Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్రకు ఇదో గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి ఉత్తరాంధ్ర ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చేసి సామర్థ్యం ఉన్న ఈ గ్రీన్ ఫీల్డ్ మెగా ప్రాజెక్ట్.. కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే కాదు. ఒక ప్రాంతానికి ఆర్థిక ఇంజిన్ గా కూడా మారబోతోంది. ఉత్తరాంధ్రను అంతర్జాతీయ వ్యాపార, పర్యాటక పటంలో నిలపనుంది. విమానాశ్రయం అంటే కేవలం ప్రయాణికులను తరలించే ఒక కేంద్రం కాదు. ఆ ప్రాంత జీవన విధానాన్ని మార్చే ఒక సరికొత్త అధ్యాయంగా నిలవనుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.
* పారిశ్రామిక ప్రగతి..
ప్రధానంగా పారిశ్రామిక రంగం పుంజుకోనుంది ఈ విమానాశ్రయ నిర్మాణంతో. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఫార్మా, ఆక్వా, రసాయన ఐటి రంగాల ఎగుమతుల కోసం విదేశీ మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. భారీ కార్గో అండ్ లాజిస్టిక్స్ పార్క్, సుదీర్ఘమైన రన్ వే వల్ల కోడ్ ఎఫ్ వంటి భారీ సరుకు రవాణా విమానాలు నేరుగా రాకపోకలు సాగించి వీలుంది. దీనివల్ల ఉత్పత్తుల రవాణా సమయం, వ్యయం గణనీయంగా తగ్గి.. స్థానిక పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే వెసులుబాటు కలగనుంది.
* పర్యాటక ప్రాజెక్టులు..
ఉత్తరాంధ్ర అంటేనే పర్యాటకానికి పెట్టింది పేరు. అందునా సాగరనగరం విశాఖ అంటే జాతీయస్థాయిలో కూడా ప్రసిద్ధి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పర్యాటక రంగానికి కొత్త ఊపిరి ఊదుతుంది. అరకు లోయ, బొర్రా గుహలు, లంబసింగి వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలు.. సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కూత వేటు దూరంలో ఒడిస్సా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందుకే విదేశీ, అంతర్రాష్ట్ర పర్యాటకులు రాక గణనీయంగా పెరగనుంది. అయితే అంతర్జాతీయ హంగులతో నిర్మించడంతో గ్లోబల్ కనెక్టివిటీ ఏర్పడనుంది. హోటల్, హాస్పిటాలిటి, ట్రావెల్ రంగాలు విస్తరించి వేలాదిమంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడనున్నాయి.
* రవాణా రంగం అభివృద్ధి..
రవాణా రంగం సైతం గణనీయంగా అభివృద్ధి జరగనుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత పెరగనుంది. విశాఖ నగరం నుంచి భోగాపురానికి వేగంగా చేరుకునేలా ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ వే, బీచ్ కారిడార్, మెట్రో లైన్ ప్రాంతీయ రవాణాను అత్యంత సులభతరం చేయనున్నాయి. కేవలం ఉత్తరాంధ్రాకి కాదు పక్కనే ఉన్న ఒడిస్సా, చత్తీస్గడ్ లకు మరింత దగ్గర చేయనుంది. అన్నింటికీ మించి శ్రీకాకుళం – విజయనగరం- విశాఖపట్నం ను కలుపుతూ భవిష్యత్తులో బాగాపురం మహానగరంగా అవతరించే ఛాన్స్ కనిపిస్తోంది.
* ప్రజల ఆర్థిక స్థితి..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కేవలం ఒక రవాణా మౌలిక వసతి కాదు. ఉత్తరాంధ్ర ప్రజల ఆర్థిక స్థితిని మార్చే ఒక మంచి ప్రాజెక్ట్. పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించడం నుంచి స్థానిక యువతకు ఉపాధి మెరుగుపరిచే ఒక పరిశ్రమ. రాబోయే తరాలకు ఒక్క గొప్ప మార్గదర్శకంగా కూడా నిలవనుంది. ఉత్తరాంధ్ర ప్రగతి రథానికి భోగాపురం విమానాశ్రయం నిజంగానే ఒక సరికొత్త అధ్యాయం. అందుకే ఇదేదో ఒక్క మనుషుల రవాణాకు మాత్రమే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి.