ్‌జోన్లతో పాటు అన్ని చోట్ల ఈ కామర్స్ సంస్థలు పనిచేసేందుకు అనుమతిస్తారు. నిత్యావసరేతర వస్తువులను ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేసేందుకు వీలు కల్పిస్తారని వెల్లడైంది.

వర్మ ‘క్లైమాక్స్’ నుంచి మరో అప్డేట్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈనెల 14న సాయంత్రం 5గంటలకు ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేశాడు. సోషల్ మీడియాలో విడుదలై కొన్ని క్షణాల్లోనే ‘క్లైమాక్స్’ టీజర్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. కేవలం రెండ్రోరోజుల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని వర్మ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా నేడు(శనివారం) సాయంత్రం 5గంటలకు మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

కాగా వర్మ విడుదల చేసిన ‘క్లైమాక్స్’ టీజర్ హాలీవుడ్ స్టైల్లో అదిరిపోయింది. ఇసుక తిన్నెల్లో మియా మాల్కోవా అందాలు ప్రతీఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. వర్మ గతంలోనూ వర్మ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(GST)అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. ఇందులో మియా మాల్కోవా నగ్నంగా నటించగా ‘క్లైమాక్స్’లో మాత్రం దస్తుల్లో కన్పించడం విశేషం. ఈ మూవీ ట్రైలర్ 18న రిలీజ్ చేయనున్నట్లు వర్మ టీజర్లో నే ప్రకటించాడు. తాజాగా నేటి సాయంత్రం మియా మాల్కోవాపై షూట్ చేసిన మ్యూజికల్ వీడియో సాంగ్ విడుదల చేస్తానని ప్రకటించడంతో అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ తోనే సంచలనం సృష్టించిన వర్మ ఈ మ్యూజికల్ సాంగ్స్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే..!

మాట తప్పిన జగన్..!

రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి నేటికి జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం తీవ్ర సంకోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే చేయూత అరకోరే. ఇచ్చిన వాటిలో రైతుల వరకూ చేరేవి తక్కువే. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. రైతుల విషయం లో ప్రధాన హామీ రైతు భరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే రైతులకు వ్యవసాయ పనులకు ఆర్ధిక చేయూత కోసం రూ. 12,500 ప్రతి రైతు ఖతాకు జమ చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత జగన్ రైతు భరోసా పథకం విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చేశారు. అప్పటికే అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ లో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులను తన పథకంలో కలిపి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంటే రైతులకు ఇస్తామన్న రూ. 12,500లలో రూ. 5 వేలు వెనక్కి తీసుకున్నారు. కేవలం రూ. 7,500 మాత్రమే జగన్ రైతులకు ఇస్తారన్నమాట. ఈ మొత్తం కేంద్రం ఇచ్చే రూ.6,000 లతో కలిపి రూ. 13,500 అవుతుంది. ఇస్తామన్న మొత్తం కంటే రూ. 1,000 అధనంగా ఇస్తున్నామంటూ రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం మాత్రం జోరుగా చేయించుకుంటున్నారు.

జగన్ ఎన్నికల ప్రచార సభలో ఎక్కడా రైతు భరోసా పథకంలో కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.12,500 చెల్లిస్తామని చెప్పలేదు. అదేవిధంగా మొత్తం రూ. 12,500 మే నెలలోనే చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు కరోనా కారణంగా రెండు విడతలుగా ఇచ్చారు అనుకుంటాకి లేదు. గత ఏడాది విడతల వారిగానే చెల్లింపు చేశారు. ఈ విషయంలో రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందంనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, అదేవిధంగా బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. రైతులకు ఒకేసారి రూ.12,500 చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ అనంతరం కేవలం రూ.7,500 చెల్లిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ఇదే విమర్శలు చేశారు.

వలస కూలీలపై విరిగిన లాఠీ..!

పునరావాస కేంద్రాల నుంచి అధికారుల అనుమతి లేకుండా స్వస్థలాలకు పయనమైన వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జి చేసిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలు 150 మంది తాడేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి శుక్రవారం కనిపించారు. దీంతో ఆమె వారితో మాట్లాడి సమస్య తెలుసుకుని పునరావాస కేంద్రానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళను స్వగ్రామాలకు తరలించేందుకు సూచనలు చేశారు. దీంతో కూలీలను విజయవాడ క్లబ్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.

పునరావాస కేంద్రంలో శనివారం అల్పాహారం తిన్న అనంతరం కూలీలు మళ్ళీ కాలి నడకన, సైకిళ్లు మీద ప్రయాణానికి సిద్ధమై విజయవాడ క్లబ్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడున్న పోలీసులు వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. వారు అంగీకరించక పోవడంతో లాఠీలకు పని చెప్పారు. దీంతో కూలీలు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

లాక్ డౌన్ ఎత్తివేత వ్యహాత్మకంగా జరగాలి:రాహుల్

లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసే ప్ర‌క్రియ‌ను చాలా చాక‌చ‌క్యంగా జ‌ర‌గాల‌ని, ఇదొక ఈవెంట్ త‌ర‌హాలో కాకుండా, ఓ ప్ర‌క్రియ త‌ర‌హాలో జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ సూచించారు.  ఇలాంటి స‌మ‌యంలో వృద్ధులు, రోగుల ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు. ఒక‌ర్ని త‌ప్పుప‌ట్టే స‌మ‌యం ఇది కాదు అని, కానీ వ‌ల‌స కూలీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. అంద‌రం క‌లిసి వారిని ఆదుకోవాల‌న్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  అవ‌స‌ర‌మైన వారికి నేరుగా న‌గ‌దు ఇవ్వాల‌న్నారు. రాబోయ ఆర్థిక సునామీ గురించి కూడా ఆలోచించాల‌న్నారు.

ప్రజల ఖాతాల్లోకి తక్షణమే నగదును మళ్లించకుంటే లాక్‌ డౌన్‌ తో అతిపెద్ద విపత్కర సమస్యను ఎదుర్కొంటారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఒకతల్లి తన పిల్లలకు తినడానికి ఆహారం లభించేలా ఏవిధంగా ఏపనైనా చేస్తుందో, అదే విధంగా నిరు పేదల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలని అన్నారు. గతేడాది లోక్‌ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ఎన్‌ఎవైఎ పథకాన్ని ఆచరణలో పెట్టాలని కేంద్రానికి సూచించారు. దీనికింద నిరు పేదలకు రూ. 72 వేల ఆదాయం లభిస్తుందని అన్నారు. అలాగే లాక్‌డౌన్‌తో వలసకార్మికులు, చిన్నారులు వేలకిలోమీటర్లు కాలినడకన తమ గ్రామాలకు వెళ్తున్నారని, ఈ సమయంలో వారికి సందేశాలు అవసరం లేదని విమర్శించారు. దేశమంతా వారికి మద్దతుగా నిలవాలని అన్నారు. భారత నిర్మాణంలో వలస కార్మికులు కీలక భాగస్వాములన్న ఆయన.. వారికి తక్షణ సాయం అందేలా చూడాలని అన్నారు. చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజిని నిజాయితీగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. లక్షలాది వలస కార్మికులు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారని.. వలస కార్మికులతో పాటు భావిభారత చిన్నారులు రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు వహిస్తూ లాక్‌ డౌన్‌ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక ప్యాకేజి విషయంలో ప్రధాని పునరాలోచించాలన్నారు. కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు వెబ్ సీరిసులను పట్టించుకోరే?

గత కొన్నేళ్లుగా చిత్రసీమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశంలో లాక్డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదాపడ్డాయి. ఇది చిత్రసీమను మరింత సంక్షోభంలోకి నెట్టింది. అయితే ఈ పరిస్థితి మరో ఎంటైన్మెంట్ రంగానికి భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. అదే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వారంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అలవాటు పడ్డారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు బడా నిర్మాతలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోన్నారు. కొందరు సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే సన్నహాలు మొదలు పెడుతోన్నారు.

నిజానికి థియేటర్లో చూసే సినిమాకు ఓటీటీ చూసే వాటికి చాలా తేడా ఉంటుంది. థియేటర్లో అయితే టిక్కెట్టు పెట్టి మరీ చూడాల్సి ఉంది. సినిమా బాగా ఉన్నా లేకున్నా డబ్బులు పెట్టినందుకు చివరివరకు చూసేవారే ఎక్కువ. ఓటీటీ విషయంలో డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో ప్రేక్షకులు అన్ని సినిమాలను చూడటం లేదు. కొన్ని హిట్టయిన సినిమాలను మాత్రమే చూస్తున్నారు. నచ్చితే చూస్తారు.. నచ్చకపోతే ఈ సోది అంతా ఎందుకని వాటిపై ఓ నిర్ణయానికొస్తున్నారు. అంతేకాకుండా విషయం ఉన్న సినిమాలు వేరే భాషలైనా ఆదరిస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు వెబ్ సీరిస్ లు తీసుకొస్తున్నా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సీరిస్ మంచి కంటెంట్ అందించడం కత్తిమీద సాములా మారింది.

ప్రస్తుతానికి ఇంగ్లీష్, హీందీ వెబ్ సీరిస్ లు మంచి కంటెంట్ అందిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి. లస్ట్ స్టోరీస్, స్పెషల్ ఆప్స్, ది ఫ్యామిలీ మేన్ వంటి వెబ్ సీరిస్ క్వాలీటీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే తెలుగు వెబ్ సీరీస్ లు మాత్రం సదరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అవుతోన్నాయి. కంటెంట్ విషయంలో చాలా నిరసంగా ఉండటంతో తెలుగు వెబ్ సీరిస్ లను చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపడం లేదని సమాాచారం. ఒకటి ఆరా మినహా తెలుగు వెబ్ సీరిస్ మిగతావన్నీ బీ గ్రేడ్ కేటగిరికి చెందిన కంటెంటే ఉంటున్నాయి. వీటిని సాధారణ ప్రేక్షకుడు పట్టించుకోవడం లేదు. కొత్తదనం, క్వాలీటీ అందిస్తే తెలుగు వెబ్ సీరిస్ లను చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పటికీ మేకర్స్ ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో తెలుగు వెబ్ సీరిస్ ట్రెండ్ నీరసంగా సాగుతోంది. ఏదో తీశాం.. ఏదిపెట్టిన ప్రేక్షకుడు చూస్తాడులే అనే ధోరణి వీడకపోతే తెలుగు ప్రేక్షకుడు కొత్తదనం చూపిస్తున్న ఇంగ్లీష్, హిందీ వెబ్ సీరిస్ లకే అలవాటు పడిపోవడం ఖాయం. అలా జరిగే భవిష్యత్ లో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ సీరిస్ లు కనుమరుగడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు మేకర్స్ కొత్తదనంతో కూడిన వెబ్ సీరిస్ లను తీస్తారని ఆశిద్దాం.

ఆన్ లైన్లో డ్రెస్ వేలం వేయనున్న మల్లు బ్యూటీ

చిత్రసీమలో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా నిత్యమీనన్ కు మంచి పేరుంది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లోని సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. నిత్యమీనన్ నటనతోపాటు తెలుగులోని తన సినిమాల్లో పలు పాటలుపాడి అభిమానులను మెస్మరైజ్ చేసింది. నిత్యమీనన్ కు టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా నిత్యమీనన్ ఓ మంచి కోసం తన డ్రెస్ వేలం వేసేందుకు సిద్ధపడింది. ఈ వేలంపాటలో వచ్చిన డబ్బులను పేదలకు కోసం పనిచేస్తున్న ‘అర్పణం’ ట్రస్టుకు అందజేయనున్నారు.

ఈమేరకు నిత్యమీనన్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసింది. తన డ్రెస్ ఎందుకు వేలం వేయాలనుకుంటుందో? డ్రెస్ డిజైన్ ఎలా ఉందో చెబుతూ వీడియో విడుదల చేసింది. తన కోసం తన ఫ్రెండ్‌, డిజైనర్‌ కావేరి డిజైన్‌ ఈ డ్రెస్ డిజైన్ చేసినట్లు చెప్పింది. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నట్లు నిత్యమీనన్ తెలిపింది. ఈ వేలంలో వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తానని చెప్పింది. ఈ ట్రస్ట్‌ గ్రామాల్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పింది. మే 16న ఆదివారం 4గంటలకు @indiawasted అనే సైట్‌లో ఆక్షన్ జరుగనుందని తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. ఆసక్తి ఉన్నవారేవరైనా వేలంపాటలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. అత్యధిక ధర చెల్లించిన వారికే తన డ్రెస్ దక్కుతుందని నిత్యామీనన్ చెప్పింది. అదేవిధంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాను ధరించిన డ్రెస్సుకు సంబంధించిన వీడియోను నిత్యామీనన్ షేర్ చేసింది. నిత్యమీనన్ ధరించిన ఈ అందమైన డ్రెస్ ను వేలంపాటలో ఎవరు దక్కించుకుంటారు? ఎంత ధర పలుకుందోననే ఆసక్తి నెలకొంది. రేపు వేలంపాట ముగిశాక దీనిపై మరింత క్లారిటీ రానుంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!

పొరుగు రాష్ట్రాల ఏపీ ఆర్టీసీ బస్సులకు బ్రేక్!

పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వివిధ కారణాలతో చిక్కుకు పోయిన తిరిగి తీసుకు రావడానికి శనివారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ ఆర్టీసీ అకస్మాత్తుగా ఆ ప్రయత్నాన్ని విరమించుకొంది. అంతుకు సాంకేతిక పరమైన కారణాలని చెబుతున్నా అసలేమీ జరిగిందో తెలియరావడం లేదు.

మే 16 నుంచి సొంత రాష్ట్రానికి తీసుకెళతామంటూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో చిక్కుకు పోయిన వారి కోసం సరిహద్దు జిల్లాల ఆర్‌ఎంలు బస్సులు సిద్ధం చేశారు. మొదటి విడతగా ఎక్కువగా సుమారు 13 వేలమంది ఉన్న హైదరాబాద్‌ నుంచి బస్సులు నడుపుతామని ప్రకటించారు.

అయితే ప్రత్యేక బస్సులు నడిపే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ శుక్రవారం ప్రకటించింది. హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులను కూడా సాంకేతిక కారణంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.

ప్రజలను తరలించేందుకు బస్సులను ఏర్పాటు పై రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో బాధిత ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

పాతబస్తీలో ఎంఐఎం దే రాజ్యం … పోలీసుల ప్రేక్షక పాత్ర

దేశం అంతటా కరోనా మహమ్మారిపై ప్రజలు, ప్రభుత్వాలు పోరాటం చేస్తుంటే హైదరాబాద్ లోని పాతబస్తీలో మాత్రం ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహింపవలసి వస్తున్నది. ఇక్కడ రాజకీయంగా ప్రాబల్యం గల ఎంఐఎం శాసన సభ్యులు, వారి నాయకులు బహిరంగంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ప్రేక్షకపాత్ర వహించడం తప్ప పోలీసులు ఏమీ చేయలేక పోతున్నారు.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేయడంలో ఉత్సాహం చూపిన పోలీసులు ఎంఐఎం ఎమ్యెల్యేలు, నాయకులూ బహిరంగంగా ఉల్లంఘలకు పాల్పడుతున్నా స్పందించరా అని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. వారి ఆగడాల కారణంగా పాతబస్తీలో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు నిస్సహాయ పరిస్థితులలో చిక్కుకు పోయారని విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాలాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ద‌బీర్‌పుర ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌‌ను బ‌ల‌వంతంగా తొలగించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ వలే వ్యాపించినా పోలీసులు నిస్సహాయంగా ఉండటం గమనార్హం.

పైగా, పోలీసుల అనుమతితోనే ఆ ఎమ్యెల్యే నిబంధనలను ఉల్లంఘించారని అంటూ పోలీసులు తమ నిస్సహాయ పరిస్థితిని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా రాకపోకలకు ఆంక్షలుగా ఉంచిన బారికేడ్ ను తొలగించమని పోలీసులు వేరేవారికి అనుమతి ఇస్తారా? తొలగించవలసిన అవసరం వస్తే వారే వెళ్లి తొలగిస్తారు.

ఓ వైపు ప్ర‌జ‌ల‌కు మంచిగా క‌నిపిస్తూ మ‌రోవైపు త‌న ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్ల‌తో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌మ‌ని ఎంపీ అస‌దుద్దీన్‌ ఓవైసీ ప్రేరేపిస్తున్నారని విమ‌ర్శించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన ప్ర‌తి ఒక్క‌రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాజాసింగ్ స్పష్టం చేశారు.

జూన్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

లాక్ డౌన్ పూర్తి కాగానే జూన్ లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ సమావేశాలను జరిపేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణహించినట్లు తెలిసింది. అందుకోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

వాస్తవానికి మార్చ్ లోనే ఈ సమావేశాలు జరుగవలసి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా జరపలేక పోయారు. లాక్ డౌన్ కూడా ప్రకటించడంతో సమావేశాలను మూడు నెలలపాటు వాయిదా వేశారు. మూడు నెలల కాలానికి ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ ద్వారా బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం పొందారు.

ఈ గడువు కూడా జూన్‌ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు శాసనసభ నుండి ఆమోదం పొందాలని బావిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జూన్‌లోగా కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఒకవేళ వైరస్‌ ఉధృతి తగ్గకపోయినా అవసరమైన జాగ్రత్తలతో జూన్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభత్వుం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

కాగా, శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. జూన్ లోగా పార్లమెంట్ ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. దానితో మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆసక్తి కలిగిస్తుంది.

మరోవైపు సిఆర్‌డిఎ రద్దు బిల్లును శాసనసభ ఆమోదించినా, మండలి తిరస్కరించి సెలక్ట్‌ కమిటీకి పంపింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలు సహితం జూన్ లో ఉండే అవకాశం ఉంది.

కేంద్రాన్ని బట్టే రాష్ట్ర వ్యూహం:కేసీఆర్

తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్4.0 మే 29 వరకు అమలుకానుంది. కానీ దేశ వ్యాప్త లాక్ డౌన్3.0 ఈ నెల 17తో ముగియనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ వైరస్‌ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి అందుకనుగుణంగా వ్యూహం అనుసరించక తప్పదని చెప్పారు.

సీఎం కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో హైదరాబాద్‌ పరిధిలోని ఎల్‌.బి.నగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాల్లోనే వైరస్‌ ఉంది. యాదాద్రిభువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు వైరస్‌ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్‌ లేదు. హైదరాబాద్‌ లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ఎక్కడా కరోనా చికిత్స పొందుతున్న వారి కేసులు లేవని తెలిపారు. ఒకవేళ ఉన్నా.. వారు కూడా హైదరాబాద్‌ లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులున్న నాలుగు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

గ్రామాలు, పట్టణాలు, నగరాలకు నిధులు
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్య, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే ఇచ్చాం. జూన్‌ కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’ అని సీఎం చెప్పారు.

మీసాలు తీయించుకోవడానికి సిద్ధమా..!

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. గత ఏడాది మే 19వ తేదీన పోవవరం ప్రాజెక్టు పనులు 71.31 శాతం పనులు అయినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికను ప్రదర్శించారు. నివేదిక ఇచ్చిన అధికారులు ఇప్పుడూ ఉన్నారని చెప్పారు. గత ఏడాది జూన్ 10వ తేదీన 71.43 శాతం పనులయ్యాయి. మీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎంత వరకూ జరిగాయో మీ రివ్యూల్లోనే బాగా చూసుకోండని హితవు పలికారు. ఎవరి మీసాలు తీసుకుంటారో, ఎవరి గడ్డాలు తీసుకుంటారో తేల్చుకోవాలన్నారు. మాట్లాడేప్పుడు బాధ్యతగా మెలగాలన్నారు.

టీడీపీ హయాంలో రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేసి సమగ్ర జలవిధానంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించామని, పోలవరంలో 71.31 శాతం పనులు జరిగాయని అధికారులు ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి చూడాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా తాను ప్రతి వారం పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టి మీడియాకు ఇచ్చానని, మీరు ఎందుకు సమాచారం దాస్తున్నారని మంత్రి అనిల్ ను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఎందుకు ఆన్ లైన్ లో పెట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని, పోలవరం పనులకు సంబంధించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సమాచారాన్ని తాను మీడియా ముందు పెడుతున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.

పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీటు వేశారని, ఎంత మట్టి తీశారో చెప్పమంటే సమాధానం చెప్పే దమ్ము లేక మీసాలు తీసుకుందాం రమ్మంటున్నాడు ఇరిగేషన్ మంత్రి అంటూ ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే నీళ్లు అమ్ముకున్నారని ఆరోపణ చేశారని, అందుకే తాను ప్రశ్నించినట్లు చెప్పారు. ఆరోపణలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి సీఎం సమాధానం చెప్పాలన్నారు. మీ రివర్స్ టెండరింగ్ ఎంతవరకు వచ్చిందని, టీడీపీ హయాంలో సాగునీటి విజయాలపై పూర్తి సమాచారాన్ని తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

జడ్జిగారూ… వాళ్ళకి అన్ని తెలివితేటలు లేవు!

“మాట వినేవాళ్లకైతే ఏదైనా చెబుతాం. వద్దన్నా వినకుండా రోడ్ల వెంట నడుచుకుంటూ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వలస కూలీలకు ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? చనిపోతారని తెలిసి కూడా రైలు పట్టాలపై నిద్రపోయేవాళ్లను ఎలా ఆపాలి? చాలా మంది ఇప్పటికే దారి మధ్యలో ఉన్నారు. వాళ్లను ఆపడం అసాధ్యం. అయినా.. ఏ కూలీ ఎక్కడున్నాడో కనిపెట్టి వాళ్లను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన పనిని కోర్టులు ఎందుకు తలెత్తుకోవాలి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మేం ఎలాంటి సూచనలు చేయబోము..” అంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీలపై అనూహ్యమైన, ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు, తలపండిన మేధావులు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడికి అండగా నిలబడాల్సిన న్యాయస్థానం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వివిధ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల కొరకు ప్రత్యేక విమాన సదుపాయాలు ఏర్పాటు చేసిన కేంద్రం, అభాగ్యులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వలస కూలీలకు ఆ ఏర్పాట్లు చేయలేమనడం ఆశర్యం. పక్కా ప్లానింగ్ తో వివిధ దేశాలలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించిన కేంద్రం, అదే ప్లానింగ్ తో స్వదేశీయులను వారి వారి స్వస్థలాలకు తరలించలేక, కూలీలదే తప్పని చెప్పడం విచారకరం.

ఒక రోజు కర్ఫ్యూ (మార్చి 22) కి నాలుగు రోజుల ముందు (మార్చి 19న) ప్రకటించిన మోడీ సర్కార్, 21 రోజుల లాక్ డౌన్1.0 (మార్చి24 నుండి ఏప్రిల్ 14 వరకు) నాలుగు గంటల ముందు (మార్చి 23 రాత్రి 8 గంటలకు) ప్రకటించిన మోడీ సర్కార్ ని ఎందుకు నిలదీయలేదు..? దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది వలస కూలీల జీవనోపాధి గూర్చి ఆలోచించకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ ని ఎలా ప్రకటించారు? అని బీజేపీ సర్కార్ ని ఎందుకి నిలదీయలేకపోతుంది ఈ సర్వోన్నత న్యాయస్థానం?

తీసుకొని వచ్చిన కాంట్రాక్టర్లు మోసం చేశారు. చేతిలో పని లేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఆకలితో చస్తున్నా.. పట్టించుకున్న నాధుడే లేడు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు ఏమి చేయమంటారు? ఉన్నచోటే చస్తే దిక్కుండదేమో అని తమ ఇళ్లకు బయల్దేరారు.  అండగా నిలబడాల్సిన న్యాయస్థానమే కేంద్రానికి కొమ్ముకాస్తదని తెలిసుంటే వాళ్లు బయటకు రాకపోయేవాళ్లేమో…  మీరన్నట్టు దారి మధ్యలోనే చేస్తామని తెలిస్తే వాళ్ళు రాకపోయేవాళ్లేమో.. కానీ కాలం కూడా వారిని మోసం చేసింది. విధి వారిని వెక్కిరించింది. అందుకే మీలాంటి తలపండిన మేధావులతో మాటపడాల్సి వచ్చింది.

వాళ్లు బయటకు రాకపోయి ఉంటే ఇప్పుడు అక్కడక్కడ ఏర్పాటు చేసిన శిబిరాలు ఉండేవా? కొంతమందైన మూడుపూట్ల భోజనాలు చేసేవారా? ప్రస్తుతం లక్షల మంది రోడ్లపైన నడుస్తున్నారంటే.. వాళ్ళని పట్టించుకున్న వారు లేరు కాబట్టే.. అనే సత్యన్ని గ్రహిస్తే మంచిది. తల దాచుకోవడానికి కొంచం నీడ ఉండి, తినడానికి తిండి ఉంటే వాళ్ళు బయటకు రారు జడ్జిగారు.

పోతిరెడ్డిపాడుపై ముందుకు వెళ్లొద్దు..!

ప్రాజెక్టు సామర్థ్యం పెంపు విషయంలో తెలంగాణా ప్రభుత్వ, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ నెంబర్ 203 పై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా నిలిపి వేయాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమన్న అభిప్రాయాన్ని బోర్డు వ్యక్తం చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే కొత్త ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కోరింది. వెంటనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియచేయాలని బోర్డు సభ్యులు హరికేశ్ మినా రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ కు లేఖలో సూచించింది.

మరోవైపు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచే అంశంపై తన వాదనలు వ్8నిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో నీటి సమస్య బోర్డు దృష్టికి తీసుకువెళ్లి, కృష్ణా జిల్లాలో ఏపీకి రావాల్సిన వాటాను మాత్రమే తీసుకుంటున్నామని, వరదల సమయంలో సముద్రం పాలవుతున్న మిగులు జలాలను రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి తరలించాలని భావిస్తున్నట్లు వివరించనున్నారు. ఈ విషయంలో తెలంగాణా అభ్యంతరాలు అర్ధరహితమని వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాద్ దాస్, ఇతర జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి కృష్ణా బోర్డుకు తమ వాదనలు వినిపించనున్నారు

గెజిటను సస్పెండ్ చేసిన హైకోర్టు..!

రాజధాని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ను ప్రకటిస్తూ ఇచ్చిన గ్రెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను తప్పుపట్టింది. సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు విన్నది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం వేసవి సెలవుల అనంతరం జూన్‌ 17కు వాయిదా వేసింది.

రాజధాని ప్రాంతంలో ఆర్‌5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారితో పాటు గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఈ మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1,300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం ఆర్5ను ప్రభుత్వం సృష్టించిన విషయం విదితమే. సీఆర్‌డీయే చట్టాన్ని, అందులోని మాస్టర్ ప్లాన్‌ను మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనను పాటించకుండా చేస్తున్నారని, సీఆర్‌డీయే చట్టానికి, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని రాజధాని రైతులు హైకోర్టు ఆశ్రయించారు. రాజధాని రైతుల వాదనపై సంతృప్తి చెందిన హైకోర్టు ప్రభుత్వం ఆర్ 5 జోన్ మార్పు చేసిన ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని తేల్చింది.

కడుపున పెట్టుకున్న జగనేనా ఇలా చేసింది?

ఏపీ సీఎం జగన్ వచ్చాక ఆర్టీసీ కార్మికులను కడుపున పెట్టుకున్నారు.. ఏకంగా ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులను చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికుల దృష్టిలో సీఎం జగన్ దేవుడయ్యాడు. ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. జగన్ వచ్చాక కార్మిక, ఉద్యోగ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందరికీ వరాలు ఇచ్చే ఈ దేవుడు మరీ 6వేలమంది ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు రోడ్డున పడేశాడన్నది ఇప్పుడు అందరినీ కలవర పరుస్తున్న ప్రశ్న..

*ఒక్క రాత్రితో రోడ్డున పడ్డ 6వేల మంది బతుకులు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులు కదల్లేదు. ఆర్టీసీ భారీ సంక్షోభంలో చిక్కుకుంది. పనిలేదు.. వేతనాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క ఆదేశంతో ఏకంగా 6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్టు తెలిసింది.

*ఆర్టీసీ ఎండీ నుంచి ఆదేశాలు
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని డిపో మేనేజర్లు శుక్రవారం నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని తెలిసింది. మొత్తం ఏపీ వ్యాప్తంగా 6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శుక్రవారం నుంచి విధుల్లోకి రావద్దని తొలగించినట్టు సమాచారం.

*ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వలేదట..
అత్యంత విషాదం ఏంటంటే.. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏం చెప్పారో తెలుసా? ఏప్రిల్ నెలలో బస్సు సర్వీసులు నిర్వహించలేదని.. అందుకే మీకు జీతాలు ఇవ్వమన్నారట.. ఇప్పుడు మేలో బస్సులు మొదలయ్యే వేళ వారిని ఉద్యోగాల్లోంచి తీసివేశారు. అంటే రెండు నెలలుగా వారికి జీతాలు లేవు. వారి కుటుంబాలు ఎలా గడవాలి? 6వేల మందిని ఒక్క కలం పోటుతో ఉద్యోగాల్లోంచి తీసివేయడంతో ఉద్యోగ సంఘాల్లో అలజడి చెలరేగింది. భారీ అంశాంతిని మిగిల్చింది. ఆర్టీసీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారి సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

*జగన్ సార్ ఇది న్యాయమా?
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడంలో ఎంతో ఉదారత చూపించిన సీఎం జగన్ ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసివేసిన వ్యవహారం తెలుసో.. లేదో తెలియదు.. కానీ తెలుసుంటే మాత్రం ఇంతమంది కడుపుకొట్టి రోడ్డున పడేసిన ఆర్టీసీ తీరును ఎవరూ హర్షించరు. రాత్రిపూట ఒక్క స్ట్రోక్ తో రోడ్డున పడేసిన వైనాన్ని ఎవరూ సహించరు. మానవతా దృక్పథంతో ఎంతో మందిపై కరుణ చూపిన సీఎం జగన్ స్పందించి వెంటనే వీరిందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఉదారతలో.. మానవత్వంలో.. సాయం చేయడంలో ముందుంటున్న సీఎం జగన్.. ఈ రోడ్డున పడ్డ 6వేల మంది విషయంలో మానవతా దృక్ఫథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. తన ప్రభుత్వంలో మచ్చగా మారిన ఈ ఉదంతాన్ని పరిష్కరించి వారిని ఆదుకోవాలి.. అప్పుడే వైసీపీ ప్రభుత్వానికి ఈ కలంకం తప్పుతుంది.. పెడచెవిన పెడితే మాత్రం విమర్శల జడివానలో తడుస్తుంది.. ఆ 6వేల మంది శోకం శాపంలా తగిలే అవకాశం ఉంది.

-నరేశ్ ఎన్నం