Homeఆంధ్రప్రదేశ్‌Lets make Pawan CM : జగన్ ను దించేద్దాం సరే.. పవన్ ను సీఎం...

Lets make Pawan CM : జగన్ ను దించేద్దాం సరే.. పవన్ ను సీఎం చేద్దామా..!

Lets make Pawan CM : మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఐదేళ్లపాటు సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాల్సిన అవసరం రాష్ట్రంలో ఏర్పడిందని, అందుకు అంగీకరిస్తేనే పొత్తుకు వెళ్లాలని ఆయన తాజాగా చేసిన కామెంట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీనిపై టిడిపి ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.

మాజీమంత్రి హరి రామ జోగయ్య.. గత కొన్నాళ్లుగా కాపులు కోసం పోరాటం సాగిస్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే ఆశతో పని చేస్తున్న వ్యక్తి. ఆయన తాజాగా కీలక కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, సీఎం అయ్యేంత బలం పవన్ కళ్యాణ్ కు పెరిగిందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లు సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండాలని.. ఆ కండిషన్ తోనే పొత్తుకు సిద్ధం కావాలని ఆయన తాజాగా సూచించారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే ప్రజలకు బయలు జరుగుతుందన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

బిజెపితో కలిసి వెళ్తేనే మంచిది..

సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని ఆకాంక్షించిన హరి రామ జోగయ్య.. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపితో కలిసి వెళ్లడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తులో ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని మరిచిపోయి రాజకీయాలు సాగిస్తున్నారంటూ ఆ మధ్యకాలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపితో కలిసి పవన్ కళ్యాణ్ వెళ్లాలని హరి రామ జోగయ్య చేసిన కామెంట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. గతంలో టిడిపి – బిజెపి – జనసేన కలిసి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెబుతున్న తెలుగుదేశం పార్టీ..

జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రం అధోగతి పాల అయిందని టిడిపి విమర్శిస్తోంది. రాష్ట్రం బాగు కోసం టిడిపికి ఓటు వేయాలని, చంద్రబాబును సీఎం చేయాలని లోకేష్ తో పాటు టిడిపి నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదు అన్నది టిడిపి అభీష్టం. అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావడం వల్ల టీడీపీకి అభ్యంతరం ఉండకూడదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే వేలకోట్లు దోచుకునే పరిస్థితి ఉండదు, అవినీతికి ఆస్కారమే ఇవ్వడు. డబ్బు పైన పవన్ కళ్యాణ్ కు వ్యామోహం లేదు. అటువంటి వ్యక్తిని సీఎం చేయడం వళ్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అయితే ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే చెప్పాలి. తాజాగా హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగించేవిగానే భావించాలి.

టిడిపి సింగిల్ అజెండా అయితే ప్రకటించాలి..

జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడమే తెలుగుదేశం పార్టీ సింగిల్ ఎజెండా అయితే.. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. టిడిపి ఆ విధంగా ఆలోచన చేస్తే మెజారిటీ స్థానాల్లో జనసేన పోటీ చేసేలా అవకాశం కల్పించి, మైనారిటీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి. ఇలా చేయడం ద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు బాగుకోసం తెలుగుదేశం పార్టీకి బాధ్యత ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించామని తెలుగుదేశం పార్టీ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి అధికారం ముఖ్యం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అంత సాహసం చేసే పరిస్థితి లేకపోవచ్చు అన్నది నిపుణులు నుంచి వినిపిస్తున్న మాట.

తెలుగుదేశం పార్టీలో మారిన స్వరం..

మొన్నటి వరకు జనసేన పార్టీతో పొత్తు కోసం పాకులాడిన టిడిపి నాయకులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత ఒక్కసారిగా రూట్ మార్చారు. పొత్తు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణగా చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఆ పార్టీకి మేలు చేకూరుస్తుందో అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల నుంచి మౌనాన్ని దాల్చారు. తాజాగా హరి రామ జోగయ్య చేసిన వ్యాఖ్యలపైన జనసేన పార్టీ నాయకులు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని స్పందించలేదు. హరిరామ జోగయ్య వ్యాఖ్యలపై టిడిపి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

Most Popular