International Women's Day 2024
International Women’s Day 2024: కాలం మారుతోంది. వంటింటి కుందేలు అనే చీత్కరింపు మరుగున పడిపోతుంది. మహిళల ప్రాతినిధ్యం అన్నిట్లోనూ పెరుగుతోంది. ఇంకా ప్రోత్సాహకాలు అందిస్తే అది మరింత రెట్టింపు అవుతుంది. కేంద్రం వెల్లడించిన ఇటీవల గణాంకాలే ఇందుకు ప్రబల ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్మిక విభాగం ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. 2017-18 లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 23.3 శాతంగా ఉంది. 2020-21 లో అది 32.5% పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 23.2 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాలలో అది 36.5% గా ఉంది. ఈ గణాంకాలు ఒకింత సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నప్పటికీ.. భారతదేశం మహిళా శ్రామిక శక్తిలో ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది మహిళలు ఉపాధి కోల్పోయారు. పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు తమ ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వారు పురుషులతో సమానంగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పని చేసే చోట ప్రసూతి సెలవులు, సమాన వేతనం వంటి సమస్యలు శ్రామిక శక్తిలో మహిళలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి..
స్టెమ్ సర్వే ఏం చెప్పిందంటే..
ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నత విద్యపై ఒక సర్వే నిర్వహించారు.. దీనికి స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) అని పేరు పెట్టారు. పై కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 29 లక్షల మంది యువతులు దరఖాస్తులు చేసుకున్నారు.. ఇక ఈ ఏడాది అంతకు రెట్టింపు సంఖ్యలో యువతులు దరఖాస్తులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ గణాంకాలు ఆయా కోర్సుల్లో అబ్బాయిలు చేసుకునే దానికంటే రెట్టింపు కావడం విశేషం.. ఇక 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టెమ్ లో 26 లక్షల మంది అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవడం విశేషం. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టెమ్ లో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉంది.. అయితే ఆ మరుసటి ఏడాది నుంచి మహిళలు పుంజుకున్నారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మహిళలు పురుషుల్ని అధిగమించారు. భారత్లో సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో మహిళలు 27 శాతం మంది చదువుతున్నారు. దీనిని గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక ప్రకటించింది.. ఈ గణాంకాలు బాగానే ఉన్నప్పటికీ లింగం ఆధారంగా వేతనాలు చెల్లించడం భారతదేశంలో పరిపాటిగా మారింది. జెండర్ ఆధారంగా చెల్లించే జీతాల వ్యత్యాసంలో 146 దేశాల జాబితాలో భారత్ 127 వ స్థానంలో ఉండటం బాధ కలిగించే విషయం.
పార్లమెంటు ప్రాతినిధ్యంలో..
1999లో లోక్ సభలో మహిళా రాజకీయ నాయకుల సంఖ్య 49 గా ఉండేది. అది 2019 నాటికి 78 కి పెరిగింది. ఆ తర్వాత ఉప ఎన్నికలు జరగడంతో ఆసంఖ్య మరింత పెరిగింది. ఇక రాజ్యసభలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2012 నుంచి 2021 మధ్య రాజ్యసభకు ఎంపికైన మహిళల శాతం 9.8 నుంచి 12.4 వరకు పెరిగింది. ఈ పెరుగుదల బాగానే ఉన్నప్పటికీ పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. ఇక రాజకీయ సాధికారత విషయంలో భారత్ 146 దేశాల్లో 59వ ర్యాంకు కలిగి ఉండటం విశేషం. దీనిని “జండర్ గ్యాప్” అనే సంస్థ “ఎకనామిక్ ఫోరం- 2023” పేరుతో వెలువరించిన నివేదికలో పేర్కొన్నది. అయితే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మన దేశాన్ని అధిగమించి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. టాప్ -10 దేశాలలో నిలిచింది.
నివ్వెర పరిచే వాస్తవాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం దాదాపు 18 శాతం మంది మహిళలు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉన్నారు. 2015-16 లం ఇది 22.9 శాతం గా ఉంది.. ఇక ఇటీవల కాలంలో ఊబకాయం బారిన పడే మహిళల సంఖ్య పెరిగిపోయింది. 24 శాతం మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. అదే పురుషుల్లో అయితే 22.9% మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు.. రక్తహీనత కూడా మహిళల్లో అధికంగా ఉంది. 15 సంవత్సరాల యువతుల నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు మహిళల్లో 57.2 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. 2015-16 లో 53.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. ఇక భోజనం విషయంలో మగవారికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వడంతో మహిళల్లో రక్తహీనత సంభవిస్తుంది. దీనివల్ల మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: International womens day 2024 special story in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com