
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. గత ఏడాది మే 19వ తేదీన పోవవరం ప్రాజెక్టు పనులు 71.31 శాతం పనులు అయినట్టు అధికారులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికను ప్రదర్శించారు. నివేదిక ఇచ్చిన అధికారులు ఇప్పుడూ ఉన్నారని చెప్పారు. గత ఏడాది జూన్ 10వ తేదీన 71.43 శాతం పనులయ్యాయి. మీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎంత వరకూ జరిగాయో మీ రివ్యూల్లోనే బాగా చూసుకోండని హితవు పలికారు. ఎవరి మీసాలు తీసుకుంటారో, ఎవరి గడ్డాలు తీసుకుంటారో తేల్చుకోవాలన్నారు. మాట్లాడేప్పుడు బాధ్యతగా మెలగాలన్నారు.
టీడీపీ హయాంలో రూ. 63 వేల కోట్లకు పైగా పనులు చేసి సమగ్ర జలవిధానంతో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించామని, పోలవరంలో 71.31 శాతం పనులు జరిగాయని అధికారులు ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి చూడాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా తాను ప్రతి వారం పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టి మీడియాకు ఇచ్చానని, మీరు ఎందుకు సమాచారం దాస్తున్నారని మంత్రి అనిల్ ను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఎందుకు ఆన్ లైన్ లో పెట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని, పోలవరం పనులకు సంబంధించి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత సమాచారాన్ని తాను మీడియా ముందు పెడుతున్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.
పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీటు వేశారని, ఎంత మట్టి తీశారో చెప్పమంటే సమాధానం చెప్పే దమ్ము లేక మీసాలు తీసుకుందాం రమ్మంటున్నాడు ఇరిగేషన్ మంత్రి అంటూ ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే నీళ్లు అమ్ముకున్నారని ఆరోపణ చేశారని, అందుకే తాను ప్రశ్నించినట్లు చెప్పారు. ఆరోపణలు చేసింది అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి సీఎం సమాధానం చెప్పాలన్నారు. మీ రివర్స్ టెండరింగ్ ఎంతవరకు వచ్చిందని, టీడీపీ హయాంలో సాగునీటి విజయాలపై పూర్తి సమాచారాన్ని తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.