Jeevan Reddy BRS join 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి రాకముందు గులాబీ పార్టీ చేసిన తప్పులను పదేపదే ఎత్తిచూపింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గులాబీ పార్టీ మాదిరిగానే తప్పులు చేస్తోంది. ముఖ్యంగా నమ్ముకున్న నాయకులను నట్టేట ముంచుతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బంగారు తెలంగాణ బ్యాచ్ నాయకులు ఎలా అయితే హవా కొనసాగించారో.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన నాయకులు అదే స్థాయిలో హవా సాగిస్తున్నారు. దీనివల్ల ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతుండగా.. ఇంకొందరేమో పార్టీలో ఉంటూ నామమాత్ర పాత్రకు పరిమితమవుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా.. పలు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా జీవన్ రెడ్డి సుపరిచితులు. నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. ఒక రకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో జీవన్ రెడ్డి తట్టుకున్నారు. అంతేకాదు ఉద్యమ సమయంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు.. కెసిఆర్ మీద జీవన్ రెడ్డి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ.. వైయస్ మాటను జవదాటకుండా ముందుకు సాగారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడిగా జీవన్ రెడ్డి కొనసాగారు.
వైయస్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి సముచిత ప్రాధాన్యం లభించింది. ఆయన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అటువంటి జీవన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన మీద గులాబీ పార్టీ అభ్యర్థి సంజయ్ పోటీ చేసి గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటినుంచి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. 2024లో జీవన్ రెడ్డికి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు.. అంతకు ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గీయులకు సముచిత ప్రాధాన్యం లభించలేదు. దీంతో జీవన్ రెడ్డి నిర్వేదానికి గురయ్యారు. ఇక ఇటీవల తన అనుచరులతో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ మార్పు గురించి వారితో చర్చించారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నట్టు జీవన్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జీవన్ రెడ్డి ఈనెల 25న వెయ్యి మంది అనుచరులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జీవన్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.