Balagam Venu : బలగం చిత్రంతో సంచలనం సృష్టించాడు జబర్దస్త్ కమెడియన్ వేణు. ఆ చిత్రం వేణు ఫేట్ మార్చేసింది. తొలి సినిమాతోనే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా నిరూపించుకున్నాడు. కుటుంబ పెద్ద చావు చుట్టూ కథను నడిపిస్తూ భావోద్వేగాలు అద్భుతంగా పండించాడు. బలగం సినిమాకు ఊహించని స్పందన దక్కింది. ఒకప్పటి జబర్దస్త్ వేణు కాస్తా… బలగం వేణు అయ్యాడు. బలగం సక్సెస్ నేపథ్యంలో హీరో నాని ఆఫర్ ఇచ్చాడని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజా ఇంటర్వ్యూలో వేణు జబర్దస్త్ షో పై సంచలన కామెంట్స్ చేశాడు. నాకు జబర్దస్త్ వేణు అని పిలిపించుకోవడం కంటే… బలగం వేణు గా వచ్చిన గుర్తింపు బాగుందని తెలిపాడు. పైగా జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు తనకు వద్దని అన్నాడు. జబర్దస్త్ కి రాకముందే నేను 100కు పైగా సినిమాల్లో నటించాను. జబర్దస్త్ అనేది నా కెరీర్ మధ్యలో వచ్చింది. కేవలం అదే నా కెరీర్ కాదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వేణు మాట్లాడుతూ .. నాకు రచన పై ఆసక్తి ఉంది. అందుకే డైరెక్టర్ కావాలనుకున్నాను. చాలా చిత్రాలకు కొన్ని సన్నివేశాలు రాశాను. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ అన్నయ్యకు కొన్ని డైలాగులు రాశాను. ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం నేనే రాశాను. అలా చాలా కథలు సొంతంగా రాసేవాడిని. జబర్దస్త్ నాకు చాలా ఇచ్చింది. అందులో సందేహం లేదు. జబర్దస్త్ నా కెరీర్ కాదని డిసైడ్ అయ్యాక బయటకు వచ్చాను.
బలగం కథ నా కోసం రాసుకున్నాను. కానీ నేను హీరో అయితే అంత ఆదరణ లభించదు అని గ్రహించాను. ఇంట్లో మనిషి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనే ఆలోచనతో బలగం మొదలుపెట్టాను. కొన్ని సీన్లు నాకు తెలిసిన వాళ్లకు వినిపించాను. బాగుంది ఈజీగా కనెక్ట్ అవుతారు అని అన్నారు. ఆ జోష్ లో కథ మొత్తం పూర్తి చేశాను అంటూ వేణు చెప్పుకొచ్చాడు. కాగా బలగం కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే…