Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు పేరు ఉంది. కష్ట సమయాలలో వ్యూహాలు రచించి వాటిని అమలు చేసే వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితుడే. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయనకు ఒక్క సీట్ కూడా రాలేదు. కనీసం చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు కూడా రాలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కేవలం కొంత పరిధికి మాత్రమే పరిమితం తేలిపోయింది.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలకు పనిచేస్తున్నారు. సైలెంట్ గా వర్క్ మొదలుపెట్టారు. అయితే ప్రశాంత్ కిషోర్ గురించి ఇప్పుడు మరోసారి జాతీయ మీడియాలో చర్చ మొదలైంది.. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యవహార శైలి పంటి కింద రాయిలాగా మారింది.
బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉపయోగ జరుగుతుంది. ఈ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాగా ఉంది. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లిపోయారు. ఆయన భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది.
ఈ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. ప్రచారాన్ని కూడా ముమ్మరంగా మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గంలో నిశ్శబ్ద ఓటర్లను ప్రశాంత్ కిషోర్ నమ్ముకున్నారు. యువతను కూడా ఆకర్షిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న నిశ్శబ్దమైన ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఈ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సులభంగా తీసుకోవడం లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సొంత సెగ్మెంట్ కావడంతో.. బిజెపి ఇక్కడ ఎలాగైనా గెలవాలని భావిస్తుంది. పైగా ఇక్కడ నీరజ్ కుమార్ అనే యువ నాయకుడిని పోటీలో పెట్టింది. కేవలం నితిన్ మాత్రమే కాకుండా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. కీలక నాయకులు రవిశంకర్ ప్రసాద్.. మనోజ్ తివారి.. పవన్ సింగ్.. చిరాగ్ పాశ్వాన్ వంటి వారంతా ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. వీరంతా కూడా బిజెపి అభ్యర్థి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.
అటు ప్రశాంత్ కిషోర్.. ఇటు నీరజ్ మధ్య భీకరమైన పోటీ ఉన్న నేపథ్యంలో బీహార్లో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ కూడా రంగంలోకి దిగింది. పటిష్టమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇక్కడ ఆర్జెడి అభ్యర్థిగా రేఖ గుప్త పోటీలో ఉన్నారు. ఆమె ప్రజల సమస్యలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. డ్రైనేజీ సమస్య.. రోడ్ల దుస్థితి.. మౌలిక వసతులు లేకపోవడం.. నిరుద్యోగం వంటి సమస్యలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. రేఖ తరఫున తేజస్వి యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఒకవేళ ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ వైపు ఉండే ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగితే.. తమకు ప్రయోజనం లభిస్తుందని ఆర్జెడి భావిస్తోంది. పాట్నాకు దగ్గరగా ఉండే బాంకి పూర్ నియోజకవర్గాన్ని మామూలుగా చూడకూడదు. ఇది ప్రశాంత్ కిషోర్ రాజకీయ అస్థిత్వానికి.. బిజెపి జాతీయ అధ్యక్షుడి పరువుకి.. తేజస్వి యాదవ్ రాజకీయ భవితవ్యానికి సంబంధించింది.. అందువల్లే ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జాతీయస్థాయిని ఆకర్షిస్తోంది.