spot_img
Homeఆంధ్రప్రదేశ్‌కడుపున పెట్టుకున్న జగనేనా ఇలా చేసింది?

కడుపున పెట్టుకున్న జగనేనా ఇలా చేసింది?

ఏపీ సీఎం జగన్ వచ్చాక ఆర్టీసీ కార్మికులను కడుపున పెట్టుకున్నారు.. ఏకంగా ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులను చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికుల దృష్టిలో సీఎం జగన్ దేవుడయ్యాడు. ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు జరిగాయి. జగన్ వచ్చాక కార్మిక, ఉద్యోగ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అందరికీ వరాలు ఇచ్చే ఈ దేవుడు మరీ 6వేలమంది ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు రోడ్డున పడేశాడన్నది ఇప్పుడు అందరినీ కలవర పరుస్తున్న ప్రశ్న..

*ఒక్క రాత్రితో రోడ్డున పడ్డ 6వేల మంది బతుకులు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులు కదల్లేదు. ఆర్టీసీ భారీ సంక్షోభంలో చిక్కుకుంది. పనిలేదు.. వేతనాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఒక్క ఆదేశంతో ఏకంగా 6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్టు తెలిసింది.

*ఆర్టీసీ ఎండీ నుంచి ఆదేశాలు
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని డిపో మేనేజర్లు శుక్రవారం నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని తెలిసింది. మొత్తం ఏపీ వ్యాప్తంగా 6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శుక్రవారం నుంచి విధుల్లోకి రావద్దని తొలగించినట్టు సమాచారం.

*ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వలేదట..
అత్యంత విషాదం ఏంటంటే.. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏం చెప్పారో తెలుసా? ఏప్రిల్ నెలలో బస్సు సర్వీసులు నిర్వహించలేదని.. అందుకే మీకు జీతాలు ఇవ్వమన్నారట.. ఇప్పుడు మేలో బస్సులు మొదలయ్యే వేళ వారిని ఉద్యోగాల్లోంచి తీసివేశారు. అంటే రెండు నెలలుగా వారికి జీతాలు లేవు. వారి కుటుంబాలు ఎలా గడవాలి? 6వేల మందిని ఒక్క కలం పోటుతో ఉద్యోగాల్లోంచి తీసివేయడంతో ఉద్యోగ సంఘాల్లో అలజడి చెలరేగింది. భారీ అంశాంతిని మిగిల్చింది. ఆర్టీసీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారి సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

*జగన్ సార్ ఇది న్యాయమా?
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడంలో ఎంతో ఉదారత చూపించిన సీఎం జగన్ ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసివేసిన వ్యవహారం తెలుసో.. లేదో తెలియదు.. కానీ తెలుసుంటే మాత్రం ఇంతమంది కడుపుకొట్టి రోడ్డున పడేసిన ఆర్టీసీ తీరును ఎవరూ హర్షించరు. రాత్రిపూట ఒక్క స్ట్రోక్ తో రోడ్డున పడేసిన వైనాన్ని ఎవరూ సహించరు. మానవతా దృక్పథంతో ఎంతో మందిపై కరుణ చూపిన సీఎం జగన్ స్పందించి వెంటనే వీరిందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఉదారతలో.. మానవత్వంలో.. సాయం చేయడంలో ముందుంటున్న సీఎం జగన్.. ఈ రోడ్డున పడ్డ 6వేల మంది విషయంలో మానవతా దృక్ఫథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. తన ప్రభుత్వంలో మచ్చగా మారిన ఈ ఉదంతాన్ని పరిష్కరించి వారిని ఆదుకోవాలి.. అప్పుడే వైసీపీ ప్రభుత్వానికి ఈ కలంకం తప్పుతుంది.. పెడచెవిన పెడితే మాత్రం విమర్శల జడివానలో తడుస్తుంది.. ఆ 6వేల మంది శోకం శాపంలా తగిలే అవకాశం ఉంది.

-నరేశ్ ఎన్నం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular