Southwest Monsoon Kerala: మామూలు ఎండలు కావు. ఈసారి పాత రికార్డులు బద్దులయ్యాయి. సూర్యుడి దెబ్బకు సరికొత్తగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వడగాలులు తీవ్ర స్థాయిలో వీచాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. మండే ఎండలకు తోడుగా వడ గాలులు కూడా విపరీతంగా వీయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశం కేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. రోహిణి కార్తె కూడా ప్రవేశించడంతో వానదేవుడా వర్షం కురిపించు.. అంటూ దీనంగా వేడుకుంటున్నారు.
ఎల్ ని నో హెచ్చరికలు.. ఇతరత్రా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో.. వానదేవుడు జనాల మీద కరణ చూపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు రేపు తాకబోతున్నాయి. ఐదో తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయి. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా మొత్తం విస్తరిస్తాయి. జూన్ 15 వరకల్లా ఆంధ్ర ప్రదేశ్ మొత్తం రుతుపవనాలు వచ్చేస్తాయి. రుతుపవనాలు వచ్చినప్పటికీ ఒక వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఎండలు బాగా కొట్టాయి కాబట్టి.. వర్షాలు కూడా అదే స్థాయిలో పడతాయి అనే విషయాన్ని చెప్పలేమని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. కేరళ… తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే రాష్ట్రంలో చాలావరకు ఎండలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ.. కొన్ని ప్రాంతాలలో మాత్రం వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భీమిలి ప్రాంతంలో రెండు సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం ఎందుకు బలమైన ఉదాహరణ.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వచ్చే మూడు గంటల్లో విజయనగరం.. శ్రీకాకుళం.. జిల్లాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి.. కృష్ణాజిల్లాలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వర్షాలు స్థిరంగా కొనసాగుతాయా.. లేక ప్రారంభంలోనే కురిసి ముఖం చాటేస్తాయా.. అనే ప్రశ్నలకు వాతావరణ శాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఎల్ నీనో ప్రభావం వల్ల నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు కాకుండా… తక్కువ నీటిని వినియోగించుకునే పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
