YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ సంఘటన ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానించింది. పకడ్బందీ ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 14ల అవినాష్ రెడ్డిని విచారిస్తారని తెలుస్తోంది. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించబోతున్నారనే వార్తలు రావడంతో.. జరిగే తదుపరి రాజకీయ పరిణామాలపై అత్యంత ఆసక్తి ఏర్పడింది.
40 కోట్ల సుపారి
వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ గతంలోనే అనేక కోణాలలో విచారణ సాగించింది. 40 కోట్ల సుపారీ ఒప్పందం ఈ కేసులో జరిగిందని అభియోగాలు రావడంతో.. సిబిఐ ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాదు, దర్యాప్తులో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. అవి అనేక రకాలుగా చర్చకు దారితీసాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ప్రస్తుతం ఈడి పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి.. భారీగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఈ ఆర్థిక వ్యవహారాల వెనుక ఎవరు ఉన్నారు.. నిధులు ఎవరి వద్దకు చేరుకున్నాయి.. అనే అంశాలు ఇప్పుడు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారాయి. 40 కోట్ల సుపారీకి సంబంధించిన అభియోగాలు.. వాటి వెనుక ఉన్న వ్యక్తులు.. ఆర్థిక వ్యవహారాలు తుది నిర్ధారణకు రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.
డ్రైవర్ దస్తగిరి అప్రూవర్
వివేకానంద రెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. దస్తగిరి తో పాటు సునీల్ యాదవ్.. ఎర్ర గంగిరెడ్డి. ఉమా శంకర్ రెడ్డి వంటి వారి పేర్లు గతంలో దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చాయి. ఈ కేసులో సిబిఐ విచారణ.. న్యాయపరమైన పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆర్థిక లావాదేవీల కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఈడి విచారణ గనుక కొనసాగితే.. గతంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు కొత్త వివరాలు కూడా దర్యాప్తులో ఈడి పరిశీలనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేసి.. విచారణ పూర్తి చేసిన తర్వాత.. ఈడి కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.
విచారణలో ఏం తేలుతుంది
శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణలో ఏం తేలుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు.. గతంలో దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈడి అధికారులు ప్రశ్నలు వేస్తున్నట్టు సమాచారం.. అక్టోబర్ 14న అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్న అనే వార్తలు ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠను రేపుతున్నాయి. విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు.. ఎలాంటి ఆధారాలు ముందు పెడతారు అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
రాజకీయంగా వేడి
వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలలో ఎన్నో మలుపులకు కారణమైంది. గతంలో సిబిఐ దర్యాప్తు సాగించడం.. నిందితులపై ఆరోపణలు.. స్థానంలో కొనసాగుతున్న విచారణలు.. రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు ఈడి దర్యాప్తు అంశం తెరమీదకి రావడంతో ఈ కేసు మరోసారి రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఈడీ విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది అధికారిక సమాచారం ద్వారానే తెలుస్తాయి.